11 ఏళ్ల చిన్నారిపై బడిలోనే గ్యాంగ్‌రేప్
ABN, First Publish Date - 2022-10-07T09:09:32+05:30
దేశరాజధాని ఢిల్లీ కేంద్రీయ విద్యాలయలో.. 11 ఏళ్ల బాలికపై 11, 12 తరగతి విద్యార్థులిద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారు! ఎప్పుడో జూలైలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరుగుదొడ్లోకి లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడిన
11, 12 తరగతుల విద్యార్థులు
ఢిల్లీలోని కేవీలో ఘోరం
జూలైలో ఘటన..
సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్
న్యూఢిల్లీ, అక్టోబరు 6: దేశరాజధాని ఢిల్లీ కేంద్రీయ విద్యాలయలో.. 11 ఏళ్ల బాలికపై 11, 12 తరగతి విద్యార్థులిద్దరు అఘాయిత్యానికి పాల్పడ్డారు! ఎప్పుడో జూలైలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన ఘోరం గురించి బాధిత బాలిక ఆ రోజే టీచరుకు చెప్పినప్పటికీ.. నిర్వాహకులు కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంతో ఇన్నాళ్లూ బయటపడలేదు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో బయటపడింది. బాలిక ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. జూలైలో ఒకరోజు ఆమె తన తరగతి గదికి వెళ్తుండగా, పొరపాటున ఇద్దరు సీనియర్లను ఢీకొంది. వారిద్దరూ 11, 12 తరగతుల విద్యార్థులు. వెంటనే వారికి క్షమాపణ చెప్పినప్పటికీ.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఆమెను మరుగుదొడ్లలోకి లాక్కెళ్లి తలుపు గడియ పెట్టి అత్యాచారం చేశారు. బాలిక ఈ విషయాన్ని టీచర్‌కు చెప్పగా.. ఆ అబ్బాయిలిద్దరినీ బడి నుంచి బహిష్కరించామని, దీనిపై ఎక్కడా మాట్లాడొద్దని టీచర్ చెప్పినట్లు బాలిక పేర్కొంది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఢిల్లీ మహిళా కమిషన్.. పోలీసులకు, ప్రిన్సిపాల్‌కు విడివిడిగా నోటీసులు జారీ చేసింది. ‘‘దేశ రాజధానిలో చివరికి బడిలో కూడా పిల్లలకు రక్షణ లేకపోవడం దురదృష్టకరం. దీనిపై కఠినచర్యలు తీసుకోవాలి. స్కూలు అధికారుల పాత్రపై తప్పనిసరిగా విచారణ జరగాలి’’ అని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. కాగా.. కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. స్కూల్ వర్గాలు మాత్రం.. బాధిత బాలికగానీ, ఆమె తల్లిదండ్రులు గానీ ఈ విషయాన్ని తమ దృష్టికి తేలేదని, పేరెంట్ మీటింగ్‌లో కూడా ఈ దారుణం గురించి చెప్పలేదని పోలీసులు విచారణకు వచ్చినప్పుడే విషయం తెలిసిందని అంటున్నారు.
Updated Date - 2022-10-07T09:09:32+05:30 IST