Cell phone: విద్యార్థిని సెల్‌ఫోన్ పోలీసులకు అప్పగించాలి
ABN, First Publish Date - 2022-12-16T11:05:48+05:30
కళ్లకుర్చి విద్యార్థిని సెల్‌ఫోన్(Cell phone) పోలీసు శాఖకు అప్పగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కళ్లకుర్చి
- మద్రాసు హైకోర్టు
పెరంబూర్(చెన్నై), డిసెంబరు 15: కళ్లకుర్చి విద్యార్థిని సెల్‌ఫోన్(Cell phone) పోలీసు శాఖకు అప్పగించాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కళ్లకుర్చి విద్యార్థిని మృతి వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ మృతురాలి తండ్రి రామలింగం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన న్యాయమూర్తులు, విద్యార్థిని వినియోగించిన సెల్‌ఫోన్ విచారణకు అప్పగించాలని ఇదివరకే ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో, ఈ పిటిషన్‌ను గురువారం న్యాయమూర్తి చంద్రశేఖరన్(Justice Chandrasekaran) విచారించారు. ఆ సమయంలో విచారణ నివేదికను పోలీసు శాఖ సీల్డు కవరులో దాఖలుచేసింది. అలాగే, నాలుగు సార్లు సమన్లు పంపినా, విద్యార్థిని వినియోగించిన సెల్‌ఫోన్‌ను విచారణకు పంపించలేదని, మరో రెండు నెలల్లో కేసు విచారణ పూర్తిచేస్తామని పోలీసు శాఖ తెలియజేసింది. ఆ సమయంలో, విద్యార్థిని సెల్‌ఫోన్ వినియోగించడం లేదని, హాస్టల్ వార్డెన్ సెల్‌ఫోన్(Cell phone) నుంచి తమను సంప్రదిస్తోందని పిటిషనర్ తరఫున వివరించారు. అందుకు అభ్యంతరం తెలిపిన న్యాయమూర్తి, విద్యార్థిని సెల్‌ఫోన్ అప్పగిస్తే ఏం సమస్య వస్తుందని, అసలు విద్యార్థిని వినియోగించిన సెల్‌ఫోన్ ఉందా? లేదా? అంటూ ప్రశ్నించారు. ఆధారాలున్నా వాటిని దాచిపెట్టడం చట్టరీత్యా నేరమని, అలాంటి వాటిపై విచారణకు ఆదేశించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏదిఏమైనా సెల్‌ఫోన్ ఉంటే దానిని వెంటనే పోలీసు శాఖకు అప్పగించాలని ఉత్తర్వులు జారీచేసిన న్యాయమూర్తి, తదుపరి విచారణ ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదావేశారు.
Updated Date - 2022-12-16T11:05:50+05:30 IST