తెలంగాణలో శాతవాహన చరిత్రకు ఆధారాలేంటి? పోటీ పరీక్షల ప్రత్యేకం!
ABN, First Publish Date - 2022-07-18T21:21:02+05:30
దక్షిణ భారతంలో తొలి సామ్రాజ్యంగా శాతవాహన సామ్రాజ్యం గుర్తింపు పొందింది. శాతవాహనుల పరిపాలన కాలంపై చరిత్రకారుల్లో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. పురాణాలు
దక్షిణ భారతంలో తొలి సామ్రాజ్యంగా శాతవాహన సామ్రాజ్యం గుర్తింపు పొందింది. శాతవాహనుల పరిపాలన కాలంపై చరిత్రకారుల్లో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. పురాణాలు ప్రధానంగా మత్స్య, వాయు పురాణాల ప్రకారం బీసీఈ 225 నుంచి సీఈ 230 వరకు వీరి పాలన సాగింది. శాసనాల ఆధారంగా బీసీఈ ఒకటో శతాబ్దం నుంచి సీఈ 225 వరకు పరిపాలన సాగింది.
శాతవాహన వంశ మూలాలు, విస్తరణపై నేటికీ చరిత్రకారుల రచనల్లో ఏకాభిప్రాయం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ పరీక్షల కోసం ప్రిపేరవుతున్న అభ్యర్ధులు శాతవాహనుల చరిత్ర-సంస్కృతిని తెలంగాణ కోణంలో ఆవిష్కరించాలి.
దక్షిణ భారతదేశంలో తొలి సామ్రాజ్యంగా ఏర్పడిన శాతవాహన రాజ్యం సుదీర్ఘ కాలం మనుగడలో ఉంది. తెలంగాణ భౌగోళిక ప్రాంతమైన గోదావరి - పెద్దవాగు సంగమ ప్రాంతమైన కోటిలింగాల కేంద్రంగా ఈ రాజ్యం ఆరంభమై, భారతదేశమంతా విస్తరించడం తెలంగాణీయులకు గర్వకారణం. గ్రూప్స్ పరీక్షల కోసం సంసిద్ధమవుతున్న విద్యార్థులు శాతవాహన సమగ్ర చరిత్రను తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. దీని నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది.
తెలంగాణ కోణం అంటే
ప్రాచీన చరిత్ర అధ్యయనంలో పురావస్తు, చారిత్రక ఆధారాలకు పరిమితులుంటాయి. చరిత్ర గమనాన్ని స్పష్టంగా నిర్ధారించడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో శాతవాహనుల గురించిన అధ్యయనంలో తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి శాతవాహనులతో ఉన్న సంబంధం, తెలంగాణలో లభించిన శాతవాహనుల ఆధారాలు వాటిలో నాణాలు, శాసనాలు, నిర్మాణాలు, లిఖిత వాఙ్మయం ఆధారంగా శాతవాహనుల చరిత్రను తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తెలంగాణ చరిత్ర, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ఆసక్తులకు అనుగుణంగా సమాచార సేకరణ చేసుకోవాలి.
శాతవాహనుల మూలంపై భిన్న వాదనలు
శాతవాహన మూలాలు ప్రస్తుత మహారాష్ట్రలోని విదర్భలో ఉన్నాయని మిరాశి, శ్రీనివాస అయ్యంగార్ తదితర చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. వీరు ప్రధానంగా నాసిక్, పైఠాన్ ప్రాంతాల శాసనాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రముఖ చరిత్ర అధ్యయనకారుడు సూక్తాంకర్ అభిప్రాయంలో వీరి మూలాలు కన్నడ భౌగోళిక ప్రాంతంలో ఉన్నాయి. శాతవాహనుల పేర్లు కన్నడ భాష, సంస్కృతికి ప్రతిబింబాలుగా ఉన్నాయి. హన్మంతరావు, కోటిరెడ్డి తదితర చరిత్ర రచయితలు శాతవాహన మూలాలు కోస్తా ఆంధ్రకు చెందినవి. ఆంధ్ర బృత్యులు అనే పదం పురాణాల్లో ప్రస్తావించారు.
తెలంగాణ చరిత్రకారులు పై వాదనల్లోని డొల్లతనాన్ని ప్రశ్నిస్తూ శాతవాహన వంశ మూలాలు, తొలి రాజులు తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి చెందినవారేనని నిరూపిస్తున్నారు. తెలంగాణ చరిత్రకారులు ప్రధానంగా తొలి రాజుల నాణాలు తెలంగాణ భౌగోళిక ప్రాంతాల్లోనే లభ్యమయ్యాయనే అంశాన్ని ప్రధానంగా ఉటంకిస్తున్నారు. ఠాగూర్ రాజారాం సింగ్, డాక్టర్ సంగంపట్ల నర్సయ్య, పి.వి.పరబ్రహ్మశాస్త్రి, కృష్ణశాస్త్రి తదితరులు తెలంగాణ- శాతవాహన సంబంధాలపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు. ప్రముఖ నాణాల పరిశోధకులు డాక్టర్ దామెరాజారెడ్డి తెలంగాణలో లభించిన ఆధారాల్లో నాణాల ప్రాతిపదికగా శాతవాహనుల మూలాలు తెలంగాణ అని నిర్ధారించారు. శాతవాహనుల మూలాలు తెలంగాణలోనే ఉన్నట్లుగా భావిస్తున్న అంశాలను, ప్రతిపాదిస్తున్న సిద్ధాంతాలను కింది సూత్రీకరణ ద్వారా అవగతం చేసుకోవచ్చు.
- లభించిన శాసనాల సమాచారం ప్రకారం శాతవాహన రాజ్య స్థాపకుడు సిరిముఖుడు లేదా శ్రీముఖుడు. ఈయనకు సంబంధించిన తొలి నాణాలు కోటిలింగాల, కొండాపూర్ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి.
- కోటిలింగాలలో గుర్తించిన పురాతన మట్టిదిబ్బల అవశేషాలు వీరు నిర్మించిన మట్టి కోటలుగా భావిస్తున్నారు. మట్టికోట నిర్మాతలైన వీరిని శాలివాహనులని కూడా అంటున్నారు.
- కళింగ పరిపాలకుడు ఖారవేలుడు వేయించిన ‘హాతిగుంఫా’ శాసనాన్ని అనుసరించి అతని సైన్యాలు పశ్చిమంగా ప్రయాణం చేసి శాతవాహనరాజు శాతకర్ణితో తలపడ్డాయి. కళింగకు పశ్చిమాన ఉన్న ప్రాంతం ప్రస్తుత తెలంగాణయే.
- బృహత్కథ గ్రంథం రచయిత గుణాడ్యుడి పుట్టిన స్థలం కొండాపూర్‌గా భావిస్తున్నారు. బృహత్కథ గ్రంథంలో, హాలుడి గాథసప్తశతి కావ్యంలో వర్ణించిన అనేక భౌగోళిక, సాంఘిక స్థితిగతులకు తెలంగాణతో సంబంధం ఉంది.
- పురావస్తు శాఖకు చాలాకాలం డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన పి.వి.పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయాన్ని అనుసరించి, హాలరాజు వివాహం గురించి వివరించిన ‘లీలావతి పరిణయం’లో భీమేశ్వర ఆలయాన్ని వర్ణించారు. ధర్మపురి ప్రాంతంలోని వేంపల్లి వెంకట్రావుపేట వద్ద గల భీమేశ్వర ఆలయం అదేనని తెలియచేసింది.
- శాతవాహనులు విదేశీ వాణిజ్యం ప్రధానంగా రోమ్ నగర రాజ్యాలతో సాగింది. తెలంగాణలోని నుస్తుల్లాపూర్, కీసర, కొండాపూర్, కోటిలింగాల ప్రాంతాల్లో అనేక రోమన్ నాణాలు లభించాయి.
శాతవాహన పేరు ఎలా వచ్చింది?
శాతవాహన పేరు ఆవిర్భావంపై చరిత్రకారుల్లో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. తెలంగాణ నేలపై రాసిన తొలి గ్రంథంగా భావిస్తున్న బృహత్కథలో ‘శాత’ అనే పేరు గల యక్షుడి పేరున ఈ వంశం ఆరంభమైనట్లుగా పేర్కొన్నారు. ‘మిరాశి’ అభిప్రాయం ప్రకారం శాతవాహనుల వద్ద శత ఏనుగుల సంపద ఉన్నందువల్ల వీరిని శాతవాహనులుగా పిలిచారు. భారతదేశ చరిత్రలో భిన్న ఒరవడి రచనలకు ఆధ్యుడైన డి.డి.కోశాంబి, శాతవాహనులు సూర్య ఆరాధకులని, సప్త గుర్రాలతో కూడిన రథంపై ఉన్న సూర్యుడిని ఆరాధ్యదైవంగా భావించారని, అందుకే వీరిని సత్ వాహకులుగా శాతవాహనులుగా గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. జయప్రభసూరి, హేమచంద్రుడి అభిప్రాయం ప్రకారం శాతవాహనుల తొలి నిర్మాణాలు మట్టికోటలు. వాటి ఆధారంగా వీరిని శాలివాహనులుగా గుర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రముఖ ఆంధ్ర చరిత్రకారుడు బి.ఎ్‌స.ఎల్.హన్మంతరావును అనుసరించి శాతవాహన రాజ్యస్థాపకుడైన శ్రీముఖుని తాత పేరు శాతవాహనుడు. ఈయన ద్వారానే వంశానికి ఈ పేరు వచ్చిందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో శాతవాహన ఆధారాలు
తెలంగాణ భౌగోళిక ప్రాంతానికి, శాతవాహన చరిత్రకు ప్రధాన సాక్ష్యాలు నాణాలు. వీటి అధ్యయనాన్ని ‘న్యూమిస్‌మ్యాటిక్స్’గా పిలుస్తారు. ఈ శాస్త్ర అధ్యయనాన్ని అనుసరించి కోటిలింగాల, కొండాపూర్‌లలో లభించిన నాణాలు తొలి శాతవాహన రాజులకు సంబంధించినవి. సీసం, రాగితో కూడిన పొటిన్ నాణాలు తెలంగాణ ప్రాంతంలో మాత్రమే లభ్యమయ్యాయి. కొండాపూర్ ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతం శాతవాహనులకు టంకశాల ట్రెజరీగా ఉపయోగపడింది. నుస్తుల్లాపూర్, కీసరగుట్టల్లో రోమన్ నాణాలు బయటపడ్డాయి.
కోటిలింగాల, కొండాపూర్, కదంబపూర్, మునులగుట్ట, దుళికట్ట, పెద్దబంకూర్ మొదలైన ప్రాంతాల్లో నిర్మించిన, ప్రస్తుతం శిథిలమైన మట్టికోటలతో శాతవాహనులకు సంబంధం ఉన్నట్లుగా తెలియవస్తోంది. వాస్తవంగా శాతవాహనుల గుహ శాసనాల్లో అత్యధిక భాగం ప్రస్తుత మహారాష్ట్రలోని విదర్భ భాగంలో ఉన్నాయి. ఈ భాగం చాలాకాలం వరకు హైదరాబాద్ రాజ్యంలో భాగంగా ఉండేవి. ‘నానాఘాట్ శాసనం’, ‘నాసిక్ శాసనం’, ‘కన్హేరి శాసనం’, ‘కార్లే శాసనాలు’ వీటిలో ప్రధానమైనవి. ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని మొక్కట్రావుపేట శాసనం కూడా శాతవాహన కాలం నాటిదేనని చరిత్రకారుల అభిప్రాయం.
శాతవాహనుల రాజకీయ చరిత్ర
శాతవాహనుల రాజకీయ చరిత్రకు ప్రధాన ఆధారాలు వారు వేయించిన శాసనాలు, సమకాలీన రాజవంశీయుల శాసనాలు, ఓడిన రాజుల నాణాలపై ముద్రించిన శాతవాహన చిహ్నాలు. పురాణాలు, శాసనాలు, నాణాల ఆధారంగా దాదాపు 30 మంది రాజులు శాతవాహన వంశానికి చెందినవారు పరిపాలించినట్లుగా తెలుస్తోంది. మత్స్యపురాణం ఈ రాజుల వరుసక్రమాన్ని గుర్తించడంలో కీలకమైంది. ఈ రాజులలో చిముఖుడు లేదా సిరిముఖుడు లేదా శ్రీముఖుడు తొలివాడు. కోటిలింగాలలో స్థానిక రాజైన సమగపుడి వద్ద మహాతళవరిగా పనిచేస్తూ, ఆ అధికారాన్ని కూలదోసి స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసినట్లుగా నాణాల ఆధారంగా గుర్తించారు. చిముఖుడి అనంతరం అతని కుమారుడు చిన్న వయస్సులో ఉన్నందువల్ల తమ్ముడు కన్హుడు రాజ్యపాలన చేశాడు. ఈయన వివరాలు కార్లే గుహలో లభించాయి. చిముఖుడి పాలన కోటిలింగాల కేంద్రంగా సాగింది.
చిముఖుడి కుమారుడు శాతకర్ణిగా గుర్తించారు. నానాఘాట్ శాసనాన్ని అనుసరించి నాగనిక ఈయన భార్య. కళింగ పాలకుడు ఖారవేలుడు ఇతని సమకాలీనుడు. వీరిమధ్య జరిగిన యుద్ధం గురించి హతిగుంఫా శాసనం వివరిస్తుంది. నాటి పట్టణ పరిపాలన వివరాలను నానాఘాట్ శాసనం తెలియచేస్తోంది.
మొదటి శాతకర్ణి కుమారుడైన వేదశ్రీ కాలంలో పైఠాన్ ప్రస్తుత మహారాష్ట్ర గోదావరీ తీరనగరం వీరికి రెండో రాజధానిగా మారింది. శాతవాహన తొలి రాజుల్లో రెండో శాతకర్ణి గొప్పవాడు. ఇతని వివరాలు సాంచి స్థూప దక్షిణ ద్వారంపై అతని ఆస్థాన కళాకారుడు వశిష్ఠపుత్ర ఆనందకుడు చెక్కాడు. దీని ఆధారంగా ఇతని కాలంలో రాజ్యం మధ్యభారతం వరకు విస్తరించినట్లుగా తెలుస్తోంది.
శాతవాహన రాజుల్లో కుంతల శాతకర్ణి, పదిహేడో రాజైన హాలుడు సాహితీప్రియులు. హాలుడు అనేక ప్రాకృత పద్యాలను సేకరించి ’గాథ సప్తశతి’ని విడుదల చేశాడు. ఇది భారతదేశంలో విడుదలైన తొలి కవితా సంకలనం. కవిరాజుగా హాలునికి గుర్తింపునిచ్చింది.
శాతవాహన రాజుల్లో గొప్పవాడిగా గుర్తింపుపొందినవాడు గౌతమీపుత్ర శాతకర్ణి. ఇతని వివరాలు అతని తల్లి గౌతమీ బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో ఉన్నవి. శకరాజు నహపాలుడిని ‘జుడేల్ తంచి’ యుద్ధంలో ఓడించిన ఘనత ఇతనిది. సీ.ఈ.78లో నూతన శాలివాహన శకాన్ని ఆరంభించి, అనేక బిరుదులు పొందాడు.
గౌతమీపుత్ర శాతకర్ణి కుమారుడు రెండో పులమావి పైఠాన్ నగరాన్ని పునర్ నిర్మించాడు. ధాన్యకటకం పట్టణ నిర్మాణ రచన ఇతని కాలంలోనే జరిగి, నవ నగర నిర్మాతగా గుర్తింపుపొందాడు.
శాతవాహన రాజుల్లో ప్రత్యేకమైనవాడు 27వ రాజైన యఙ్ఞశ్రీ శాతకర్ణి. విదేశాలతో వాణిజ్య నిర్మాత. బౌద్ధ మతానికి తన గురువు ఆచార్య నాగార్జునుడితో కలిసి గొప్ప సేవలను అందించాడు. శాతవాహన చివరిరాజుగా 3వ శివమాకను గుర్తిస్తున్నారు. కొద్దిమంది చరిత్రకారులు వీరిని నాలుగో పులోమావిగా కూడా ప్రస్తావిస్తారు. చివరకు వీరి సామంతులైన ధనిక, పుజియ, ఇక్ష్వాకుల తిరుగుబాట్ల వల్ల ఈ రాజ్యం పతనమైంది.
సాంఘిక, ఆర్థిక చరిత్ర
రాజ్యానికి ప్రధాన ఆధారం భూమిశిస్తు, పండిన పంటలో 18.1 వరకు శిస్తు చెల్లించాలి. వ్యాపారాన్ని నిర్వహించే సమూహాలను వృత్తి సంఘాలుగా, శ్రేణులుగా పిలిచేవారు. గ్రామీణ వ్యవస్థను ఆష్ఠదశ లేదా 18 వృత్తులుగా వర్గీకరించారు. శాతవాహనుల కాలంలో రాజులు, పాలకవర్గాలు మొదటిశ్రేణిగా, వ్యాపారులు రెండో శ్రేణిగా, వృత్తిదారులు మూడో శ్రేణిగా, శ్రామికులు నాలుగో శ్రేణిగా గుర్తించారు. ‘టాలమీ’ రాసిన ‘ద గైడ్ టు జియోగ్రఫి’, ‘ప్లీనీ’ రాసిన ‘నేచురల్ హిస్టరీ’ ఆధారంగా శాతవాహనులు విదేశీ వ్యాపారం రోమ్ నగర రాజ్యాలతో సాగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో లభించిన నాణాలపై అగస్టీస్ సీజర్‌ల బొమ్మలున్నాయి.
శాతవాహనుల కాలం నాటికి కులవ్యవస్థ క్రమంగా ఘనీభవించింది. రాజులు జైనం, బౌద్ధ, వైదిక మతాలను ఆదరించారు. స్త్రీ స్వేచ్ఛకు అవకాశాలున్నట్లుగా నాగనిక, గౌతమీ బాలశ్రీల ఉదంతాలు ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. ఆర్యదేవుడు, ఆచార్య నాగార్జునుడు బౌద్ధ గురువులుగా, ఆర్హబలి జైన గురువుగా ప్రసిద్ధి చెందారు.
-డాక్టర్ రియాజ్
సీనియర్ ఫ్యాకల్టీ, అకడమిక్
డైరెక్టర్, 5 మంత్ర కెరీర్ పాయింట్, హైదరాబాద్
Updated Date - 2022-07-18T21:21:02+05:30 IST