ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాహిత్యం, సంస్కరణ ఒక్కటై దూసిన వజ్రాయుధం

ABN, First Publish Date - 2022-04-11T05:54:55+05:30

రాజారామ్‌మోహన్‌ రాయ్‌, దేవేంద్రనాధ ఠాగూర్‌, కేశవచంద్రసేన్‌, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ మొదలైనవారి బోధనలు, రచనలు, కందుకూరిలో విప్లవాత్మకమైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ఏనాడును, ఏ దేశములోను, మంచికి మార్పులు వైదికవృత్తి వలన జీవనం చేయు వారి వలనగాని, తమ గురువుల వలన గాని జరిగినట్టు చరిత్రము లెంతమాత్రము చెప్పవు. వారెన్న టికిని కాలముతో వచ్చువారు కారు. ఈ మహానుభావులకు స్వప్రయోజనపరత్వమే పరమార్థము. దేశక్షేమ విచార మునకును వీరికినీ బహుదూరము. బుద్ధిమంతులగు వారు వారిని నిరాకరించియే పని చేయువలయును’’ 

కందుకూరి


రాజారామ్‌మోహన్‌ రాయ్‌, దేవేంద్రనాధ ఠాగూర్‌, కేశవచంద్రసేన్‌, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ మొదలైనవారి బోధనలు, రచనలు, కందుకూరిలో విప్లవాత్మకమైన మార్పును తెచ్చాయి. వీరేశలింగం 


ఈ మార్పులతో సంపూర్ణ మానవుడుగా తయారైనాడు. సమాజంలోని లోపాలపై ధ్వజమెత్తాడు. సంఘసంస్కణ మహోద్యమానికి నాయకుడు అయ్యాడు. సంఘ సంస్కర్తగా, సాహిత్యంలోనూ, సమాజంలోనూ అనేక మార్పులకు కందుకూరి ప్రధాన కారకుడయ్యాడు. 


బ్రహ్మసమాజం ప్రభావం కందుకూరిపై పడింది. ఆ కారణంగా సాహిత్యం ద్వారా సమాజాన్ని సంస్కరించాలని అనుకున్నాడు. వేయి సంవత్సరాల తెలుగు సాహిత్యంలో అటు సాహిత్యంలోనూ, ఇటు సంఘంలోనూ అనన్య సామాన్యమైన కృషి చేసినవారు వీరేశలింగం మాత్రమే. 


కందుకూరి నాలుగు నవలలు రాశారు: రాజశేఖరచరిత్ర (1878), సత్యరాజా పూర్వదేశీ యాత్రలు, సత్యవతీ చరిత్ర (1883), చంద్రమతీ చరిత్ర (1884). ఈ నాలుగు నవ లల్లో రెండు నవలలు మగ వాళ్లను దృష్టిలో పెట్టుకొని రాశారు. రెండు నవలలు స్త్రీలను దృష్టిలో పెట్టుకొని రాశారు. సాంఘిక దురా చారాల్ని, మూఢనమ్మకాల్ని, విమర్శించే నవల ‘రాజశేఖర చరిత్ర’. 


గోల్డ్‌స్మిత్‌ రాసిన ‘ది వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫీల్డు’ అనే ఆంగ్ల నవల ఆధారంగా వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’ను 1878లో రాశారు. కందుకూరి ఈ నవల గురించి: ‘‘ఇది ‘ది వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫీల్డు’ గ్రంథానికి కొంత అనుకరణ అయినా అనువాదం మాత్రం కాదు. ఇంగ్లీషు కథకు దీనికి ఎటువంటి సంబంధము లేదు. మనలోగల మూఢ విశ్వాసములను పోగొట్టవలెనన్న ఉద్దేశముతోనే రాశాను’’ అన్నారు. ఇందులో ఆ కాలం నాటి సాంఘిక జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చిత్రీకరించారు వీరేశలింగం. ఈ నవలకు ‘వివేక చంద్రిక’ అనే పేరు కూడా ఉంది. తాను నడిపిన ‘వివేక వర్ధిని’ పత్రికలో రెండేళ్లపాటు ఈ నవలను ధారావాహికంగా ప్రచురించారు. మద్రాసు రాష్ట్ర విద్యా విచారణాధికారి కల్నల్‌ మెకంజీ దొరకు ఈ నవలను కందుకూరి అంకితం ఇచ్చారు.


వీరు ఈ నవల రాయడానికి చారిత్రక నేపథ్యం వుంది. 1876లో వీరేశలింగం ‘విగ్రహ తంత్రం’ రాశారు. అందులో వీరి శైలి సహృదయ పాఠకులకు ఆకర్షించింది. అందుకే రాయసం వేంకట శివుడు గారు కందుకూరి శైలి గూర్చి చెప్పుతూ ‘‘పేలవము గాని పేశలత, కటువు గాని గ్రాంథికత్వం వారి వచన శైలికి సొంపు గూర్చే అంశాలు’’ అన్నారు. అంతే కాదు, ఈ గ్రంథాన్ని స్కూల్‌ ఫైనల్‌కు పాఠ్య గ్రంథంగా నిర్ణయించారు. విగ్రహ తంత్రాన్ని మెచ్చుకుంటూ ఆనాడు క్రిస్టియన్‌ కళాశాలలో గణిత శాస్త్రాధ్యాపకుడు, దేశభాషా పర్యవేక్షణా ధికారి అయిన సమర్థ రంగయ్యశెట్టి వీరేశలింగా నికి ఒక ప్రశంస లేఖ రాశారు. అందులో ‘‘తెలుగులో ఒక స్వయంకల్పితమైన వచన ప్రబంధం (‘original novel’) రాయడానికి మీరు పూనుకోలేరా?’’ అన్నారు. కందుకూరి నవలా రచనకు శ్రీకారం చుట్టడానికి ఈ ప్రోత్సాహం కూడా కారణమైంది.


రెండు వందలేళ్ళ క్రితం జరిగిన కథగా రాజశేఖరుని వృత్తాంతాన్ని కందుకూరి చిత్రీకరించారు. సమాజంలోని ఆచార వ్యవహారాల్ని, సనాతన సంప్రదాయాల్ని, అంధవిశ్వాసాల్ని, మూఢాచారాల్ని, జ్యోతిష్యంపై ఉన్న పిచ్చిని, శుభ నక్షత్రాల్ని చూపడం, కలలను నమ్మడం, శకునాల్ని నమ్మడం, స్వర్ణయోగం, లంకెబిందెలు, దేవుని మాన్యాల్ని దోచుకోవడం, శాంతులు, నోములు, వ్రతాలు, గుళ్ళు గోపురాలు, ఎరుకల సోదెలు, సూతకాలు, బాల్యవివాహాలు, దొంగ సన్యాసులు... ఇలా ఎన్నో విషయాల్ని కందుకూరి కళ్లకుకట్టినట్లు వివరించారు. 


ఆ కాలం నాటి సాంఘిక పరిస్థితులకు ఈ నవల ప్రతిబింబం. ఆ కాలం నాటి సమాజంలో సనాతన సంప్రదాయాల పేరుతో వున్న మూఢాచారాల్ని ఎత్తిచూపి, వాటి నిర్మూలానికి తన శక్తి వంచన లేకుండా కందుకూరి కృషిచేశారు. నాడు, నేడు సమాజంలో కులంపేరుమీద, మతంపేరుమీద, దేవుడి పేరుమీద, ఆచారాల పేరుమీద, సంప్రదాయాల పేరు మీద, చెప్పరాని మారణ హోమాలు ఎన్నో జరుగుతు న్నాయి. వ్యక్తుల బలహీనతల్ని ఆసరాగా తీసుకొని, కొంతమంది సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళలో మార్పు రావాలనే కందుకూరి ఈ నవల రాశారు. 


1878లో ‘ది హిందూ’ పత్రికలో ఈ నవలపై మంచి సమీక్ష వచ్చింది. 1887 సెప్టెంబర్‌ 30వ తేదిన ‘ది లండన్‌ టైమ్స్‌’ పత్రిక సాహిత్యానుబంధంలో ‘రాజశేఖర చరిత్ర’ ఆంగ్ల అనువాదాన్ని గూర్చి సమీక్ష వచ్చింది. ఇలా ఆంగ్ల పత్రికలో సమీక్షించబడిన తొలి తెలుగు నవల కూడా ఇదే. 1887లో ఆర్‌. హచిన్‌సన్‌ ‘రాజశేఖర చరిత్ర’ను ‘అదృష్టచక్రం’ (‘Fortune's Wheel’) పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేశారు. ఈ అనువాద గ్రంథానికి ఉపోద్ఘాతం మెకంజీదొర రాయడం చెప్పుకోదగ్గ విశేషం.


గురజాడ తన ‘కన్యాశుల్కం’ నాటకంలో కందుకూరి రాసిన ‘రాజశేఖర చరిత్ర’ నవలను ప్రస్తావిస్తారు. వేసవికాలపు సెలవులు సుఖంగా వెళ్ళబుచ్చటానికి వెంకటేశానికి తరగతి పుస్తకాలు కొనే మిషతో గిరీశం అగ్నిహోత్రావధాన్లను బోల్తాకొట్టించి డబ్బు రాబట్టటానికి వెంకటేశంకు ‘‘అవశ్యం కొనాల్సిన పుస్త కాల జాబితా వ్రాసుకో వాయ్‌’’ అని చెప్పుతూ అందులో ‘రాజశేఖర చరిత్ర’ను కూడా చేర్చాడు. అప్పారావు తన డైరీలో కూడా ‘రాజశేఖర చరిత్ర’ను మెచ్చుకుంటూ రాసుకున్నారు. కొడవటి గంటి కుటుంబరావు ‘గడ్డురోజులు’ నవలలో కథానాయకుడు ‘రాజశేఖర చరిత్ర’ చదివి ఎంతగానో ప్రభావితమైననాడని వర్ణించారు. తర్వాత వచ్చిన నవలలకు మార్గం చూపిన నవయుగ వైతాళికుడు వీరేశలింగం. తెలుగు నవలా వికాసంలో వీరి పాత్ర అనన్య సామాన్యమైంది. కందుకూరి ప్రభావంతో చిలకమర్తి ‘రామచంద్ర విజయం’ రాశారు. దక్షిణ భారత దేశంలో వీరేశలింగం, సుబ్రహ్మమణ్య భారతి మహోన్నత మైన వ్యక్తులు. కందుకూరి అంటే భారతికి ఎంతో అభిమానం. ఆ అభిమానం ఎంతవరకు వెళ్ళిందంటే తాను రాసిన ‘చంద్రిక’ నవలలో కందుకూరి, రాజ్యలక్ష్మి దంపతుల్ని పాత్రలుగా చిత్రీకరించారు. ఇంతకంటే ఒక రచయితకు ఏమి కావాలి. అందుకే వీరేశలింగం ‘దిగ్రేట్‌’.

(ఏప్రిల్‌ 16 కందుకూరి 175వ జయంతి)

వెలమల సిమ్మన్న

94406 41617


Updated Date - 2022-04-11T05:54:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising