Australia Baby Spinach: విషపూరిత పాలకూర.. అనారోగ్యం పాలైన ప్రజలు..
ABN, First Publish Date - 2022-12-17T20:04:04+05:30
విషపూరిత పాలకూర తిని పలువురు ఆస్ట్రేలియన్లు తీవ్ర అనారోగ్యం పాలైన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఎన్నారై డెస్క్: విషపూరిత పాలకూర(Poisonous Spinach) తిని పలువురు ఆస్ట్రేలియన్లు తీవ్ర అనారోగ్యం పాలైన ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. రివియేరా ఫార్మ్‌స్ ప్రైవేట్ లిమిటెడ్(Riviera Pvt Ltd) సంస్థ సాగు చేసిన బేబీ స్పినాచ్(Baby Spinach) విషపూరితంగా మారడంతో అది తిన్న పలువురు అనారోగ్యం బారినపడ్డారు. బాధితుల్లో డిలీరియం, గుండెదడ, చూపు మందగించడం, నోరు తడారిపోవడం, జ్వరం తదితర లక్షణాలు కనిపించాయి. దీంతో.. రివియేరా సంస్థ పాలకూరను పలు సూపర్ మార్కెట్ల నుంచి రీకాల్ చేసింది. అయితే.. పొలంలోనే పాలకూర ఏదైన విషపూరిత పదార్థంతో కలుషితమై ఉండొచ్చని రివియేరా సంస్థ పేర్కొంది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ సూపర్‌మార్కెట్ సంస్థలు రివియేరా బేబీ స్పినాచ్ అమ్మకాలను నిలిపివేశాయి. ఈ బేబీ స్పినాచ్‌తో చేసిన ఉత్పత్తులను కూడా అక్కడి సూపర్ మార్కెట్లో తొలగించాయి.
ఆస్ట్రేలియా(Australia) ఆరోగ్య శాఖ కూడా ప్రజలకు కీలక సూచన చేసింది. రివియేరా బేబీ స్పినాచ్ ఇంట్లో ఉంటే దాన్ని వెంటనే పారేయాలని సూచించింది. డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 28 మధ్య ఎక్స్‌పైరీ డేట్ కలిగిన బేబీ స్పినాచ్‌తోనే ఈ సమస్య ఉన్నట్టు అక్కడి అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి మొత్తం 47 మంది పాలకూర కారణంగా అనారోగ్యం పాలైనట్టు అధికారులు వెల్లడించారు. పాలకూరతో అనారోగ్యం పాలైనవారు తక్షణం పాయిజన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు సమాచారం అందించాలని ప్రభుత్వం ట్విటర్ వేదికగా కోరింది. తీవ్ర సమస్యలు తలెత్తిన సందర్భాల్లో వైద్యులను సంప్రదించాలని సూచించింది.
Updated Date - 2022-12-17T20:08:29+05:30 IST