ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది ఎవరి బంగారు తెలంగాణ?

ABN, First Publish Date - 2022-10-18T06:07:07+05:30

నీళ్లు,నిధులు, నియమాకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం మొదలైనవి లక్ష్యాలుగా పెట్టుకుని అరవై ఏళ్ళ పోరాటం తర్వాత సాధించుకున్న స్వరాష్ట్రంలో గత ఎనిమిదేళ్ళుగా పేద వర్గాల ప్రజలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీళ్లు,నిధులు, నియమాకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం మొదలైనవి లక్ష్యాలుగా పెట్టుకుని అరవై ఏళ్ళ పోరాటం తర్వాత సాధించుకున్న స్వరాష్ట్రంలో గత ఎనిమిదేళ్ళుగా పేద వర్గాల ప్రజలను ప్రభుత్వం దానం చేస్తే తీసుకునే బిచ్చగాళ్లుగా మార్చారు మన నాయకులు, అధికారులు. ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, దళిత బంధు, రైతుబంధు మొదలైన పథకాలకయ్యే డబ్బంతా ఎవరి సొంత జాగీరులో చెమటోడ్చి అమ్మి ఇస్తున్నట్టు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు గత ఎనిమిదేళ్లుగా దాదాపు వివిధ రకాల పన్నుల ద్వారా, మద్యం కొనుగోళ్ల ద్వారా, వాహన రిజిస్ట్రేషన్లూ పన్నుల ద్వారా, అపరాధ రుసుముల ద్వారా రూ.16లక్షల కోట్ల డబ్బును చెల్లిస్తేనే ఈ పథకాలన్నీ సాధ్యమయ్యాయి. అభివృద్ధి సంక్షేమ పథకాలను అందజేసే బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తున్నారు మన ప్రజా ప్రతినిధులు, పాలకులు. పేద ప్రజలకు వారు ఇస్తున్నది ఏమీ లేదు. ప్రజల కష్టార్జితమైన సొమ్మునే నాయకులు భోంచేస్తున్నారన్నది అసలు వాస్తవం. గత ఎనిమిదేళ్ళుగా కొత్త ప్రభుత్వం అమలు చేసిన ప్రాజెక్టులు కాళేశ్వరం, మిషన్ భగీరథ, కాకతీయ మిషన్ మొదలైనవన్నీ అధికార వర్గాల అక్రమార్జనకు మాత్రమే ఉపయోగపడ్డాయని నిపుణులు ఘోషిస్తున్నారు.


ప్రాజెక్టులు, వివిధ సంక్షేమ పథకాలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందని ఇది మన దేశంలోనే గాక ప్రపంచంలోనే అద్భుతమైన, ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనా అని కేసీఆర్ కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి ప్రచార సాధనాలు నిత్యం గోబెల్స్ ప్రచారం చేయడం మేధావులూ ప్రజలూ గమనిస్తూనే ఉన్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమే కావచ్చునన్న భ్రమలో పడతారు ప్రజలు. కొన్ని వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకురావడం అవసరమనిపిస్తున్నది.


అభివృద్ధి నమూనాకు ఒక ప్రాతిపదిక, శాస్త్రీయమైన దృక్పథం ఉండాలి. ఆ దారిలో సుస్థిరమైన మానవ ప్రగతి, సమాజంలో గుణాత్మకమైన, పరిమాణాత్మకమైన అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా జీవన విధానంలో గణనీయమైన మార్పు రావాలి. గత ఎనిమిదేళ్ళల్లో మన రాష్ట్ర ఆర్థిక సామాజిక రంగాల ముఖచిత్రం నిశితంగా పరిశీలించినట్లయితే మన అవినీతిపరులైన రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు తమ ఆస్తులను వందల కోట్లకు, వందల ఎకరాలకు అనతికాలంలోనే విస్తరించుకోగలిగారన్నది అర్థమవుతుంది. నాయకులు ఫామ్ హౌసులు, ఎస్టేట్లు సంపాదించారు. అనేక కార్పొరేటు వ్యాపారాల్లో డైరెక్టర్లుగా, వాటాదారులుగా ప్రవేశించగలిగారు. కార్పొరేటు పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, జాతీయ రహదారుల వెంట వందలాది ఎకరాల రియల్‌ ఎస్టేట్ వెంచర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు కంపెనీలు, క్రషర్లు, పెట్రోల్ పంపులు, పబ్బులు, క్యాసినోలు, లిక్కరు వ్యాపారాలలో కీలక పాత్రధారులుగా రూపొందారు. కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు గత అరవై ఏళ్ళల్లో సాధించలేని ఈ తరహా అభివృద్ధిని బంగారు తెలంగాణ నిర్మాతలు కేవలం ఎనిమిదేళ్లల్లోనే సాధించారు!


ఏ సమాజ అభివృద్ధికైనా విద్య ప్రధాన సాధనం. ఆరోగ్య వ్యవస్థకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. వ్యవసాయ రంగం అత్యధిక శాతం గ్రామీణ ప్రజలకు ఉపాధి ఆదాయాలను కల్పించే ఆర్థిక వ్యవస్థ గనుక అది కూడా కీలకమైనది. విస్తరించి, వికేంద్రీకరించబడిన పారిశ్రామిక వాడలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక వహిస్తాయి. అలాగే ఎదుగుతున్న యువతకు గౌరవప్రదమైన బతుకుతెరువు ఉండాలి. పాలనలో అణచివేతలేని జీవన సరళి సాధ్యం కావాలి. బలహీనులు, మహిళల పట్ల వివక్ష లేని పాలన సాగాలి. వీటన్నింటితోపాటు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం మొదలగునవన్నీ అభివృద్ధి సూచికలో భాగమేనని మన రాష్ట్ర పాలకులు గుర్తించడం లేదు కాబోలు.


మన పాలకులు, వారి సలహాదారులు నిత్యం రాష్ట్ర తలసరి ఆదాయం గురించి, స్థూల ఆదాయం గురించి కాకి లెక్కలు చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన అభివృద్ధి సూచికలను ప్రమాణంగా తీసుకొని మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రమో బేరీజు వేయటం ఇప్పుడు అవసరమే.


రాష్ట్ర తలసరి ఆదాయం 2 లక్షలకు పైగా పెరిగిందని మన పాలకులు చెబుతున్నారు. కేవలం తలసరి ఆదాయం ప్రజల వాస్తవిక జీవన ప్రమాణాలను ప్రతిబింబించదు. రాష్ట్రంలోని 10 శాతం కుటుంబాలు రాష్ట్రంలోని 74శాతం ఆస్తులను, భూములను, కార్పొరేట్ వ్యాపారాలను నియంత్రిస్తున్నాయి. మిగిలిన 90 శాతం కుటుంబాలు కేవలం 26శాతం ఆదాయాలను ఆస్తులను కలిగి ఉన్నాయి. ఇది కాదనలేని నిజం.


రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 90 శాతం వరకు కనీస వసతులు లేకుండా ఉన్నాయి. గత పదేళ్ళ నుంచి ఉపాధ్యాయుల నియామకాలు ఆగిపోయాయి. వీటి నియంత్రణ వ్యవస్థ బలహీన పడింది. ఈ పాఠశాలల నిర్వహణకు సాధారణ ఖర్చులు కూడా కొరవడ్డాయి. ప్రభుత్వ జూనియరు కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరింత దీనావస్థలో ఉన్నాయి. నిధులు లేక, నియమాకాలు లేక, పడిపోతున్న ప్రమాణాలతో, ఇక్కడ విద్య నేర్చుకున్న విద్యార్థులు గౌరవప్రదమైన ఉద్యోగాలు ఉపాధులు పొందలేకపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కొరకై శిక్షణ తీసుకొని కళ్ళల్లో వత్తులు పెట్టుకొని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న యువతకు గత ఎనిమిదేళ్లుగా ఎండమావులే ఎదురయ్యాయి.


ఇక ప్రభుత్వ వైద్యశాలలు చాలావరకు మార్చురీలకు అనుకూలంగా ఉన్నాయని వేరే చెప్పనవసరం లేదు. కరోనా సంక్షోభంలో ఆక్సిజన్ లేక బెడ్స్ దొరక్క వేలాదిమంది అకాల మరణం చెందారు. ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడిని పేద మధ్యతరగతి ప్రజలు భరించలేక అల్లాడిపోయారు. మన నాయకులు కార్పొరేటు స్థాయిలో వైద్యం అంటూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిసిపోయాయి. ఎలుకల ట్రీట్‌మెంట్, వికటించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి ఉదంతాలు ప్రజలను ప్రభుత్వ దవాఖానాలకు మరింత దూరం చేసింది.


గత నాలుగేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా పథకాలకు ఖర్చుపెట్టిన మొత్తం రూ.58వేల కోట్లయితే, అందులో రైతులకు అందింది 50 శాతానికి మించలేదు. నిత్యం మట్టితో పోరాటం చేసే కౌలు రైతులకు అసలేమీ దక్కలేదు. గత ఇరవై ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న రైతుల మరణాలు ఈనాటికీ ఆగలేదు. ఈ రైతు బీమా, రైతు బంధు పథకాల లాభం కార్పొరేటు సంస్థల యజమానులకు, రాజకీయ ‘వి’నాయకులకు, కొంత ఎన్నారైలకు, మరికొంత రిటైర్డ్ ఆఫీసర్లకు అత్యధికంగా దక్కుతున్నది. కాకులను కొట్టి గద్దలకు పంచినట్టు పేదోడి కష్టార్జితం పన్నుల రూపంలో వసూలు చేసి ధనవంతులకు పంచే పథకాలే ఇవన్నీ. నేరుగా రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలను– ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ మొదలైనవాటి విషయంలో రైతులకు ఇతోధికంగా సబ్సిడీలు అందించే విధానాలను– ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేవి. వాటి వల్లనే రైతులకు ఎంతో కొంత లబ్ధి జరిగేది.


ప్రభుత్వ మద్యం విధానం ప్రజల పాలిట రాక్షస విధానంగా మారింది. తెలంగాణలో 2014లో మద్యం అమ్మకాల ద్వారా సంవత్సరానికి రూ.9వేల కోట్ల ఆదాయం వచ్చింది. అది ఇప్పుడు 2022–23లో రూ.42వేల కోట్లకు చేరుతున్నదని అధికారుల, ఆర్థిక నిపుణుల అంచనా. ప్రభుత్వ నికర ఆదాయంలో మద్యం నుంచి వచ్చే ఆదాయమే 22శాతం అని చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతి వంద కుటుంబాలకు ఒక బెల్టు షాపు అవతరించింది. మహబూబాబాద్ జిల్లాలో నెల్లికుదురు మండలంలోని ఒక చిన్న గ్రామంలో రోజుకు లక్ష రూపాయల మద్యం అమ్మకం జరిగిందన్న వార్త వచ్చింది. దీనినే ఆదర్శమైనటువంటి అభివృద్ధిగా చిత్రీకరించి ప్రచారం చేయడం విచారకరం. ఇక ఇదే, ఇంతే బంగారు తెలంగాణ అనుకోవాలేమో!


విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పరిశోధక సంస్థలు గత డెబ్భై ఏళ్లుగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి దిశ దశలను పరిశోధించి, విశ్లేషించి, సెమినార్లు వర్కుషాపులు మొదలైన వాటి ద్వారా నిపుణులు, అధ్యాపకులు, ఆచార్యుల ఆధ్వర్యంలో చర్చించి ప్రజలను ఆలోచింపజేసే విధానాలు తెలంగాణ రాష్ట్రంలో కరువైనాయి. ప్రజల అభివృద్ధికి సూచికలైన విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యవసాయం, ప్రజల జీవన విధానం మొదలైన అంశాలను కూలంకషంగా చర్చించవలసిన బాధ్యతను ఉపేక్షించ కూడదు. అభివృద్ధి పేరు మీద జరిగే విధ్వంసాన్ని మేధావులు,  పరిశోధకులు, ప్రజలు చర్చలో పెట్టాల్సిన అవసరం భావి నిర్మాణానికి ఎంతో అవసరం.

ప్రొ. కూరపాటి వెంకట్ నారాయణ

Updated Date - 2022-10-18T06:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising