Chief Minister: ‘నమ్మ క్లినిక్’ల ద్వారా పేదల ఇంటి వద్దకే వైద్యసేవలు
ABN, First Publish Date - 2022-12-15T12:32:27+05:30
రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటిచెంతకే వైద్యసేవలు తీసుకురావాలని నిర్ణయించామని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 438 నమ్మ
- హుబ్బళ్లిలో ప్రారంభించిన ముఖ్యమంత్రి బొమ్మై
- రాష్ట్ర వ్యాప్తంగా 114 కేంద్రాలకు శ్రీకారం
బెంగళూరు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటిచెంతకే వైద్యసేవలు తీసుకురావాలని నిర్ణయించామని అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 438 నమ్మ క్లినిక్‌లను ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) వెల్లడించారు. హుబ్బళ్లి తాలూకా బైరిదేవరకొప్ప రేణుకానగర్‌లో బుధవారం నమ్మ క్లినిక్ ద్వారా వైద్యసేవలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవరాజ్‌బొమ్మై ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వైద్యరంగానికి ఏటా పదివేల కోట్లు కేటాయిస్తున్నామని, అవసరమైతే మరింత పెంచడం ద్వారా అయినా పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యత విషయంలో రాజీ లేదన్నారు. పేదరికం, అనారోగ్యం రెండు అభివృద్ధికి శత్రువులన్నారు. పేదరికంతో చిన్నారుల్లో పౌష్టికత లోపిస్తోందని, తద్వారా పలు జబ్బుల బారిన పడుతున్నారని పేర్కొన్నారు. సమాజంలో బేధాభిప్రాయాలు లేకుండా అందరికీ ఉత్తమ చికిత్సలు, ఉచితంగా మందులు ఇస్తామని తెలిపారు. వంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గ్రేడ్ పెంచామన్నారు. వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా డయాలసిస్ కేంద్రాలను ప్రాంతాలవారిగా తెరుస్తున్నామని, 60వేలకు పైబడి కేన్సర్ చికిత్సలకు 12 కిమోథెరపీ కేంద్రాలను తెరుస్తామన్నారు. 60 ఏళ్లు పైబడినవారికి ఉచిత కంటి చికిత్సలు, ఉచితంగా బధిరులకు మిషన్లు ఇస్తామని ప్రకటించారు. హుబ్బళ్లిలో రూ.350 కోట్లతో జయదేవ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1250 జన ఔషధి కేంద్రాలు ఉండగా ఏడాదిలో మరో వెయ్యి పెంచుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 30 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి 114 నమ్మ క్లినిక్‌లు ప్రారంభించామని ఇకపై వారానికి వంద చొప్పున పెంచుతూ జనవరి ఆఖరుకు 438 కేంద్రాలు పూర్తీ చేస్తామన్నారు. క్లినికల్ ల్యాబ్, పరీక్షలు, మందులు ఉచితంగా ఇస్తామన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా వంద క్లినిక్‌లు ఒకేసారి ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలోని 1.20 కోట్ల మందికి ఆయుష్మాన్ కార్డులు నమోదు జరుగుతోందని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) వాటిని ఆవిష్కరిస్తారన్నారు. నాలుగేళ్ల వ్యవధిలో 42 లక్షల మందికి ఉచిత చికిత్సలు సాధ్యమయ్యాయన్నారు. కార్యక్రమంలో మంత్రులు హాలప్పఆచార్, సీసీ పాటిల్, మాజీ సీఎం జగదీష్‌శెట్టర్, ఎమ్మెల్యే అరవిందబెల్లద్ సహా వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భాగస్వామ్యులయ్యారు.
Updated Date - 2022-12-15T12:32:30+05:30 IST