దీని భావమేమి?
ABN, First Publish Date - 2022-10-07T06:07:52+05:30
జాతీయస్థాయిలో ప్రభావమేమిటో, ప్రతిస్పందనలేమిటో మున్ముందు తెలుస్తుంది కానీ, తెలంగాణ వరకు అయితే, బుధవారం నాడు జరిగింది ముఖ్యమైన పరిణామమే...
జాతీయస్థాయిలో ప్రభావమేమిటో, ప్రతిస్పందనలేమిటో మున్ముందు తెలుస్తుంది కానీ, తెలంగాణ వరకు అయితే, బుధవారం నాడు జరిగింది ముఖ్యమైన పరిణామమే. రెండు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలోను, ప్రత్యేక రాష్ట్రంలోను కూడా ప్రజాజీవితంలో అంతర్భాగంగా ఉన్న తెలంగాణ రాష్ట్రసమితి (టిఆర్ఎస్) ఇక ఆ పేరుతో ఉండబోదు. విజయదశమి నాడు ఆ పార్టీ విస్తృత సమావేశం తనను తాను రద్దు చేసుకుందని అనకూడదు కానీ, పేరు మార్పు కోసం తీర్మానించింది. టిఆర్ఎస్ ఇక నుంచి బిఆర్ఎస్, భారత్ రాష్ట్రసమితి. టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులతో చర్చించి తీసుకున్నారో, ఏదో నిగూఢ లక్ష్యంతో చేశారో తెలియదు కానీ, ఆయన అనుయాయులు అన్ని స్థాయిలలోనూ కిమ్మనకుండా ఆమోదించారు.
ఈ పరిణామాన్ని కేసీఆర్ జాతీయస్థాయి నేతగా ఎదగడంగా చూడాలని టిఆర్ఎస్ ఆశిస్తున్నది. తెలంగాణను అభివృద్ధి పరచడం పూర్తి అయింది కనుక, ఇక దేశాన్నంతటినీ తన దార్శనికతతో అభివృద్ధి పరచాలని కేసీఆర్ భావించడంలో తప్పేమీ లేదు. ప్రాంతీయ నాయకులు ప్రాంతాలకే పరిమితం కావాలని లేదు. నిజానికి, దక్షిణాది నుంచి యావత్ భారతదేశాన్ని ఆకట్టుకోగలిగిన జనాకర్షక నాయకుడి అవసరం కూడా ఉన్నది. తను అటువంటి పాత్రలోకి ఒదిగిపోగలనని కేసీఆర్ అనుకున్నా, అందుకోసం ప్రయత్నించాలనుకున్నా, దాన్ని స్వాగతించవలసిందే. కానీ, ఈ పరిణామం, ప్రజలందరూ అర్థం చేసుకునే రీతిలో, చర్చించి మంచి చెడ్డలు వ్యక్తీకరించే పద్ధతిలో జరిగి ఉంటే వేరుగా ఉండేది. ఇప్పుడు ఏదో అస్పష్టత వ్యాపించి ఉన్నది. ఎన్నో సందేహాలు, సంశయాలు. ఎందుకు? ఎట్లా?
అఖిల భారత తెలంగాణ రాష్ట్రసమితి అని కాకుండా, భారత్ రాష్ట్రసమితి అని ఎందుకు పెట్టినట్టు? మబ్బుల్లో నీరు చూసి చేతిలో ఉన్న ముంత ఒలకపోసుకున్నట్టు, తెలంగాణను విడిచిపెట్టి, చేయగలిగే నేలవిడిచిన సాము ఏమిటి? భారతీయత అనేది కూడా ఒక అస్తిత్వమే, కానీ స్థూల అస్తిత్వం. దాన్ని స్వీకరిస్తూనే, ప్రజలు ఒక కులానికో ప్రాంతానికో భాషకో చెందినవారిగా తమకు తాము గుర్తింపు ఇచ్చుకుంటున్నారు. అందుకు అనుగుణమైన భావోద్వేగాలను పెంచుకుంటున్నారు. టిఆర్ఎస్ అనే పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖరరావు అయి ఉండవచ్చును కానీ, దాని నేపథ్యంలోనూ, వికాసంలోనూ ఆనాడు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆశించిన ఉద్యమసమాజమంతా ఉన్నది. ఏకపక్షంగా, ప్రధాన ఉద్యమ చిహ్నాన్ని తొలగించడాన్ని తెలంగాణవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణవాదం రెండు ఎన్నికలలో టిఆర్ఎస్ను గెలిపించింది. ఎనిమిదేళ్ల పాలన తరువాత, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నదనుకుంటున్న సమయంలో, చేతిలో ఉన్న ఆయుధాన్ని వదిలివేయడం ఏరకంగా వివేకం? అని టిఆర్ఎస్ అభిమానులు లోలోపల చింతిస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధి పూర్తి అయిందనే వాదన విచిత్రంగా ఉన్నదని ప్రభుత్వ విమర్శకులు అంటున్నారు. 2009 ఎన్నికల ముందు, రాజశేఖరరెడ్డి కూడా సంక్షేమం పతాకస్థాయికి చేరిపోయిందని, ఇక చేయవలసిందేమీ లేదని అనేవారు. అయినప్పటికీ, నాటి ఎన్నికలలో, లోక్‌సత్తా, ప్రజారాజ్యం వంటి పార్టీల ఉనికి పరోక్షంగా సహకరించడంతో పాటు, గెలుపు కోసం ‘ఉద్వేగ’ పూరిత ప్రచారం చేయవలసి వచ్చింది. తెలంగాణ అభివృద్ధి నమూనా అంటూ ఉన్నదా? గొప్పగా చెబుతున్న సంక్షేమపథకాలు నూటికి నూరుపాళ్లు అమలుచేయడానికి నిధులు సరిపోని పరిస్థితి. గర్వంగా ప్రదర్శించుకునే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇటీవలి వరదల తరువాత అనేక కొత్త ప్రశ్నలు ఎదురవుతున్న సన్నివేశం. గుజరాత్ మోడల్‌తో నరేంద్రమోదీ ఢిల్లీకి ఎదిగినట్టు, తెలంగాణ మోడల్‌తో తానూ అదే విధంగా గమ్యం చేరవచ్చునని కేసీఆర్ ఆశిస్తున్నట్టు తెలుస్తూనే ఉన్నది. నిజానికి గుజరాత్ నమూనా దేశాన్నంతటినీ సమ్మోహపరిచిందేమీ కాదు. మోదీ విజయానికి అనేక నేపథ్యాలున్నాయి, అనేక శక్తుల సమష్టి ప్రయత్నం ఉన్నది.
ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు మండలాలలో కొంత ప్రాచుర్యం ఉన్నంత మాత్రాన, అనేక రాష్ట్రాలలో ఉనికి ఎట్లా సాధ్యం? కర్ణాటకలో పాక్షికంగా మాత్రమే ప్రభావం కలిగిన జనతాదళ్–ఎస్తో ఎంత పూసుకుతిరిగినా, ప్రయోజనం ఏమిటన్నది ప్రశ్న. నిరంతర సంబంధంలో ఉండడానికి నితిశ్, తేజస్వి, అఖిలేశ్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మమత ఎవరూ సిద్ధంగా లేనప్పుడు, సొంత విమానం కొనుగోలు చేసినప్పటికీ, జాతీయ ప్రయాణాలు చేయగలిగేది ఎక్కడికి? స్థానికంగా ఎంతో కొంత ప్రాబల్యం ఉన్న పార్టీలు, ఎంత చిన్న పార్టీలు అయినప్పటికీ, జాతీయ పార్టీగా మారిన మరో ప్రాంతీయ పార్టీతో ఎందుకు చేతులు కలుపుతాయి? అటువంటి ఆకర్షణను ఈ పార్టీ ఏమి ఇవ్వగలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ కంటె కూడా టిఆర్ఎస్ సంపన్న పార్టీ అని చెప్పుకుంటున్నారు. డబ్బుతో జాతీయ ప్రాచుర్యం సాధించవచ్చునని భావిస్తున్నారా ఏమిటి? ఇవన్నీ శేష ప్రశ్నలే. కేసీఆర్ నిర్ణయం ఎందుకో అర్థం కాక తలబద్దలు కొట్టుకుంటున్న శ్రేయోభిలాషుల ఆవేదనలే.
ప్రజారంగంలో జరిగే ప్రయత్నాలు సఫలం కావాలనే కోరుకోవాలి. పారదర్శకత ఉంటే, హేతుబద్ధత కనిపిస్తే జనం మరింత అవగాహనతో తోడ్పడతారు.
Updated Date - 2022-10-07T06:07:52+05:30 IST