ICMR : జ్వరానికి యాంటీబయోటిక్స్ వద్దు
ABN, First Publish Date - 2022-11-28T01:15:34+05:30
యాంటీబయోటిక్స్ వినియోగంపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వరం 100.4 నుంచి 102.2 డిగ్రీలలోపు (లో గ్రేడ్ ఫీవర్) ఉంటే యాంటీబయోటిక్స్ వాడడం మంచిది కాదని హెచ్చరించింది. అలాగే వైరల్ ..
వైద్యులకు ఐసీఎంఆర్ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, నవంబరు 27: యాంటీబయోటిక్స్ వినియోగంపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. జ్వరం 100.4 నుంచి 102.2 డిగ్రీలలోపు (లో గ్రేడ్ ఫీవర్) ఉంటే యాంటీబయోటిక్స్ వాడడం మంచిది కాదని హెచ్చరించింది. అలాగే వైరల్ బ్రాంకైటి్‌సకు కూడా యాంటీబయోటిక్స్ వినియోగంలో జాగ్రత్త వహించాలని సూచించింది. దగ్గు, శ్లేష్మం పడడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చలి, కొద్దిపాటి జ్వరం వంటివి వైరల్ బ్రాంకైటిస్ లక్షణాలు. ఇటువంటి కేసుల్లో వైద్యులు సాధ్యమైనంత వరకు యాంటీబయోటిక్స్ ఇవ్వకుండా ఉండాలని పేర్కొంది. ఇవ్వాలనుకుంటే పేషెంట్ హిస్టరీని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. చర్మ, మృదు కణజాల ఇన్ఫెక్షన్లు, ఇతరుల ద్వారా సోకిన (కమ్యూనిటీ) న్యుమోనియాకు ఐదు రోజులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు న్యుమోనియా వస్తే 8 రోజుల పాటు యాంటీబయోటిక్స్ వాడాలని సూచించింది. ‘ఇన్ఫెక్షన్ కారకాలు ఏమిటో చాలావరకు క్లినికల్ డయాగ్నసిస్ ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని కాదని గుడ్డిగా ప్రొకాల్సిటోనిన్ లెవెల్స్, డబ్ల్యూబీసీ కౌంట్స్, రేడియాలజీ వంటి వాటిపై ఆధారపడడం తగద’ని మార్గదర్శకాల్లో పేర్కొంది. యాంటీబయోటిక్స్‌ను ఇష్టమొచ్చినట్టు వాడుతుండడంతో అవి ప్రభావవంతంగా పనిచేయడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021 జనవరి 1 నుంచి డిసెంబరు 31 వరకు నిర్వహించిన సర్వే ఫలితాలను ఐసీఎంఆర్ వెల్లడిస్తూ తాజా హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. మన దేశంలో చాలామంది రోగులకు శక్తిమంతమైన యాంటీబయోటిక్‌గా పేరున్న కార్బపినమ్ ఇచ్చినా ప్రయోజనం ఉండడం లేదని సర్వేలో తేలిందని పేర్కొంది.
న్యుమోనియా, సెప్టి్‌సమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న రోగులను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నప్పుడు కార్బపినమ్ ఇస్తుంటారు. అలాగే ఇమిపినమ్ అనే మరో యాంటీబయోటెక్‌కు కూడా బ్యాక్టీరియా తేలిగ్గా లొంగడం లేదని తెలిపింది. దీన్ని ఇకోలి బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు చికిత్సలో వాడుతుంటారు. బ్యాక్టీరియాకు ఈ ఔషధాన్ని తట్టుకునే శక్తి 2016లో 14 శాతం ఉండగా 2021లో 36 శాతానికి పెరిగిందని ఐసీఎంఆర్ వివరించింది. అలాగే క్లెబ్‌సియెల్లా న్యుమోనియె అనే బ్యాక్టీరియా కూడా మొండిఘటంలా మారుతోంది. కొన్ని రకాల యాంటిబయోటిక్స్‌కు అది 2016లో 65 శాతం ప్రభావితమైతే 2020లో 45 శాతానికి, 2021లో 43 శాతానికి తగ్గిపోయిందని తెలిపింది. ఇలా బ్యాక్టీరియా, వైర్‌సలు నిరోధక శక్తిని పెంచుకుంటుండడంతో రోగులకు చికిత్స కష్టమవుతోందని వివరించింది. తీవ్రంగా జబ్బు పడిన ఐసీయూ పేషెంట్లలో 70 శాతం మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు యాసినిటొబ్యాక్టర్ అనే బ్యాక్టీరియా కారణమవుతుంటుంది. 87.5 శాతం పేపెంట్లలో ఈ బ్యాక్టీరియా కార్బపినమ్ యాంటీబయోటిక్‌ను నిరోధిస్తున్నట్టు తేలిందని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. లక్షణాలను బట్టి గుర్తించగల అనేక క్లినికల్ వ్యాధులకు స్టఫిలికొకస్ ఓరియస్ అనే బ్యాక్టీరియా కారణం. ఇది కూడా ఎరిత్రోమైసిన్, క్లిండామైసిన్, సిప్రోఫ్లాక్సిన్, కో-ట్రైమోక్సజోల్ వంటి ఔషధాలను తట్టుకునేట్టు తయారవుతోందని ఐసీఎంఆర్ తెలిపింది.
Updated Date - 2022-11-28T01:15:35+05:30 IST