కోట్లు పోసి చదివిస్తున్నారు సరే.. అవకాశాలేవీ?
ABN, First Publish Date - 2022-10-17T17:38:01+05:30
ఎంబీబీఎస్ చదవడం అంటే గొప్ప! పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారంటే సమాజంలో ఆ తల్లిదండ్రుల పట్ల గౌరవ భావం! ‘వాళ్లకేంటి.. డాక్టర్లు. ఇక లైఫ్ సెటిలైపోయినట్లే’.. వైద్యవిద్య అభ్యసించే వారి పట్ల అందరికీ ఉండే అభిప్రాయం! ఇదంతా
ఆ తర్వాత వైద్యులకు అవకాశాలేవీ?
పీజీ సీటు రాకుంటే.. ప్రైవేటులో అరకొర వేతనాలకు పని చేయాల్సిందే!
పల్లెలకు వెళ్తే మంచి భవిష్యత్తు.. కానీ, వెళ్లరు!..
ఎంబీబీఎస్‌లు, తల్లిదండ్రులూ ఆలోచించాల్సిందే
అప్పు చేసి చదివిస్తే అంతే సంగతులు..
బీ, సీ కేటగిరీల్లో చేరే ముందు ఆలోచించండి
మధ్యతరగతికి వైద్య రంగ నిపుణుల సూచన..
15 నుంచి వైద్య విద్యా సంవత్సరం షురూ
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చదవడం అంటే గొప్ప! పిల్లలు ఎంబీబీఎస్ చదువుతున్నారంటే సమాజంలో ఆ తల్లిదండ్రుల పట్ల గౌరవ భావం! ‘వాళ్లకేంటి.. డాక్టర్లు. ఇక లైఫ్ సెటిలైపోయినట్లే’.. వైద్యవిద్య అభ్యసించే వారి పట్ల అందరికీ ఉండే అభిప్రాయం! ఇదంతా నాణేనికి ఒక పార్శ్వం మాత్రమే..! సమాజంలో గౌరవం, మంచి జీవితం, డాక్టరైతే చాలు జీవితంలో దేనికీ లోటుండదనే భావన.. ఇలా కారణం ఏదైతేనేం.. తల్లిదండ్రులు తమ పిల్లలను వైద్య విద్య చదివించడానికి ఆసక్తి చూపుతుంటారు. ఫ్రీ సీట్లయితే పర్వాలేదు కానీ.. కొందరు బీ, సీ కేటగిరీ సీట్లలో చేర్చించి రూ.లక్షలు, కోట్లు పెట్టి మరీ ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. డబ్బున్న వారికి ఇబ్బందేమీ ఉండదు. మధ్యతరగతి వారు, అప్పులు చేసి చదివించే వారి పరిస్థితి మాత్రం ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అంత ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చదివించాక వారికి సరైన ఉపాధి దొరకడం లేదు! ఎంబీబీఎస్ సీట్లు బాగానే అందుబాటులోకి రావడంతో చదివించేస్తున్నారు. ఆ తర్వాత వారిలో చాలా మందికి పీజీలో సీట్లు దక్కడం లేదు. ఇలాంటి వారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ, వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వైద్యులకు పట్టణ ప్రాంతాల్లో సరైన అవకాశాలు రాక సతమతమవుతున్నారు. మరోవైపు పిల్లలను చదివించడానికి చేసిన అప్పులు గుదిబండలా మారి తల్లిదండ్రులూ ఆందోళన చెందుతున్నారు.
అప్పు చేసి చదివిస్తే అంతే సంగతులు
డాక్టర్ కుస్మిత (పేరు మార్చాం) ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో బీ కేటగిరీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. పీజీ సీటు రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవాఖానాలో కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్‌గా చేరారు. ఖమ్మం జిల్లాలోని పల్లె దవాఖానాలో వైద్యురాలిగా నియమితులైన ఆమెకు నెలకు రూ.42 వేల వేతనం ఇస్తున్నారు.
డాక్టర్ రేశ్వంత్(పేరు మార్చాం) ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో సీ కేటగిరీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గత ఏడాది నీట్ పీజీ రాస్తే మంచి ర్యాంకు రాలేదు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్‌గా చేరారు. నెలకు రూ.25 వేల వేతనం ఇస్తున్నారు.
ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే! రాష్ట్రంలో వేలాది మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు అప్పు చేసి మరీ పిల్లల్ని వైద్య విద్య చదివించవద్దని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీటు వస్తే పర్వాలేదు. కానీ, మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటాలో మాత్రం చదవించవద్దని పేర్కొంటున్నారు. ఆర్థికంగా స్థితిమంతులకు భారం ఉండదు. కానీ, జీతాలపై బతికేవాళ్లు, మధ్యతరగతి ప్రజలు మాత్రం ఈ విషయంలో ఆలోచించాలని కోరుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో వచ్చే నెల 15 నుంచి వైద్య విద్య విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే కౌన్సెలింగ్ మొదలైంది. రాష్ట్రంలో 6500 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వాటిలో 3500 వరకు కన్వీనర్ కోటా సీట్లు. మిగిలినవన్నీ మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లే. ఇందులో బీ కేటగిరీకి కాలేజీని బట్టి ఏడాదికి రూ.11.50 లక్షల నుంచి రూ.13 లక్షల వరకు ఫీజులున్నాయి. ఇక సీ కేటగిరీ సీట్లకు ఏడాదికి రూ.23-26 లక్షల ఫీజులు ఉన్నాయి. ఒక్క కన్వీనర్ కోటాలో మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో ఏడాదికి రూ.10 వేలు, ప్రైవేటు కాలేజీల్లో రూ.60 వేల ఫీజులున్నాయి. ఇవన్నీ కూడా అధికారికంగా ప్రభుత్వ జీవో మేరకు చెల్లించాల్సిన ఫీజులు. బీ, సీ కేటగిరీల్లో సీటు వస్తే చేరేముందు ఆలోచించాలని వైద్య రంగ నిపుణులు తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.
పిల్లలకు సీటు వచ్చిందన్న ఆనందంతో ముందు ఎలాగోలా చేర్పించేస్తున్నారు. ఏడాది తర్వాత వారికి తత్వం బోధపడుతోంది. ఫీజులు చెల్లించలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో బీ, సీ కేటగిరీల్లో చదివే మధ్యతరగతి ఆడపిల్లల తల్లిదండ్రుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. కొందరు ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోకుండా చేర్పించేస్తున్నారని హైదరాబాద్ సమీపంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రతినిధి తెలిపారు. అప్పటి వరకు కూడబెట్టుకున్న సొమ్మును ఫస్టియర్‌కు కట్టేస్తున్నారు. సెకండియర్‌కు వచ్చేసరికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. ఎంబీబీఎస్ పూర్తయ్యేనాటికి బీ కేటగిరీ విద్యార్థుల తల్లిదండ్రులకు సుమారు రూ.60-70 లక్షల అప్పు ఉంటోంది. ఎంబీబీఎస్ పూర్తయ్యే సమయానికి అమ్మాయికి పెళ్లి చేయాల్సి ఉంటుంది. అలాగే పీజీ సీటుకు మళ్లీ డబ్బులు వెతుక్కోవాలి. ఇలా భారాలన్నీ ఒకేసారి తల్లిదండ్రులపై పడుతున్నాయని ఖమ్మంలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీ ప్రతినిధి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
ఉద్యోగ అవకాశాలెంత?
ధనవంతుల్లో కొంతమంది తమ పిల్లలకు నీట్ ర్యాంకు రాకున్నా, సమాజంలో గౌరవం కోసమే వైద్యవిద్యను చదివిస్తున్నారు. ఇది పూర్తిగా వారి వ్యక్తిగతం. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ, పిల్లలకు సీటు వచ్చిందని కొందరు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతికి చెందిన వారు ప్రైవేటులో బీ, సీ కేటగిరీల్లో చేర్పించేస్తున్నారు. ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నాటికి ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి వైద్య కళాశాలల సంఖ్య 55కు చేరనుంది. వాటిలో 7500 ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి. అంటే నాలుగేళ్ల తర్వాత ఏటా 7500 మంది ఎంబీబీఎస్ వైద్యులు బయటకు వస్తారు. వీరికి తోడు ఇతర రాష్ట్రాల్లో చదివేవారు, డీమ్డ్ వర్సిటీలతో పాటు విదేశాల్లో చదివేవారు మరో 2500 మంది వరకు ఉంటారని వైద్యవర్గాలు వెల్లడించాయి. వెరసి ఏటా ఒక్క మన రాష్ట్రంలోనే పది వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు. అంతమందికి పట్టణాల్లోనే ఉపాధి అంటే కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
660 మందికో వైద్యుడు..!
ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ కౌన్సిల్‌లో 53 వేల మంది వైద్యులు రిజిస్టరై ఉన్నారు. అంటే ప్రతి 660 మందికి ఒక వైద్యుడు ఉన్నట్లు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల మేరకు ప్రతి 1000 మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలి. ఆ లెక్కన చూస్తే మన దగ్గర వైద్యులు ఎక్కువగానే ఉన్నారు. కానీ, వీరంతా పట్టణాలకే పరిమితమవుతున్నారు. అదే సమస్యగా మారుతోంది. పల్లెలకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. తక్కువ జీతమైనా సిటీల్లోనే పనిచేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. గ్రామాల్లో ఇప్పటికీ మెజారిటీ ప్రజలు ఆర్‌ఎంపీ, పీఎంపీలపైనే ఆధారపడుతున్నారు. ఎంబీబీఎస్ తర్వాత పీజీ సీటు దక్కనివారంతా పల్లెల్లో వైద్య సేవలందిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వైద్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధికి కూడా ఢోకా ఉండదంటున్నారు. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీల్లో బీ, సీ కేటగిరీల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో వైద్యులుగా చేరుతున్నారు. అక్కడ అవకాశం రాని వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో డ్యూటీ డాక్టర్లుగా చేరుతున్నారని ఓ వైద్యుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
వైద్యులకు ఉపాధి ఉంటుంది
వైద్యులకు ఉపాధి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే అవి పల్లెలకు వెళ్తేనే ఉంటాయి. ప్రస్తుతం మెజారిటీ వైద్యులు పట్టణాలకే పరిమితం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో వారికి సరైన ఉపాధి ఉండడం లేదు. జనాభా ఎక్కువగా ఉండే మారుమూల ప్రాంతాల్లో కూడా పనిచేయగలిగితే కచ్చితంగా వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకు తగ్గట్లుగా ఉపాధి కూడా లభిస్తుంది.
- డాక్టర్ గురువారెడ్డి, ఎండీ, సన్‌షైన్ హాస్పిటల్స్
నాన్ క్లినికల్‌కే ఉపాధి అవకాశాలు ఎక్కువ
ప్రస్తుతం పీజీ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. క్లినికల్‌లో 12 విభాగాలుంటే నాన్ క్లినికల్‌లో 8 విభాగాలున్నాయి. నీట్ పీజీలో మంచి ర్యాంకు వచ్చిన వారు నాన్ క్లినికల్‌లో చేరడం లేదు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో వైద్యవిద్య అధ్యాపకులే దొరకని పరిస్థితి నెలకొంది. నీట్ పీజీలో ర్యాంకుతో సంబంధం లేకుండా నాన్ క్లినికల్‌లో సీటు ఇచ్చేలా కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. దీనిపై ఇప్పటికే నేను లేఖ కూడా రాశాను. ఎంబీబీఎస్‌తో ప్రస్తుతం ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో నాన్ క్లినికల్ చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. వారికే మెరుగైన ఉపాధి అవకాశాలుంటాయి.
- డాక్టర్ కిషన్‌రావు, ఐఎంఏ ఖమ్మం అధ్యక్షుడు
అప్పు తీర్చుకోగలుగుతారా అన్నది చూసుకోవాలి
వైద్యవిద్య కోసం అప్పులు చేసి చదివిస్తున్న తల్లిదండ్రులు.. చదువు పూర్తయ్యాక తిరిగి ఆ అప్పును తీర్చగలరా అన్న విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మెజారిటీ తల్లిదండ్రులు తమ పిల్లలు వైద్యవిద్య అభ్యసిస్తే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో అప్పులు చేసి చదివిస్తున్నారు. ఎంబీబీఎస్ చేయగానే లైఫ్ సెటిల్ అవ్వదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్కువ మంది ఎంబీబీఎస్ వైద్యులు రావడం వల్ల పల్లె ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలను రీప్లేస్ చేయాల్సిన పరిస్థితులుంటాయి. అలాగే వీరంతా క్షేత్రస్థాయిలో ఫ్యామిలీ వైద్యులుగా మారితేనే మంచి ఉపాధి ఉంటుంది.
- తూము మోహన్‌రావు, ప్రశాంతి హాస్పిటల్ ఎండీ, వరంగల్
Updated Date - 2022-10-17T17:38:01+05:30 IST