ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పన్నీరుకు ఎసరు!

ABN, First Publish Date - 2022-07-12T06:30:59+05:30

తమిళనాట స్వర్ణోత్సవ అన్నాడీఎంకెలో సాగుతున్న ఆధిపత్యపోరు సోమవారం కీలక మలుపు తిరిగింది. పార్టీకి అత్యున్నతస్థాయిలో ఒకే ఒక్కడు నాయకుడిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాట స్వర్ణోత్సవ అన్నాడీఎంకెలో సాగుతున్న ఆధిపత్యపోరు సోమవారం కీలక మలుపు తిరిగింది. పార్టీకి అత్యున్నతస్థాయిలో ఒకే ఒక్కడు నాయకుడిగా ఉండాలన్న విషయంలో పళని, పన్నీరు వర్గాల మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో, సోమవారం పార్టీ సర్వసభ్యసమావేశానికి కొద్దినిముషాల ముందు మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పు పళనివర్గానికి ఆయుధంగా ఉపకరించింది. ప్రజాస్వామ్యవ్యవస్థలో ఒక పార్టీని ఈ తరహా సమావేశం జరుపుకోనీయకుండా అడ్డుకోవడం మహాపాపం అంటూ న్యాయస్థానం పన్నీరును చీవాట్లు పెట్టింది. పార్టీలో మెజారిటీ అభిప్రాయానికి మోకాలడ్డే చేష్టలకు పన్నీరు ప్రయత్నించడం సరికాదంటూ ఆయన వర్గం దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో, వెనువెంటనే పన్నీరును ఏకంగా పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచే సస్పెండ్ చేస్తూ పళనివర్గం తీర్మానించింది. ఈ నిర్ణయం జయలలిత పార్టీ భవిష్యత్తునే కాక, తమిళ రాజకీయాల్లో బీజేపీ పాత్రనీ, శశికళ పునరాగమనాన్నీ ప్రభావితం చేయబోతున్నది.


సమన్వయకర్త హోదాలో కీలకమైన పోస్టులో ఉన్న వ్యక్తి చీటికీమాటికీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ, ఒక పార్టీ అంతర్గత వ్యవహారాల్లోకి కోర్టులను లాగేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు న్యాయమూర్తి. అక్కడ మీకు చేతగానిది మా ద్వారా చేయించాలనుకోవడం సరికాదు అని న్యాయమూర్తి విమర్శించారు. సర్వసభ్యసమావేశాన్ని సమన్వయకర్త, సహసమన్వయకర్త ఉమ్మడిగా ఏకాభిప్రాయంతో నిర్వహించాలే కానీ, ఇలా ఏకపక్షంగా కాదన్నది పన్నీరు వర్గం వాదన. అయితే, ఈ హోదాల కొనసాగింపును జూన్ 23నాటి సమావేశం ఆమోదించలేదు కనుక అవి అమలులో లేనట్టేనన్న పళనివర్గం వాదనను న్యాయస్థానం సమర్థించింది. పన్నీరు వాదనలన్నింటినీ న్యాయస్థానం కొట్టిపారేసి, సర్వసభ్యసమావేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో పళనివర్గానికి ఇక అడ్డులేకపోయింది. మొన్నటిదాకా ఉపముఖ్యమంత్రిగా ఉన్న పన్నీరును పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగంపై సస్పెండ్ చేశారు. డీఎంకెతో రహస్యంగా చేతులు కలిపి పార్టీని నాశనం చేసేందుకు పన్నీరు ప్రయత్నించారట. ఇందుకు ప్రతిగా పళనిని పన్నీరు సస్పెండ్ చేయడం, ఇరువర్గాలు బాహాబాహీకి దిగడం వంటివి అటుంచితే, ఇంతకాలమూ ఉభయులూ నిర్వహించిన రెండు పదవులూ రద్దయి వాటి స్థానంలో పళని ఎంతోకాలంగా కలగంటున్న ఏకనాయకత్వానికి మార్గం సుగమం అయింది.


గత ఏడాది అక్టోబర్‌లో పళని, పన్నీరు కలసి పార్టీ స్వర్ణోత్సవాలను ఘనంగా ఆరంభించి, 1972లో ఎంజీఆర్ ఏ లక్ష్యంతో పార్టీని ఆరంభించారో, ఆయన ఆశయాలను అమ్మ ఏ విధంగా కొనసాగించారో వాటికి కట్టుబడుతూ పార్టీని అత్యున్నతస్థాయికి తీసుకుపోతామని సంకల్పం ప్రకటించారు. అప్పుడు కరుణానిధి చేతిలో పార్టీ బహిష్కరణకు గురైన ఎంజీఆర్ చరిష్మా వేరు, ఇప్పుడు పళని చేతిలో సస్పెండ్ అయిన పన్నీరు దుర్గతి వేరు. పన్నీరు కోసం కన్నీరు కార్చే నాయకులంటూ పార్టీలో ఎవరూ లేరు. గత సదస్సులోనే ఆయన ఒంటరి అన్న విషయం తేలిపోయింది. పన్నీరుపై ఎంతోకొంత సానుభూతి ఉంటే బీజేపీకి ఉండాలి. ముఖ్యమంత్రి కుర్చీలో శశికళ కూచోబోతున్నదనగా అమ్మచెప్పిందంటూ తిరుగుబాటు చేసి, బీజేపీ ఆదేశాల మేరకు నడుచుకున్న నాయకుడు పన్నీరు. మోదీ ఆదేశాల మేరకే పళనితో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవికి రాజీపడ్డానని ఇటీవలే ఆయన చెప్పుకొచ్చాడు. కానీ, పళనిస్వామి బీజేపీతో రాజీపడినట్టుగా కనిపించేవారు కాదు. జూన్ 23న పార్టీ సర్వసభ్యసమావేశంలో పన్నీరు అంతగా అవమానపడిన తరువాత కూడా బీజేపీ సీనియర్ నాయకులు పళనిస్వామినే కలిసి ద్రౌపది ముర్ము విజయానికి అన్నాడీఎంకె సహకారాన్ని అభ్యర్థించారు. ద్రౌపది ముర్ము నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న ఘట్టంలో పన్నీరున్నా బీజేపీ సీనియర్ నాయకులెవ్వరినీ ఆయన కలుసుకోలేకపోయారట. పళని స్వామిని బీజేపీ నమ్మకపోయినప్పటికీ పార్టీ పూర్తిగా ఆయన పక్షాన ఉన్నందున పన్నీరును దూరంపెట్టడం తప్ప చేయగలిగిందేమీ లేదు. పళినిస్వామితో పూర్తిగా చెడితే పన్నీరునూ శశికళనూ కలుపుకొని బీజేపీ కొత్త విన్యాసాలకు తెరదీస్తుందా అన్న ప్రశ్నను ప్రస్తుతానికి అటుంచితే, కనీసం వచ్చే ఏడాది సార్వత్రక ఎన్నికల వరకూ పళనితో సయోధ్యగా వ్యవహరించాల్సిన అవసరమైతే బీజేపీకి ఉన్నది.

Updated Date - 2022-07-12T06:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising