ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శత వసంతాల శారదా నికేతనం

ABN, First Publish Date - 2022-07-20T06:26:23+05:30

స్వరాజ్య సాధనకై గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజులవి. వ్యాపార నిమిత్తం వచ్చి పాలకులు అయిన బ్రిటిష్ వారి వ్యాపారానికి గండికొడితే తప్ప ఆ పరాయి పాలకులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వరాజ్య సాధనకై గాంధీజీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజులవి. వ్యాపార నిమిత్తం వచ్చి పాలకులు అయిన బ్రిటిష్ వారి వ్యాపారానికి గండికొడితే తప్ప ఆ పరాయి పాలకులు ఈ దేశాన్ని వదిలిపెట్టరనేది మహాత్ముని భావన. అహింసాయుతంగా మొదలైన సత్యాగ్రహోద్యమంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణకై ఖద్దరు ఉద్యమం, జాతీయ విద్యాభ్యాసం, న్యాయస్థానాల బహిష్కరణ, మద్యపాన నిషేధం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ స్త్రీ పురుషులు ఐకమత్యంతో సాధించాల్సిన కార్యక్రమం. అయితే స్త్రీలు గడపదాటి బయటకు రావటానికి ఆంక్షలు ఉన్న సామాజిక సంస్కృతి ఉన్న ఆ రోజుల్లో అది సాధ్యపడే విషయం కాదు. అందుకే కందుకూరి వీరేశలింగం స్త్రీలకు స్వాతంత్ర్యం, లోకజ్ఞానం ఉండాలని భావించి ముందుగా స్త్రీవిద్యను ప్రోత్సహించాడు. కందుకూరివారితో సాహచర్యం ఏర్పడటానికి ముందే సంఘసంస్కరణాభిలాషులైన ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు గుంటూరులో వితంతు శరణాలయాన్ని నిర్వహించారు. వితంతువులకు పునర్వివాహాలు చేశారు. ఆ క్రమంలోనే ఉన్నవ దంపతులు సత్యాగ్రహోద్యమ లక్ష్యాలతో ఈ విశిష్టమైన విద్యాసంస్థను నెలకొల్పారు. స్త్రీలు విద్యావంతులై స్వతంత్ర వ్యక్తిత్వంతో దేశస్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములు కాగలిగేటట్లుగా జాతీయవిద్యతో విద్యార్థినులను తీర్చిదిద్దగల సదాశయంతో శారదానికేతనం స్థాపన జరిగింది. ఆ లక్ష్యంతోనే ఈ సంస్థలో విద్యావిధానాన్ని రూపొందించారు. అందుకే ఆంగ్ల పాఠశాలలవలే కాక, స్వయంప్రతిపత్తిగల విద్యాసంస్థగా శారదా నికేతనం అభివృద్ధి చెందింది. లక్ష్యమే స్వాతంత్ర్యసాధన కాబట్టే ఇదొక ప్రత్యేకమైన విద్యాసంస్థ అని గాంధీజీ కొనియాడబడిందని అర్థమౌతుంది.


నాటి సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు డాక్టర్ కె.ఎన్.కేసరి 1929 అక్టోబర్ ‘గృహలక్ష్మి’ సంచికలో శారదానికేతనంలోని విద్యావిధానాన్ని విపులంగా సమీక్షించారు. ఆ సమీక్షా సంగ్రహమిది: ‘శారదానికేతనంలో ఎనిమిది సంవత్సరాల విద్యను ప్రవేశపెట్టారు. మొదటి ఐదేళ్ల విద్య సాహితీప్రకరణం కాగా మిగిలిన మూడేళ్ల విద్య విదుషీ ప్రకరణం. సంస్కృతాంధ్రాలలో కొంత కావ్య జ్ఞానంతోపాటు సంగీత, చిత్రలేఖనాలలో ఒకదాని జ్ఞానాన్ని, చేతిపనుల్లో నొకదానిని నేర్పుతారు. గృహవైద్యం, భూగోళం, చరిత్రలో మంచి పరిచయాన్ని కలిగిస్తారు. పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి. సంస్కృతాంధ్ర భాషలలో ఒకటి, హిందీ ఆంగ్లభాషలలో నొకటి నేర్చి ఉత్తీర్ణతను పొందితే విదుషీ పట్టభద్రులు అవుతారు. మొదటి ఏడేళ్లలో 12 మంది విద్యార్థినులు సాహితీ ప్రకరణంలోను, 9 మంది విదుషీ ప్రకరణంలోనూ పట్టభద్రులు అయ్యారు’. స్వయంప్రతిపత్తిగల జాతీయ లక్ష్యంతో కూడిన ఒక నైతికవిద్యా సంస్థగా శారదా నికేతనం ఉండేది. 1944లో ఈ విద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థ అయింది. అప్పటి వరకు ప్రభుత్వం పెట్టే పరీక్షలతో ఈ సంస్థకు సంబంధం ఉండేది కాదు. 1952లో ఉన్నవ లక్ష్మీబాయమ్మ మరణించటంతో వృద్ధాప్యంవల్ల ఉన్నవ లక్ష్మీనారాయణకు విద్యాసంస్థనిర్వహణ భారమై 1955లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత దానిని దేవాదాయశాఖకు అప్పగించారు. బాలికల విద్యాభివృద్ధికేకాక, వితంతు బాలికలకు, పిల్లలు ఉన్న వితంతువుల విద్యకై ఉచిత విద్యావసతులు ఉండడం శారదా నికేతనం ప్రత్యేకత. పలువురు మహిళా చైతన్యమూర్తులు ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్ఫూర్తితో అటువంటి విద్యాలయాలను ఏర్పాటు చేశారు. నెల్లూరులో పొణకా కనకమ్మ 1923లో నెలకొల్పిన కస్తూరిదేవి విద్యాలయం, బాలాంత్రపు శేషమ్మ ఆధ్వర్యంలో 1924లో కాకినాడలో ఏర్పడిన విద్యార్థినీసమాజం మొదలైనవి అందుకు నిదర్శనాలు. మద్రాసు స్త్రీల కళాశాలలో వృత్తివిద్యల శాఖను ప్రారంభించిన దుర్గాబాయి దేశ్‌ముఖ్ శారదానికేతనాన్ని సందర్శించి ప్రశంసించారు.


ఉన్నవ దంపతుల స్ఫూర్తితో శారదా నికేతనం విద్యార్థినులు సత్యాగ్రహ, ఖద్దరు ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారు. ఈ విద్యాలయంలో చదువుకున్న సంగెం లక్ష్మీబాయి 1930 ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ శారదానికేతనాన్ని నిర్వహిస్తూనే స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. 1930 ఉప్పుసత్యాగ్రహంలోను, 1932 శాసనోల్లంఘనం, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరవనిత లక్ష్మీ బాయమ్మ. సికింద్రాబాద్ నుంచి వచ్చి చదివిన విద్యార్థిని సంగెం లక్ష్మీబాయి లోక్‌సభకు మూడుసార్లు ఎన్నికయ్యారు. మరొక విద్యార్థిని శ్రీమతి చిట్టూరి అన్నపూర్ణ కూడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు.


శారదానికేతనం దినదిన ప్రవర్థమానమయిందంటే అది ఉన్నవ లక్ష్మీబాయమ్మ ఆశయసిద్ధి ఫలితమే. స్త్రీలు ఉపాధిని కలిగించే చేతిపనులను నేర్చుకొని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని, స్త్రీలకు స్వతంత్రజీవనం అవసరమని, భర్త సంపాదనలో గృహిణులకు భాగం ఉండాలని, స్త్రీ విద్యావంతురాలైతే దేశానికి సంఘానికి ఉపయోగపడటమేకాక, గృహనిర్వహణను మరింత సమర్థతతో నెరవేర్చగలదని, విద్యవల్ల ఉన్నత భావాలు ఏర్పడి ధైర్యసాహసాలను ఆచరణలో పెట్టగల శక్తి కలిగి ఉంటారని, అప్పుడే స్త్రీ పురుష సమానత్వం సాధ్యమవుతుందని, వారు దేశస్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనగలుగుతారని లక్ష్మీబాయమ్మ భావించేవారు. ఈ భావాలతో ఆమె విస్తృతంగా రచనా వ్యాసంగం చేశారు. స్త్రీజాతి అభ్యుదయానికి నూతన మార్గాన్ని చూపిన దీపధారి లక్ష్మీబాయమ్మ. విద్యార్థినులు మధ్యలో చదువు ఆపకుండా ఉండేందుకై కనీసం ఐదు సంవత్సరాల చదువు పూర్తయ్యేవరకు కొనసాగాలనే ఒడంబడిక ఉండేది. ఆ ఒడంబడికను ఒప్పుకొని చదవటానికై కాకినాడనుంచి వచ్చి శారదానికేతనంలో చేరిన చిట్టూరి అన్నపూర్ణ అనే విద్యార్థి రజస్వల అయినప్పుడు లక్ష్మీబాయమ్మ బాహాటంగా వేడుకలను జరిపించి ఇల్లిందల సరస్వతిగారిచేత ఋతుధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని తెలిపేట్టుగా ఉపన్యాసాన్ని ఇప్పించారు. సమాజంలో రజస్వలానంతర వివాహాలకు దారిచూపించటం, తద్వారా స్త్రీ విద్యాభివృద్ధికై కృషిచేసిన ప్రగతిశీల సాంఘిక–సాంస్కృతిక విజ్ఞాని లక్ష్మీబాయమ్మ. అప్పటివరకు గుట్టుగా ఉండే స్త్రీల ఋతుధర్మ లైంగిక సంస్కృతిని విజ్ఞానవిషయంగా తెలియచేయటం, మిగిలిన విద్యార్థినులలో దానికి సంబంధించిన భయాందోళనలను నివారించేందుకు విజ్ఞానదాయక ఉపన్యాసాలను నిర్వహించటాన్ని ఒక చారిత్రక విశేషంగా భావించాలి. ఆడపిల్లలు రజస్వల అయినప్పటినుండి ఆందోళనచెందే మనస్తత్వం వారిలో ఏర్పడుతుందని మానసిక నిపుణులు చెప్పటాన్ని లక్ష్మీబాయమ్మ ఆనాడే గుర్తించటం గమనార్హం. చదువు పూర్తిచేసిన ఆ చిట్టూరి అన్నపూర్ణను తల్లిదండ్రుల సమక్షంలో సాంఘిక సంస్కర్త దర్శి చెంచయ్య వివాహం చేసుకున్నారు. చెంచయ్య నిర్వహించిన వివిధ సంస్కరణోద్యమాలలో ఆమె భాగస్వామి అయ్యారు. ‘ఆధునిక మహిళ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అన్న గురజాడ మహాకవి స్ఫూర్తిదాయక సూక్తికి తార్కాణాలుగా శారదానికేతనం విద్యార్థినులు భాసిల్లారు.

జంధ్యాల కనకదుర్గ

Updated Date - 2022-07-20T06:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising