సంస్కృతంలో శాసనాలు వేయించిన తొలి భారతీయ రాజు ఎవరు?
ABN, First Publish Date - 2022-07-11T21:08:23+05:30
హిందూమతంలో అత్యంత విలువైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదాలను ‘శ్రుతులు’ అని అంటారు. ‘విజ్’ అనే పదం నుంచి వేదం ఆవిర్భవించింది. ‘విజ్’ అంటే జ్ఞానం అని అర్థం. లేదా
హిందూమతంలో అత్యంత విలువైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదాలను ‘శ్రుతులు’ అని అంటారు. ‘విజ్’ అనే పదం నుంచి వేదం ఆవిర్భవించింది. ‘విజ్’ అంటే జ్ఞానం అని అర్థం. లేదా తెలియుట అనే మరో అర్థం కూడా ఉంది. వేదాలు భగవంతుని ద్వారా తెలుపబడినవి అని, అవి మానవుల చేత రచింపబడలేదు అని కొందరి విశ్వాసం. అందువల్ల వేదాలను ‘అపౌరుషేయములు’ అని కూడా పిలుస్తారు.
వేదాలను ‘రుగ్వేదం’, ‘యజుర్వేదం’, ‘సామవేదం’, ‘ఆధర్వణవేదం’ అని నాలుగు రకాలుగా వ్యాసుడు విభజించాడు. వీటిని పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే తన శిష్యులకు ఉపదేశించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురు శిష్యపరంపరగా ఈ నాలుగు వేదాలు వేల సంవత్సరాలుగా తరతరాలకు సంక్రమిస్తూ వచ్చాయి. అలా మౌఖికంగా ఉన్న వేదాలు గుప్తులకాలంలో లిఖిత రూపంలోకి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు.
రుగ్వేదం
ప్రపంచంలోని తొలి మత గ్రంథం. రాజకీయ గ్రంథంగా కూడా చెప్పవచ్చు. దీనిలోని 10వ మండలంలో ‘పురుష సూక్తం’ ఉంది. దీనిలో వర్ణ విధానం గురించి ప్రస్తావన ఉంది.
రుగ్వేదంను మాక్స్ ముల్లర్ జర్మనీ భాషలోకి అనువదించాడు. మాక్స్ ముల్లర్ గొప్ప తత్వవేత, పండితుడు, అనువాదకుడు కూడా. ‘తపింజ్ విశ్వవిద్యాలయం నుంచి విద్యను అభ్యసించాడు. ‘హితోపదేశ’ అనేది 13వ శతాబ్దంలో బెంగాల్ ప్రాంతంలో ప్రాచుర్యంలో ఉన్న నైతిక విలువలతో కూడిన కథలు. దీనిని ఆంగ్లంలోకి చార్లెస్ విల్కిన్సన్ అనువదించగా, మాక్స్‌ముల్లర్ జర్మనీ భాషలోకి అనువదించాడు. అప్పటి అతని వయస్సు 20 సంవత్సరాలు మాత్రమే. ఇది మాత్రమే కాకుండా ముల్లర్ అనేక భారతీయ గ్రంథాలను అనువాదం చేశాడు. వాటిలో ముఖ్యమైనవి...
1. నలమహారాజ చరిత్ర ‘అభిజ్ఞానశాకుంతలం’
2. రుగ్వేదంను ’ఖ్చిఛిట్ఛఛీ ఆౌౌజుట ౌజ ఉ్చటడ’ పేరుతో అనువాదం చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారు.
యజుర్వేదం
దీనిని తెల్లవేదంగా, నల్లవేదంగా చెప్పవచ్చు. శుక్లవేదం, కృష్ణవేదంగా కూడా ప్రసిద్ధి. ఇది సగ భాగం పద్య రూపంలో, సగ భాగం గద్య రూపంలో ఉంది. దీనిలో యజ్ఞయాగాదుల గురించి, ఆద్యాత్మిక విషయాలను పొందుపరిచారు.
సామవేదం
భారతీయ సంగీతానికి మూలం సామవేదం. సామం అంటే మధురమైనది అని అర్థం. యాగాలలో దేవతల గొప్పతనాన్ని మధురంగా కీర్తించేది సామవేదం. 1895లో ‘రాల్ఫ్ గ్రిఫిత్’ సామవేదం ఆంగ్లానువాదం చేశాడు. సామవేదంలోని ‘కౌతుమీయ’ శాఖ గుజరాత్‌లో ప్రాచుర్యంలో ఉంది. ‘రాహమనీయ’ శాఖ మహారాష్ట్రలో ఉంది.
అధర్వణ వేదం
వేదాల్లో చివరిది అధర్వరణ వేదం. ‘ఆధర్వణ రుషి’ పేరు మీదుగా దీనికి ఆ పేరు వచ్చింది. దీనిలో ఆత్మలు, ప్రేతాత్మలు మొదలైన వాటి గురించి పేర్కొన్నారు. వైద్య శాస్త్రం గురించి మొదటగా ప్రస్తావన కూడా దీనిలోనే ఉంది. రోగాలకు కారణమయ్యే క్రిమి, కీటకాదులు వంటి జీవుల సమాచారం ఇందులో పొందుపర్చారు. శత్రుసైనికులను రోగపీడితులను చేసే క్రిమి కీటకాదుల ప్రయో గం మొదలైన విషయాలు ఇందులో ఉన్నాయి.
వేదాంగాలు
ఇందులో శిక్షా(ఉచ్ఛారణ), ఛందస్సు(మీటర్), వ్యాకరణం, నిరుక్తం(పదకోశం), జ్యోతిషం (ఖగోళశాస్త్రం), కల్పం(వేడుకలకు సంబంధించింది) అనే ఆరు విషయాలు ఉన్నాయి.
ఉపవేదాలు: 1.ఆయుర్వేదం(వైద్యం),
2. ధనుర్వేదం(సైనిక శాస్త్రం),
3. గాంధర్వం(సంగీత శాస్త్రం),
4. శిక్ష
ఉపనిషత్తులు
హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగం. వేదాల చివరి భాగాలే ఉపనిషత్తులు. నాలుగు వేదాలకు కలిపి చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. వీటిలో 108 మాత్రమే ప్రధానమైనవి. వాటిలో 10 ఉపనిషత్తులు ఇంకా ముఖ్యమైనవి. వాటిని ‘దశోపనిషత్తులు’ అంటారు. మండూక్య, కథోపనిషత్, ప్రశ్నోపనిషత్ మొదలైనవి. ఉప+సి+షత్ = ఉపనిషత్. ఉప అంటే సమీపంగా, సి అంటే కింద, షత్ అంటే కూర్చునుట. అంటే.. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించడం.
మొగల్ చక్రవర్తి షాజహాన్ కుమారుడు దారాషిఖో 1657లో పర్షియన్ భాషలోకి 50 ఉపనిషత్‌లను అనువాదం చేశాడు. ఈ అనువాదం పేరు ‘సిర్-ఇ-అక్బర్’. ఇతను ఇంకనూ సూఫీమత గురువుల సిద్ధాంతాలను క్రోడీకరించి ‘మజ్మ్- ఊల్ - బహెరెన్’ పేరుతో పర్షియన్ భాషలో రాశాడు. స్వామి లోకేశ్వరనాథ్ ఉపనిషత్‌లను బెంగాలీ భాషలోకి అనువాదం చేశాడు. ఉపనిషత్తుల సారమే భారతీయ తత్వం.
మౌర్యుల కాలంలో సాహిత్యం
కౌటిల్యుని ‘అర్థశాస్త్రం’, మెగస్తనీస్ ‘ఇండికా’ మౌర్యుల కాలంలో వచ్చిన సుప్రసిద్ధ గ్రంథాలు. ఒకటి సంస్కృతం, మరొకటి గ్రీకు భాషలో వచ్చాయి. ఇద్దరూ చంద్రగుప్త మౌర్యుని కాలంలో నివసించినవారే. కౌటిల్యుని అర్థశాస్త్రానికి...అశోకుని రాకతో భారతీయ చరిత్రలో నూతన శకం ఆరంభమైనది అని చెప్పవచ్చు. అశోకుడు తొలిసారిగా పాళి, బ్రాహ్మి లిపిలో శాసనాలు వేయించాడు. కానీ, సంస్కృతంలో మాత్రం 150 క్రీ.శ. కాలంలో రుద్రదమనుడు చెక్కించాడు. జునాగడ్(గుజరాత్)లో మౌర్యుల పాలనాంశాలను తెలుసుకోవడానికి అనేక గ్రీకు చరిత్రకారులు, పరిశోధకులు భారతదేశానికి వచ్చారు. గ్రీకులకు, మౌర్యులకు మధ్య జరిగిన యుద్ధాలను జస్టిన్ అనే చరిత్రకారుడు వివరించాడు. అలాగే పాటలీపుత్రం నగర నిర్మాణం, పాలనారంగం గురించి మెగస్తనీస్, ఎరాన్, మాక్స్‌క్రిండల్ తదితరాలు రాశారు.
కౌటిల్యుని అర్థ శాస్త్రం ప్రాధాన్యం
ప్రపంచంలోని అనేక భాషల్లోకి ఈ గ్రంథం అనువాదం పొందింది. ముఖ్యంగా ‘ది ప్రిన్స్’ రచయిత మాకియవెల్లి ఈ గ్రంథంలోని అంశాలనే రాయడం గమనార్హం. మాకియవెల్లికి, కౌటిల్యునికి సుమారు 1900 సంవత్సరాల భేదం ఉంది. కౌటిల్యుడు 299 క్రీ.పూ. అర్థ శాస్త్రాన్ని సంస్కృతంలో రచిస్తే, దానిని డాక్టర్ శ్యామశాస్త్రి 1904లో ఆంగ్లంలోకి అనువాదం చేశారు. మాకియ వెల్లి 1610లో ‘ద ప్రిన్స్’ రాశాడు.
అర్థశాస్త్రంలోని ముఖ్యంశాలు
‘సప్తాంగ సిద్ధాంతం’, రాజుకు ఉండాల్సిన ముఖ్య లక్షణాలు గురించి వివరంగా రాశాడు. రాజు, ప్రధాన మంత్రి, రాజ్యం, దుర్గం, కోశం, సైన్యం, స్నేహితులు ఎలా ఉండాలో కౌటిల్యుడు రాశాడు. రాజ్యం అనే బండికి ‘రాజు- ప్రధాన మంత్రి’ ఇరు చక్రాల వంటివారు, ఏ ఒక్కరూ సరిగ్గా లేకపోయినా రాజ్యం ఒక చక్రం గల బండిలాగ అవుతుందని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అలాగే రాజ్యంలోని 18 రకాల బానిసల గురించి, వారి విధులు, లక్షణాల గురించి వివరించాడు. ఈ గ్రంథం పాశ్చాత్యదేశాలకు ప్రామాణిక గ్రంథంగా మారిందనడంలో ఎలాంటి అనుమానం లేదు.
మెగస్తనీస్ ఇండికా
మెగస్తనీస్ రాసిన గ్రంథం ప్రస్తుతం అలభ్యం. కానీ, వివిధ గ్రీకు చరిత్రకారుల రచనల్లో ఈ గ్రంథానికి సంబంఽధించిన వివరాలు ఉన్నాయి. మెగస్తనీస్ భారతదేశం సందర్శించిన తొలి గ్రీకు రాయబారి. సెల్యుకస్ నికేటర్ గ్రీకు రాజు ఆస్థానం నుంచి చంద్రగుప్తుని ఆస్థానాన్ని మెగస్తనీస్ సందర్శించాడు. భారతీయ సమాజంలో 7 కులాలు ఉన్నాయని, బంగారు పుట్టలు పెట్టే చీమలు ఎన్నో కలవని తన గ్రంథంలో మెగస్తనీస్ పేర్కొన్నాడు. పాటలీపుత్రం నగరాన్ని సందర్శించి వర్ణించాడు. ఈ నగరం గ్రీకులోని ‘పెర్సిపోలీ్‌స’ను పోలి ఉందని, 9 1/2 మైళ్ల పొడవు, 2 1/2 మైళ్ల వెడల్పుతో 570 బురుజులు, 64 ద్వారాలు ఈ నగరంలో ఉన్నాయని రాశాడు. పాలనాంశాల గురించి వివరిస్తూ మౌర్యుల సమాజంలో తత్వవేత్తలు, సైనికులు, రైతులు, కార్మికులు, కులవృత్తులవారు, న్యాయాధికారులు, సలహాదారులు అనే ఏడు కులాలు ఉన్నాయని వివరించాడు. దొంగతనాలు లేవని, ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసేవారు కారని, మరణ శిక్ష సర్వ సాధారణమని, సతీసహగమనం ఉందని రాశాడు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో వాస్తవ అంశానికి సుదూరమైనది?
1. సిర్ - ఇ - అక్బర్ : అక్బర్ జీవిత చరిత్ర
2. మజ్మ్ - ఉల్ -బహెరెన్: సూఫీ మతగురువుల చరిత్ర
3. అర్థశాస్త్రం(ఆంగ్లంలో): శ్యామ శాస్త్రి
ఎ) 1 మాత్రమే బి) 2, 3 మాత్రమే
సి) 1, 2 మాత్రమే డి) 1, 3 మాత్రమే
2. కింది శాసనాలు, అవి నెలకొల్పబడిన ప్రాంతాలను గుర్తించండి?
1. జునాగఢ్ - గుజరాత్
2. రుమ్మిందై - బిహార్
3. ఇసిల - నేపాల్ 4. పింప్ర - సారనాథ్
ఎ) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
బి) 1-ఎ, 2-సి, 3-డి, 4-బి
సి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
డి) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
3. సంస్కృతంలో శాసనాలు వేయించిన తొలి భారతీయ రాజు?
ఎ. అశోకుడు బి. అజాత శతృ
సి. రుద్రదమనుడు
డి. గౌతమీ పుత్ర శాతకర్ణి
4. మెగస్తనీస్ ‘ఇండికా’ గ్రంథంలో పేర్కొన్న అంశాలు ఏవి?
1. భారతీయులు అవినీతి పరులు
2. భారతీయ సమాజంలో 7 కులాలు కలవు
3. ఉరి శిక్షలు సర్వసాధారణం
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) 1, 2, 3
5. కౌటిల్యుడు తన అర్థ శాస్త్రంలో పేర్కొన్న వాస్తవ సంఘటనల గురించి సరైనవి గుర్తించండి?
1. ఆంగ్లంలోకి శ్యామశాస్త్రి అనువాదం చేశారు
2. అవినీతి గురించి రాసిన తొలి గ్రంధం
3. బానిసలు, వారి విధులు, వారిలోని రకాలను వివరించాడు
ఎ) 1,2 బి) 2, 3
సి) 1,2,3 డి) 1, 2, 3 అవాస్తవాలు
సమాధానాలు:
1)ఎ; 2)బి; 3)సి; 4)బి; 5)సి
-డా. పగిడిమర్రి మురళి
చరిత్ర శాఖాధిపతి,
పీజీ కళాశాల, సికింద్రాబాద్
Updated Date - 2022-07-11T21:08:23+05:30 IST