‘‘ఒక్కో సమయంలో ఒక్కొక్క ప్రక్రియ ఆసరాగా వచ్చింది’’
ABN, First Publish Date - 2022-11-28T00:20:32+05:30
ఎన్నో తరాల క్రితం జమైకాకి తీసుకురాబడ్డ భారతీయులు, వాళ్ళ జీవన విధానంలోని వైవిధ్యమే ఈ నవలకు ప్రేరణ. వీళ్లను చూస్తుంటే ఎంతటి ప్రపంచం అయినా మన అరచేతిలో ఇమిడేంత చిన్నది...
శ్రీసుధ మోదుగు : పలకరింపు
‘అమోహం’, ‘విహారి’ కవితా సంపుటులు, ‘రెక్కల పిల్ల’, ‘డిస్టోపియ’ కథా సంపుటుల తరవాత ఈ ‘అంతర్హిత’ నవల రాయడానికి ప్రేరణఏమిటి?
ఎన్నో తరాల క్రితం జమైకాకి తీసుకురాబడ్డ భారతీయులు, వాళ్ళ జీవన విధానంలోని వైవిధ్యమే ఈ నవలకు ప్రేరణ. వీళ్లను చూస్తుంటే ఎంతటి ప్రపంచం అయినా మన అరచేతిలో ఇమిడేంత చిన్నది, మనం పట్టుకోలేనంత పెద్దది అనే రెండు భావనలు ఒకేసారి నాలో కలుగుతుంటాయి. చాలాసార్లు మనుషులు వాళ్ళ లోపల సుడులు తిరిగే అనిశ్చితి, అశాంతికి సమాధానాల కోసం దారులు అసంకల్పితంగా వెతుకుతూనే ఉంటారు. ఈ వెతుకులాటలో ఎవరెవరి జీవితాల్లోకో వెళ్లి కదిలిస్తారు. అలజడి చేస్తారు. కొంత అశాంతినో శాంతినో ఇచ్చి వెళుతుంటారు. వీరిలో ఎవరి జీవితమూ తక్కువ విలువైంది కాదు, ఎవరి ఆత్మా తీసేయబడేది కాదు. ఏది, ఎందుకు, ఎలా జరుగుతుందనే తర్కం పక్కన పెడితే చిన్న సంఘటన జరగడం వెనుక ఒకదానికొకటి అతకబడిన అనేక కారణాలు ఉంటాయి. వీటిలో తెలిసినవి కొన్ని, అర్థం కానివి ఇంకొన్ని, మన గమనింపులోకి రానివి మరికొన్ని. ప్రపంచం అరచేతిలో ఇమిడేంత చిన్నది, ఇంకా ఊహించ లేనంత పెద్దది- ఈ రెండు భావనలు ఒకేసారి వస్తాయి. ఇలాంటి ఆలోచనలను అక్షరబద్ధం చేసే ప్రయత్నమే ఈ నవల. నిజానికి డిస్టోపియ కథలన్నీ ఈ నవల పూర్తయ్యాక రాసినవే. కాకుంటే బయటకు రావడానికి కొంత సమయం పట్టింది.
‘అంతర్హిత’ నవల ప్రత్యేకత ఏమిటి?
ఇది చెప్పడం నా వరకు నాకు కష్టమైన విషయమే. 1936 నుంచి 1996 మధ్యకాలంలో అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ నిలబడిన కొంతమంది వ్యక్తుల ఆవేదన, స్థైర్యం, త్యాగం, ప్రేమ, సాహసం వంటివి ఈ నవలలో కనిపిస్తాయి. మనుషుల్లో పాతుకుపోయిన మూఢనమ్మకాలు ఎదుటివారి జీవితాన్ని ఎంత చిందరవందర చేస్తాయో, చెదిరిపోయిన బాల్యాలు వ్యక్తులను ఎలాంటి సత్యాలవైపు నడుపుతాయో, అంతర్లీనంగా మిగిలిన మన లోపలి భయాలు, మనలోని అస్తిత్వపు మూలాలు మనలను ఎటువైపు తీసుకెళతాయో, మన చుట్టూ ఉన్న మనుషులు వారి వంతు ప్రేమనో ద్వేషాన్నో హృదయాన్నో ప్రపంచానికి ఎలా పంచి వెళతారో ఈ నవల చెబుతుంది.
మీ కథా సంకలనాలు ‘రెక్కలపిల్ల’, ‘డిస్టోపియ’ మధ్య కొట్టొచ్చినట్లు తేడా కనిపిస్తుంది. ఒకటి బాల్య జ్ఞాపకాలతో రాస్తే రెండోది ఒకానొక మీ ప్రస్తుత అస్తిత్వపు పలవరింతలా ఉంటుంది. ఈ తేడా ఎందుకు ఎలా వచ్చింది?
రెండిటి మధ్య తేడా నిజం. కాని అది మీరు అంటు న్నట్లుగా కాదు. నిజానికి రెక్కల పిల్లనే నా అస్తిత్వపు పలవరింత. ఆ కథల్లో ప్రతివాక్యం నా బాల్యం నుంచి వచ్చిందే. డిస్టోపియా విషయానికి వస్తే అది పూర్తి ఫిక్షన్. మనకి ఎదురయ్యే మనుషుల జీవితాల్లో ఎన్నో పార్శ్వాలను చూస్తాం. వాటి వెనుక ఉండే అంతర్గత ఘర్షణ, అసంతృప్తి, అశాంతి, భయం వాటిని కప్పిపుచ్చే మంచితనపు స్వార్థాలు, నిస్వార్థ లాభాల లెక్కలు, మెత్తటి మోసాల లోపలి ఎత్తుగడలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మనం చూసి చూడనట్లు తెలిసీ తెలీనట్లు అంగీకరిస్తూ పోతుంటాం. ఎంతటి నిరసన ఉన్నా చాలాసార్లు మనం వహించేది ప్రేక్షకపాత్రే. అలాంటి సందర్భాలే డిస్టోపియ కథల్లో ఉంటాయి. వాటి గమనింపు వెనుక ఉంది బలమైన రెక్కలపిల్ల అనుభవాలే కారణమనిపిస్తుంది.
మీరు మొదటగా కవిత్వంతో తెలుగు సాహిత్యంలో అడుగుపెట్టారు. అనతి కాలంలోనే కవిత్వం, కథ, నవల ప్రక్రియలలో పుస్తకాలు తెచ్చారు. ప్రక్రియ పరంగా అన్ని ప్రయోగాలు చేద్దామనా, మరో కారణం ఏమైనా ఉందా?
ప్రక్రియ, ప్రయోగాలు అలా ఏదో చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఒక్కో సమయంలో నేను రాసేవాటికి ఒక్కొక్క ప్రక్రియ ఆసరాగా వచ్చింది. కవిత్వంలోకి అనుకోకుండా అడుగుపెట్టాను. మూడేళ్లు రాసిన కవిత్వం ‘అమోహం’గా వచ్చింది. ‘రెక్కలపిల్ల’ కథలు వచ్చాక, జమైకాలో నేను చూసిన ప్రపంచం, ఎదురైన కొందరు వ్యక్తుల ప్రభావంతో పెద్దకథ రాయాలని ఇంగ్లీష్‌లో మొదలుపెట్టిన ఈ ‘అంతర్హిత’ చివరకు నవలగా పూర్తయ్యింది. బహుశా ప్రక్రియ విషయంలో నా ఎంపిక కంటే వస్తువు పాత్రే కీలకమనుకుంటాను.
Updated Date - 2022-11-28T00:20:39+05:30 IST