ఫోన్ ఇస్తే చదువుతారా? బైజూస్ పాఠాలపై పేరెంట్స్‌లో ఆందోళన
ABN, First Publish Date - 2022-10-17T21:30:52+05:30
ఆన్లైన్ విద్యా విధానంపై మొగ్గు చూపుతున్న రాష్ట్ర సర్కారు విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతోంది. బైజూ్‌స పాఠాలు చెప్పేందుకు గాను పాఠశాలలకు విద్యార్థులు స్మార్ట్ఫోన్లు తెచ్చుకోవాలని ఇటీవల నిర్ణయించడంపై విమర్శలు
4 నుంచి 10 తరగతులకు బైజూస్ పాఠాలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల చేతికి స్మార్ట్ఫోన్లపై తల్లిదండ్రుల్లో ఆందోళన
కరోనా సమయంలోనే విజయవంతం కాని వైనం
సర్కారు తాజా నిర్ణయంపై విమర్శల వెల్లువ
(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి): ఆన్లైన్ విద్యా విధానంపై మొగ్గు చూపుతున్న రాష్ట్ర సర్కారు విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతోంది. బైజూ్‌స పాఠాలు చెప్పేందుకు గాను పాఠశాలలకు విద్యార్థులు స్మార్ట్ఫోన్లు తెచ్చుకోవాలని ఇటీవల నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోధన మాట పక్కన పెడితే పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్లు ఇవ్వడమేమిటనే ప్రశ్న అంతటా తలెత్తుతోంది. విద్యార్థులు సక్రమంగా వినియోగిస్తే పర్వాలేదు కానీ గాడి తప్పితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా సర్కారు తాజా నిర్ణయంతో అందరిలోనూ గుబులు రేగుతోంది. జిల్లాలోని అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల్లో 4 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుచు విద్యాశాఖ ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా తొలుత ప్రతిఒక్క విద్యార్థి విధిగా తల్లిదండ్రుల నుంచి స్మార్ట్ ఫోన్లను పాఠశాలలకు తీసుకురావలసి ఉంటుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఇది భారంగా మారనుంది. ప్రస్తుతం ప్రతి ఇంటిలో స్మార్ట్‌ఫోన్ ఉంటున్నా.. ఇప్పటికీ సాధారణ మొబైల్స్ వాడేవారు కూడా ఉన్నారు. ఇటువంటి వారు తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఎలా కొంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం నాణ్యమైన ఫోన్ కొనాలంటే రూ.12 వేల వరకూ వెచ్చించాలి. ఇప్పటికప్పుడు ఇంతమొత్తం ఎక్కడ నుంచి తేవాలని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 1722 ఉన్నాయి. నాలుగు నుంచి టెన్త్ వరకూ చదువుతున్న విద్యార్థులు దాదాపు 84,987 మంది ఉన్నారు. కాగా మొదట పాఠశాలల హెచ్ఎంలు తరగతుల వారీగా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ ఉన్నది లేనిది విషయాలు తెలుసుకొవాల్సి ఉంది. ఆ వివరాలను యూడైస్ లాగిన్‌లో స్మార్ట్ ఫోన్ నెంబర్‌తో సహా డేటాను క్యాప్చరింగ్ చేసి ఎంటర్ చేయాలి. ఇప్పటికే ప్రతి పాఠశాలలో విద్యార్థి నుంచి వివరాలు సేకరించడాన్ని ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఈ నెల 20 తేదీతో ముగించాల్సి ఉంది. తొలుత 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల ఫోన్ నెంబర్లు స్వీకరించనున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లను పాఠశాలలకు తీసుకొస్తే విద్యార్థులు చదువుతున్న పాఠ్యాంశాల కంటెంట్‌ను ఉపాధ్యాయులు అప్లోడ్ చేస్తారు. ఈ ప్రక్రియలో జిల్లాలోని 15 మండలాలు, పురపాలక సంఘాల పరిధిలో గల క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీలు) హెచ్ఎంలకు పూర్తిస్థాయిలో సహకారాన్ని అందించాలి. యాప్‌ను ఇన్స్టాలేషన్ చేయడానికి తరగతుల వారీగా ఈ నెల 21 నుంచి రోజుకు ఒక్క తరగతి చొప్పును ఈ నెల 28 వరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. కాగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్న ప్రభుత్వహామీ ఇప్పటికీ అమలు కాలేదు. ఇదిలా ఉండగా కరోనా సమయంలో కొన్ని పాఠశాలల్లో ఆన్లైన్ బోధన అమలు చేసినా.. విజయవంతం కాలేదు. మరోవైపు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టిన తర్వాత కూడా సర్కారీ పాఠశాలల్లో ఫలితాలు అంతంతమాత్రమే. పాఠశాలల విలీనం తర్వాత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇటువంటి పరిస్థితుల్లో బైజూస్ పేరిట విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆదేశాలు రాలేదు
బైజూస్ పాఠాలు చెప్పేందుకు గాను పాఠశాలలకు విద్యార్థులు స్మార్ట్ఫోన్లు తెచ్చుకోవాలనే దానిపై విద్యాశాఖ కమిషనర్ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఆదేశాలు వచ్చిన తరువాత తెలియజేస్తాం.
-ఎన్వీ రమణ, జిల్లా విద్యాశాఖ అధికారి, పార్వతీపురం
Updated Date - 2022-10-17T21:30:52+05:30 IST