ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ ‘వేయిపడగలు’ రచయిత నేటి హిందుత్వ కిందకు రాడు’’

ABN, First Publish Date - 2022-10-31T01:26:49+05:30

వేయిపడగలు నేడు చదివితే’ అంటూ మీరు విశ్వనాథ ‘వేయిపడగలు’ నవలపై ఒక పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పుస్తకం చేసే ప్రతిపాదన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరి భాస్కరం : పలకరింపు

‘వేయిపడగలు నేడు చదివితే’ అంటూ మీరు విశ్వనాథ ‘వేయిపడగలు’ నవలపై ఒక పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. ఈ పుస్తకం చేసే ప్రతిపాదన లేమిటో క్లుప్తంగా చెబుతారా?

ముస్లింలు, బ్రిటిషర్లు మన దేశాన్ని పాలించడానికి ముందు ఇక్కడ నాలుగువర్ణాల వ్యవస్థ పటిష్ఠంగా ఉండే దనీ, అదెంతో ఆదర్శవంతమైనదన్న ఒక అందమైన ఊహ ఇక్కడి సాంప్రదాయికవర్గాలలో ముందునుంచీ ఉంది. ప్రతి వర్ణమూ తమకు నిర్దేశించిన విధుల్లోనూ, హద్దుల్లోనూ ఉంటూనే ఇతర వర్ణాలతో సామరస్యంతో జీవించేదనీ; ధర్మమూ, దేవాలయమూ, భక్తీ వాటిని కలిపేవనీ వీరు భావిస్తారు. ముస్లిం పాలనలో కన్నా ఎక్కువగా బ్రిటిష్‌ పాలనా, ఆంగ్లవిద్యా ఈ వ్యవస్థను చెడగొట్టాయన్న అసం తృప్తి వీరిలో జీర్ణించుకుంది. దానికితోడు, ముస్లింలు, పంచ ములు, స్త్రీలతో సహా అన్ని విస్మృతసామాజిక శ్రేణులనూ గాంధీ స్వాతంత్ర్యోద్యమంలోకి తేవడం వీరిలో మరింత ఆగ్రహాన్ని రగి ల్చింది. భారతీయసమాజంలో ఉన్న నిచ్చెన మెట్ల అమరికను అది పూర్తిగా రూపుమాపి అందరినీ ఒకే మెట్టు మీదికి తెస్తుందని వీరు భయపడ్డారు.

ఇలాంటి సాంప్రదాయికవర్గాల మనోభావా లకు విశ్వనాథవారి ‘వేయిపడగలు’ నవల అత్యంత ప్రతిభావంతంగా అద్దంపడుతుంది. ప్రత్యేకించి వర్ణవ్యవస్థకు శీర్షస్థానంలో ఉన్న వర్ణం తన వైభవ, ప్రాభవాలను కోల్పోవడం పట్ల అంతులేని దుఃఖమూ, నిరాశానిస్పృహలూ అందులో కట్టలు తెంచుకుంటాయి. స్వాతంత్ర్యోద్యమంలోకి గాంధీ అడుగు పెట్టినప్పటినుంచి లెక్కిస్తే, ఈ నూరేళ్ళ పైచిలుకు కాలంలోనూ ఈ సాంప్రదాయికవర్గం ఇక్కడి నూతన రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యవ్యవస్థతో ఏనాడూ మమేకం కాకుండా; విడిగానూ, రాజకీయంగా ఒక మైనారిటీ గొంతుగానూ ఉండిపోయింది.

ఇప్పుడు ఈ పరిస్థితి తిరగబడింది. కారణం ఏమైనా, సామాజికంగానూ, రాజకీయంగానూ కూడా తన అస్తిత్వాన్ని చాటుకునే అవకాశం ఇంతకాలానికి మళ్ళీ సాంప్రదాయిక వర్గానికి లభించింది. దాంతో అది నిరాశా, నిస్పృహలనుంచి బయటపడి పూర్తిగా క్రియాశీలతను తెచ్చుకుంది. ఈ మార్పును చెప్పడానికి నా పుస్తకంలో ప్రయత్నించాను.

మీరు ‘వేయిపడగలు’ నవలను మొదటిసారి ఎప్పుడు చదివారు? అప్పటి మీ స్పందన ఏమిటి?

చిన్నప్పుడు, నాకంటూ నిర్దిష్టమైన అభిప్రాయాలేవీ లేని రోజుల్లో, కేవలం కథ మీద ఉండే కుతూహలంతో ‘వేయి పడగలు’ చదవడానికి ప్రయత్నించాను; అది పెద్దగా ముందుకు వెళ్లలేదు. ఆ తర్వాత చాలాకాలానికి, నాదైన ప్రాపంచిక దృక్పథం ఏర్పడిన తర్వాత చదివాను. అప్పుడది చివరివరకూ చదివించడమే కాక, నా దృక్పథంతో బేరీజు వేసుకునే అవకాశమి చ్చింది. ఒకే రచనను మనం భిన్న భిన్న జీవితదశల మీదుగా చదువుతాం. ఆ దశల మీదుగా సునిశితమవుతున్న మన అవగా హనను, దృక్పథాన్ని దానికి అదనంగా జోడిం చుకుంటూ చదువుతాం. అలా చదివిన ప్రతి సారీ అది కొత్తగా చదివినట్టే అవుతుంది. ఆవిధంగా ఆ రచన కాలం వెంబడి ఎప్పటి కప్పుడు నూతనత్వాన్ని తెచ్చుకుంటూ తన అస్తిత్వాన్ని పొడిగించుకుంటుంది. ఆ సంగతి ఈ పుస్తకంలో కూడా చెప్పాను.

హిందుత్వవాదం బలపడుతున్న ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులలో ‘వేయిపడగలు’నూ, దాని రచయితనూ మీరు ఎలా చూస్తారు? ‘వేయిపడగలు’ ప్రధానపాత్రను ఇప్పటి కాలంలో మీరు ఎలా ఊహిస్తారు?

‘వేయిపడగలు’ రచయిత కానీ, ఆ తరానికి చెందిన అలాంటి ఇతర సాంప్రదాయికులు కానీ నేటి హిందుత్వ, లేదా రాజకీయ హిందుత్వ భావజాలం కిందికి పూర్తిగా రారు. కొన్ని విషయాల్లో నేటి హిందుత్వతో స్థూలంగా ఏకీభావం ఉన్నప్పటికీ, అది సమర్థించే అభివృద్ధి నమూ నాను వీరు అంగీకరించరు; అసలు మార్పునే చాలా అను మానంతో చూస్తారు. ఇది ‘వేయిపడగలు’లో స్పష్టంగా వ్యక్తమవుతుంది. అయితే, పసరిక పాత్రను సృష్టించడం ద్వారా పర్యావరణభద్రతపై గొప్ప స్పృహను, ముందుచూపును విశ్వనాథ చాటుకున్నాడు. ఆయన నేటి హిందుత్వ కిందికి రాకపోవడానికి కాలికమైన పరిమితులు కూడా ఉన్నాయి. ‘వేయిపడగలు’ రచించేనాటికే ఆర్‌.ఎస్‌.ఎస్‌. అవతరించినా, సావర్కర్‌ తెర మీద ఉన్నా, గాంధీ ప్రాతినిధ్యం వహించిన భావజాలానిదీ, ఆపైన వామపక్ష భావజాలానిదీ పైచేయి అయింది. ఈ పరిస్థితి తిరగబడే దశను విశ్వనాథ ఊహించ గల అవకాశం అప్పటికి లేదు. అందుకే గత వైభవ పతనంపట్ల ఒక దుఃఖితుని ఆత్మకథగానే ‘వేయిపడగలు’ మిగిలింది.

అయితే, ఇదే సమయంలో ఈ సాంప్రదాయికవర్గాలకు ఒక గొప్ప సడలింపు గుణం ఉంది. తమ భావజాలపు గుండెకాయను కాపాడుకుంటూనే, పరిస్థితులతో రాజీపడుతూ, కాలానుగుణమైన కొత్త రూపాలు ధరించగలరు. ఉదాహరణకు, విశ్వనాథలాంటివారిని తమ స్ఫూర్తిగా, కేంద్రంగా ఆరాధిస్తూనే, వారు వ్యతిరేకించినవాటిని కూడా ఆమోదించి తమ కీలక భావజాల పరిరక్షణకు వీలుగా మలచుకోగలరు. ఇంగ్లీషు చదువును వ్యతిరేకిస్తూనే అందులో భాగమైన ‘వేయిపడగలు’ నాయకుడు ధర్మారావే ఇందుకు మంచి నమూనా.

‘వేయిపడగలు’లో దుఃఖితునిగానూ, పరాజితునిగానూ రూపుకట్టిన నాయకుడు; ఇప్పటి మారిన పరిస్థితులలో గొప్ప క్రియాశీల ఉత్సాహం ఉరకలెత్తే విజేతగా పరిణమించి ఉండే వాడని నా పుస్తకంలో చెప్పాను. ఆ విధంగా ఇది ‘వేయి పడగలు’కు సీక్వెల్‌ రావలసిన మహత్తర సందర్భం అని కూడా అన్నాను.

ఈ పుస్తకంలో మీరు విశ్వనాథ ‘వేయిపడగలు’నూ, మార్గరెట్‌ మిచెల్‌ ‘గాన్‌ విత్‌ ద విండ్‌’నూ పోల్చి పరిశీలన చేశారు. ఈ ఆలోచనకు బీజం ఎలా పడింది?

ఆర్‌.ఎస్‌. సుదర్శనం తన ‘సాహిత్యంలో దృక్పథాలు’లో చేసిన ‘వేయిపడగల’ పరిశీలనను, ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ నవలను ఇంచుమించు ఏకకాలంలో చదివాను. ‘వేయి పడగలు’, ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ల మధ్యనున్న పోలికలను గమనించి ఆశ్చర్యపోయాను. దాంతో మళ్ళీ ‘వేయిపడగలు’ చదివాను. ఈ రెండు నవలలూ కొంచెం అటు ఇటుగా ఏక కాలంలో వచ్చినవే. రెండూ ఒక సాంప్రదాయిక కులీన సమాజం పతనమవడాన్నే చిత్రిస్తాయి. ఆ పతనాన్ని చూడడంలో మాత్రం ఇద్దరు రచయితల మధ్యా పెద్ద తేడా ఉంది. మార్గరెట్‌ మిచెల్‌ ఆ పతనాన్నీ, అది వెంటబెట్టుకుని వచ్చిన మార్పునూ సహజంగానూ, తటస్థంగానూ చూస్తుంది. మార్పువల్ల నలిగిపోయిన, మార్పుతో సర్దుకుపోయిన జీవి తాలపట్ల మానవీయ స్పందనను కనబ రుస్తుంది. ‘వేయి పడగలు’ సాంప్రదాయికవ్యవస్థను పట్టుకుని వేల్లాడడమే కాకుండా; మార్పునూ, దాని కింద తమ జీవితాలను సర్దుకుంటున్నవారినీ కూడా గర్హిస్తుంది, ఆక్షేపిస్తుంది. ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ వెనుక అమెరికన్‌ అంతర్యుద్ధ నేపథ్యం ఉండడం, ‘వేయిపడగలు’కు యుద్ధనేపథ్యమేదీ లేకపోవడం ఈ దృక్పథవైవిధ్యానికి కారణమని విశ్లేషించాను. నిజానికి రచయిత్రిగా మార్గరెట్‌ మిచెల్‌ విశ్వనాథ భుజాల వరకూ కూడా రాదు. కానీ ఆమె గొప్ప ముందుచూపును చాటితే, విశ్వనాథ వెనుకచూపు చాటాడు. నా పుస్తకంలో ఈ రెండు నవలల తులనాత్మక పరిశీలన సగ భాగాన్ని ఆక్రమించింది.

నేటి తరంలో ‘వేయిపడగలు’ చదవాలనుకునే పాఠకులు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలేవి మీ దృష్టిలో?

కేవలం గొప్ప పఠనీయత ఉన్న నవలగానే కాక; గత నూరేళ్ళలో సామాజికంగా, రాజకీయంగా, భావజాలాల పరంగా సంభవించిన పరిణామాల వెలుగులో ‘వేయి పడగలు’ చదవాలి. సాంప్రదాయిక వర్గాలు పునర్వైభవాన్ని తెచ్చుకునే క్రమంలో ఎంత దుఃఖాన్ని, ఎంత నిస్సహా యతను ఎదుర్కొన్నాయో; ఎటువంటి ఊహలు చేశాయో; మార్పులతో సర్దుకునే ప్రయత్నంలో ఎంత వైరుధ్యాన్ని ఆశ్రయించాయో తెలుసుకోడానికి చదవాలి. ఒక సోషియో- పోలిటికల్‌ డాక్యుమెంటుగా కూడా దాని ప్రాసంగికతను అర్థం చేసుకుంటూ చదవాలి. ఒక పరాజితుడి ఆత్మకథ, ఒక విజేత ఆత్మకథగా మారిన క్రమాన్ని పోల్చుకుంటూ చదవాలి.

Updated Date - 2022-10-31T01:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising