CBI officials Case : సీబీఐ అధికారులపై బెంగాల్ కేసు
ABN, First Publish Date - 2022-12-15T03:18:47+05:30
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు చెందిన ఏడుగురు అధికారులపై పశ్చిమబెంగాల్ సీఐడీ కేసులు నమోదు చేసింది. బీర్‌భూమ్ జిల్లా
డీఐజీ, ఎస్పీ సహా ఏడుగురు
సీబీఐ అధికారులపై కేసు
బెంగాల్‌లో సీఐడీ అధికారుల ఎఫ్‌ఐఆర్
చట్టపరంగా ఎదుర్కొంటామన్న సీబీఐ
‘బీర్‌భూమ్’ హింస కేసులో ప్రధాన
నిందితుడైన లాలాన్ షేక్ ఉరి వేసుకొని మృతి
సీబీఐ అధికారుల వేధింపులతోనే..
పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి భార్య
మృతదేహంతో సీబీఐ ఆఫీసు ముందు నిరసన
కోల్‌కతా, డిసెంబరు 14: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు చెందిన ఏడుగురు అధికారులపై పశ్చిమబెంగాల్ సీఐడీ కేసులు నమోదు చేసింది. బీర్‌భూమ్ జిల్లా బొగ్టుయ్‌లో జరిగిన హింస కేసులో ప్రధాన నిందితుడు లాలాన్ షేక్ సీబీఐ అధికారుల కస్టడీలో మరణించాడు. ఈ ఘటనలో సీబీఐ డీఐజీ, ఎస్పీ సహా ఏడుగురు అధికారులపై హత్య, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బుధవారం సీఐడీ అధికారులు తెలిపారు. మృతుడి భార్య రేష్మా బీబీ మంగళవారం సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 21న బొగ్టుయ్‌లో టీఎంసీ నేత బాడూ షేక్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో అల్లర్లు జరిగాయి. నాటి హింసలో 10 మంది మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న లాలాన్ షేక్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే సీబీఐ అధికారులు విచారిస్తున్న కార్యాలయంలోని మరుగుదొడ్లో లాలాన్ సోమవారం ఉరి వేసుకొని మరణించాడు. తన భర్తను తీసుకొని వెళ్లే సమయంలో చంపేస్తామని బెదిరించారని.. తనను కూడా కొట్టారని రేష్మా ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం అధికారులు ఫోన్ చేసి లాలాన్ షేక్ మరణించినట్లు చెప్పారని.. అదే సమయంలో తనను, తన కొడుకును చంపేస్తామని బెదిరించారని తెలిపారు. ఈ ఆరోపణలను సీబీఐ అధికారులు కొట్టిపారేశారు. కేసుతో సంబంధం లేని సీనియర్ల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు చేర్చారో తెలియడం లేదని అన్నారు. సీఐడీ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు.
మృతదేహంతో సీబీఐ ఆఫీసు ముందు ఆందోళన
లాలాన్ షేక్ మృతికి కారకులైన సీబీఐ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం మృతదేహంతో బీర్భం జిల్లాలోని సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకొని నిరసన ప్రదర్శన చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు షేక్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు మృతదేహంతో సీబీఐ ఆఫీసు వద్ద కు చేరుకొని, షేక్ మృతికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే వారిని అరెస్టు చేయాలని, కఠినంగా శిక్షించాలని మృతుడి భార్య రేష్మా కోరారు. సీబీఐ అధికారులు హింసించడం వల్లే తన భర్త మరణించాడని ఆరోపించారు.
Updated Date - 2022-12-15T03:18:48+05:30 IST