ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీ ప్రజలకు తెలిసిన సత్యం

ABN, First Publish Date - 2022-01-11T06:04:18+05:30

ప్రతిపక్షాలు ఎంత నిరాశా నిస్పృహల్లో ఉన్నాయో చెప్పడానికి పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత విషయంలో ఘోర వైఫల్యమే ఒక తార్కాణం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతిపక్షాలు ఎంత నిరాశా నిస్పృహల్లో ఉన్నాయో చెప్పడానికి పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భద్రత విషయంలో ఘోర వైఫల్యమే ఒక తార్కాణం. ఆ వైఫల్యానికి విచారం వ్యక్తం చేయకపోగా, అలా జరగడం సహజమని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ వ్యాఖ్యానిస్తే పంజాబ్ ప్రజలు ప్రధానికి తమ సత్తా చాటారని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అన్నారు. పైగా సంబరాలు జరుపుకున్నారు! ఇది వారి మానసిక ధోరణికి అద్దం పడుతోంది. ప్రధాని వెళ్లే మార్గంలో నిరసనకారులు బైఠాయించడంతో దాదాపు 20 నిమిషాల పాటు పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఒక ఫ్లైఓవర్‌పై ఆయన కాన్వాయ్ ఆగిపోవడం, ప్రధానమంత్రి భద్రత పట్ల తమకు ఏ మాత్రం పట్టింపు లేదనే పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరును బట్టబయలు చేసింది. హుస్సైనీ వాలాలోని జాతీయ అమరుల స్మారకచిహ్నం దగ్గరకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సిన ప్రధాని వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గాన వెళ్లాలని నిర్ణయించిన విషయం పంజాబ్ పోలీసులకు ఎంతో ముందుగా తెలిపారు. రాష్ట్ర డీజీపీ నుంచి ధ్రువీకరణ తీసుకున్నారు. అయినప్పటికీ నిరసనకారులు ఆయన మార్గాన్ని అడ్డగించేందుకు అనుమతించారు. ప్రధాని వెళ్లేందుకు మరో మార్గాన్ని కూడా పోలీసులు సిద్ధం చేయలేదు. పైగా నిరసనకారులతో కలిసి టీ తాగుతూ కాలక్షేపం చేశారు. ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ అగిపోయిన విషయం చెప్పేందుకు అధికారులు చేసిన పలు ఫోన్లకు కూడా ముఖ్యమంత్రి ప్రతిస్పందించలేదు. అధికార కార్యక్రమాల్లో ప్రధానమంత్రితో పాల్గొనేందుకు కూడా ఆయన ఆసక్తి ప్రదర్శించలేదు. నిరసనకారులు ప్రధాని రహదారిని అడ్డగించిన విషయం కూడా తెలియకపోతే ఆయన ఏం ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు? ఈ మొత్తం ఉదంతాన్ని, ప్రధాని ప్రాణాలకు ముప్పు ఏర్పడాలనే ఉద్దేశంతో పంజాబ్ రాజకీయ అధికార యంత్రాంగం కల్పించిందన్న విషయం స్పష్టమవుతోంది. ఒక దేశ ప్రధాని భద్రత విషయంలో జరిగిన వైఫల్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక స్వతంత్ర కమిటీని ఎందుకు నియమించాల్సి వచ్చింది? విచిత్రమేమంటే శాంతిభద్రతల వైఫల్యం గురించి కేంద్రానికో, న్యాయస్థానానికో జవాబుదారి కావల్సిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ జరిగిన ఘటన గురించి ప్రియాంకాగాంధీ వాధ్రాకు వివరించారు!


శాసనసభ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బిజెపి ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 40 శాతం ఓట్లతో బిజెపిని గెలిపించిన ప్రజలు ఆ తర్వాత ఆ పార్టీకి దాదాపు 50 శాతం ఓట్లు సాధించి పెట్టారు. ఈ సారి అంతకంటే ఎక్కువ శాతంతో బిజెపి గెలిచి తీరుతుందన్న విశ్వాసం పార్టీనేతలకు ఉన్నది. ఎందుకంటే యుపిలో ఎక్కడకువెళ్లినా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత ఏ మాత్రం కనపడడం లేదు. ఇందుకు కారణం ఆయన హయాంలో ప్రజలు అవినీతిరహిత సుపరిపాలన, జాతీయవాదం, నిరంతర అభివృద్ధిని చవి చూశారు. యుపిలో 80శాతం ప్రజలు తన వైపు ఉంటే కేవలం 20 శాతం ప్రజలు ప్రతిపక్షాలవైపు ఉన్నారని యోగి ఆదిత్యనాథ్ అన్న మాటల్లో పూర్తిగా వాస్తవం ఉన్నది. గడచిన ప్రభుత్వాల హయాంలో నేరచరితుల విశృంఖల రాజ్యం, విచ్చలవిడి అవినీతి చూసిన వారెవరైనా యుపిలో మళ్లీ ఆ ప్రభుత్వాలను ఎన్నుకుంటారని భావించడం అమాయకత్వమే అవుతుంది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా బిజెపి తిరిగి ఎన్నిక కావడమే కాకుండా పంజాబ్‌లో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌తో కలిసి సత్తా చూపుతుందనడంలో సందేహం లేదు.


నిజానికి ఇప్పటివరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన ప్రతి సంస్థా భారతీయ జనతాపార్టీ ఈ ఎన్నికలలో ఘన విజయం సాధిస్తుందని తేల్చాయి. పోల్ స్ట్రాట్ న్యూస్ ఎక్స్, ఎబీపీ న్యూస్- సీ ఓటర్ సర్వే, టైమ్స్ నౌ, నవభారత్ బిజెపి మెజారిటీ సీట్లతో విజయం సాధించి తీరుతుందని అంచనా వేశాయి. పోల్ స్ట్రాట్ న్యూస్ఎక్స్ జరిపిన సర్వేలో దాదాపు 44 శాతం మంది ప్రజలు ఆదిత్యనాథ్‌ను తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని, దాదాపు 50 శాతం మంది మహిళలలో ఆయనకు అమితమైన ఆదరణ ఉన్నదని తేలింది. పోల్ స్ట్రాట్ న్యూస్ ఎక్స్ ప్రకారం ఉత్తరాఖండ్‌లో కూడా బిజెపి తిరిగి ఘనవిజయం సాధిస్తుందని స్పష్టమైంది. అత్యధిక ప్రజలు ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వైపే మొగ్గు చూపారు. వీటన్నిటికి తోడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని తమకు అత్యంత ప్రీతిపాత్రమైన జాతీయ నాయకుడిగా 55 శాతం మంది ప్రజలు తేల్చారు. ఏబీపీ న్యూస్-సీ ఓటర్, టైమ్స్ నౌ నవభారత్ కూడా దాదాపు ఇదే విషయాన్ని తేల్చాయి. ఏబీపీ ఇప్పటికి నాలుగుసార్లు సర్వే నిర్వహించినా, ఫలితం బిజెపికే అనుకూలంగా వచ్చింది. యుపిలో మాయావతిని కేవలం 7 నుంచి 13 శాతం వరకు, ప్రియాంకా గాంధీ వాధ్రాను 2.2 శాతం నుంచి 3.80 శాతం వరకు కోరుకుంటున్నారని తేలింది. రాష్ట్టంలో నేరాలు మటుమాయం కావడం, నిర్మాణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి జరగడం ద్వారా ఉపాధి కల్పనా అవకాశాలు పెరగడం, రాంమందిర్, కాశీ కారిడార్‌ల నిర్మాణంతో అత్యధిక శాతం ప్రజలు బిజెపి వైపు ఆకర్షితులయ్యారు. 


దాదాపు అన్ని సర్వేలు సమాజ్‌వాది పార్టీ బిజెపికి దరిదాపుల్లో కూడా రాదని తేల్చగా, బహుజన సమాజ్ పార్టీకి 9-14 సీట్లు, కాంగ్రెస్‌కు 4-7 సీట్లు లభిస్తాయని తేల్చాయి. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాయావతికి ప్రజలు తనను ఎంతమాత్రమూ ఆదరించే పరిస్థితి లేదన్న విషయం స్పష్టమైంది. ప్రియాంకాగాంధీ ఒక్కరే కాంగ్రెస్ తరఫున అక్కడక్కడ కనపడుతున్నారు. యోగీకి తానే ప్రత్యర్థినంటూ హడావిడి చేసిన సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ లక్నో, కాన్పూర్, కన్నోజ్, ఢిల్లీలోని తన సన్నిహితుల ఇళ్లలో వేలకోట్లు ఆదాయపన్ను, ఈడీ అధికారులకు పట్టుబడడంతో డీలా పడిపోయారు. ఇప్పటికే సమాజ్‌వాది పార్టీకి చెందిన అనేకమంది నేరచరితులు, గుండాలు జైళ్లలో ఊచలు లెక్కపెడుతుండగా ఇప్పుడు ఆ పార్టీ ఆర్థిక మూలాలపై దెబ్బపడడంతో అది తేరుకోలేకపోతోంది. ఈ ఎన్నికలు అవినీతి, కుటుంబ వారసులు, నేరచరితుల పాలనకూ, అభివృద్ధి, స్వచ్చమైన పాలనకూ మధ్య పోటీ అని ప్రజలకు తెలుసు. కేంద్రంలో మోదీ కాని, రాష్ట్రంలో యోగీ కానీ తాము అవినీతికి పాల్పడరని, ఇతరులు అవినీతికి పాల్పడేందుకు అవకాశం ఇవ్వబోరని జనానికి తెలిసినందువల్లే వారు ఇప్పటికే ఎటువైపు మొగ్గాలో తేల్చుకున్నారు.


వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-01-11T06:04:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising