జనపదాల్లో పదిలమైన చరిత్ర కాటమరాజు కథలు
ABN, First Publish Date - 2022-02-28T10:01:11+05:30
తెలుగుదేశంలో (ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలిసి) రెండు ప్రసిద్ధ మైన జానపద వీరగాథలు ఉండేవి: ఒకటి ‘పల్నాటి వీరచరిత్ర’, రెండది ‘కాటమరాజు కథలు’...
తెలుగుదేశంలో (ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కలిసి) రెండు ప్రసిద్ధ మైన జానపద వీరగాథలు ఉండేవి: ఒకటి ‘పల్నాటి వీరచరిత్ర’, రెండది ‘కాటమరాజు కథలు’. ఇటీవలనే పల్నాటి వీరుల ‘వీర గానం’ పల్నాడులో వారోత్సవాలుగా జరిగింది. అలాగే సరిగ్గా ఉగాది పండుగకు ఒకరోజు ముందు తెలుగు రాష్ట్రాలలోని యాదవులందరు నల్లమల్ల అడవుల్లోని రాజమలారణ్యంలో ఉన్న వేనూతల కాటమరాజుకి, వేనూతల గంగా భవానికి భక్తి ప్రపత్తులతో పూజలు చేసి, అక్కడ పెద్ద జాతర జరిపిస్తారు. నిజానికి ‘పల్నాటి వీర చరిత్ర’, ‘కాటమరాజు కథలు’ రెండూ జానపద గానాల రూపంలోనే ఉంటాయి. అయినప్పటికీ ఇవి చారిత్రక కథలు.
వేటూరి ప్రభాకరశాస్త్రి లాంటి వారు ఈ కథలపై తొలి పరిశోధనలు జరిపిననాళ్ళలో వాటిని ‘ఐతిహాసాలు’గానే పేర్కొన్నారు. వేటూరి ప్రభా కరశాస్త్రి, తిమ్మావఝల కోదండరామయ్య, సి.పి. బ్రౌన్, మల్లంపల్లి సోమశేఖరశర్మలు తొలినాళ్ళలో ‘కాటమరాజు కథల’పై కొంత ప్రాథమిక పరిశోధనలు చేసినా అవి అసంపూర్తిగానే ఉండినాయి.
అసలు ‘కాటమరాజు కథలు’ ఎన్ని? వారు ఏ ప్రాంతంవారు? ఏ కాలంలో ఏయే ప్రాంతాలను పాలించారు? కులగోత్రాలు ఏమిటి? ఇంటి పేర్లు ఏమిటి? వారి పూర్తి పేర్లు, వంశవృక్షం, బిరుదులు, రాజధానులు, కోటలు వంటి వివరాలన్నీ సమగ్రంగా శోధించి, సంపూర్ణ విశ్లేషణ చేసినవారు ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు. ఆయన పరిశోధన ప్రకారం ‘కాటమరాజు కథలు’ దాదాపు 32 దాకా ఉన్నాయి. వాటిని వారు ‘కాటమరాజు కఽథా చక్రము’ అని వివరించారు. అయితే వారి పరిశోధనలోని తొలినాటి పరిశీలనల ఆధారంగా 19 ప్రధానకథలను, ఆరు అనుబంధ కథలను కలిపి మొత్తం 25 కథలను నాటి ఉమ్మడి రాష్ట్రం లోని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమివారు ‘కాటమరాజు కథలు’ అనే పేరుతో 1976లో రెండు సంపుటాలుగా ప్రచురించారు. రెండు దశాబ్దాల తర్వాత 1998లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు రెండవ ముద్రణగా త్రెచ్చారు. ఇప్పుడు ఇవి కూడ లభించడం లేదు. ఇటీవల తంగిరాల వెంకట సుబ్బారావు సొంత ఖర్చుతో అన్నీ కలిపి ఏక ముద్రణగా (2021లో) పునర్ముద్రించారు.
కాటమరాజు కథలు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యతగలవి. ఈ కథల్లో కనిపించే అనేక ప్రాంతాలు, కోటలు నేటికీ ఉన్నాయి. సామాజికంగా పరిశీలిస్తే ఇవి ప్రధానంగా ‘యాదవ రాజుల కథలు’. ‘యాదవ భార తము’, ‘యదు శాస్త్రం’గా కూడ వీటిని అభివర్ణిస్తారు. మహాభారతం, భాగవతంలో కనిపించే యాదవరాజుల ప్రశస్తి తిరిగి మళ్ళీ మనకు ఈ కథల్లో కనిపిస్తుంది. అన్నింటికీమించి సామాజికంగా, చారిత్రకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమేమిటంటే ఈ రాజులందరూ ఒక శరణు కోరిన రాజునో, వారి బలగాలనో, ఆలమందలనో, రాజ్యాలనో రక్షించే లక్ష్యంలో భాగంగా యుద్ధాలు చేసి అశువులు బాసారు. అందువల్లనే ‘‘పరకార్యం మీద పాడైపోయింది యాదవకులం’’ అనే సామెతను, కాటమరాజు కథల జానపద గాయకులు ముఖ్యంగా గొల్లసుద్దులవారు తరుచూ అంటుంటారు అని వ్యాఖ్యానించారు తంగిరాలవారు.
ఈ ‘కాటమరాజు కథా చక్రము’లో కవి తిక్కన తమ్ముడైన ఖడ్గతిక్కన ప్రస్తావన వస్తుంది. ఖడ్గ తిక్కన మనందరికి తెలుసు. ఆయన ఒక చారిత్రక వాస్తవం. ఖడ్గ తిక్కన పినతండ్రి కొమ్మనామాత్యుడి పుత్రుడు కవి తిక్కన. ఖడ్గ తిక్కన తండ్రి సిద్ధనామాత్యుడు. సిద్ధనామాత్యుడు, కొమ్మనామాత్యుడు అన్నదమ్ములు. విశేషమేమిటంటే నెల్లూరు సీమను పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో కవి తిక్కన సోమయాజి ఆస్థాన పండితుడిగా పనిచేస్తున్న కాలంలోనే, ఖడ్గ తిక్కన మనుమసిద్ధి కొడుకైన నల్లసిద్ది ఆస్థానంలో సేనానిగా పనిచేశాడు. అయితే కవి తిక్కన రచనల్లో, అవతారికల్లో ఎక్కడా ఖడ్గతిక్కన ప్రస్తావన కనిపించకపోవటం వలన వారిద్దరి మధ్య ఒకతరం తేడా ఉండి ఉంటుందని తంగిరాల వారు భావించారు. కవి తిక్కన కాలం చేశాక, ఖడ్గ తిక్కన యుద్ధం చేసి యాదవరాజు చలమపిన్నమనీడు బ్రాహ్మణమంత్రి బ్రహ్మ రుద్రయ్య చేతిలో మరణించి ఉంటాడని కూడ ఆచార్య తంగిరాల అభిప్రాయం.
యాదవరాజులు నేరుగా బ్రాహ్మణునితో యుద్ధం చేయటానికి నిరాకరి స్తారు. అప్పటికే ఖడ్గ తిక్కన సైన్యం మొత్తం యాదవరాజు చల్లపిన్నమనీడి సైన్యం చేతిలో వీరమరణం పొందుతారు. ఖడ్గ తిక్కన ఒక్కడే మిగులు తాడు. అందువలన యాదవరాజు యుద్ధం నిలిపివేస్తాడు. చల్లపిన్నమ నీడు తమ సైన్యంలో ఉన్న బ్రాహ్మణుడైన మంత్రి, శివారాధకుడైన బ్రహ్మరుద్రయ్యను ఖడ్గ తిక్కనతో ద్వంద్వ యుద్ధం చేయమని ఆజ్ఞాపి స్తాడు. ఆ ద్వంద్వ యుద్ధాన్ని గుంగుల పినయెల్లయ తన గానంలో ‘న భూతో న భవిష్యతి’గా వర్ణిస్తాడు: ‘‘ఇర్వురు పోరిరి దుర్వారులగుచు/ తిక్కడు ద్రిక్తుడై తెగవవ్రేయ, రుద్రుడక్కడ చెక్కలై అవనిపైబడి యె/ పడుచునే రుద్రుడా ఏకఖడ్గధార/ తడయక ఆ మంత్రి తనద్రుంచివైచే!’’
ఈ జానపద కథను జానపద సాహిత్యంలో పెల్లుబికే వీర రసానికి ఒక ఉదాహరణగా పేర్కొంటారు తంగిరాల. నిజానికి కాటమరాజు కథలన్నీ వీరగాథలే కాబట్టి ‘వీర రసం’తో పొంగిపొర్లుతాయి. గాన కథనం కూడ యుద్ధంలాగే రౌద్రంగా, ఘన మైన కంఠారావంతో దద్దరిల్లుతూ ఉంటుంది. ఉదా హరణకు ఈ గాథ కథనం నడక చూడండి: ‘‘ధరణిపై నొండరుం దప్పించుకొనుచు/ లంగించి వెనుకకు రాగ డిల్లుచును/ ప్రాకుచు, దూకుచు, పైకి రేగుచును/ లాటించి నఱుకుచు, తాకి పొడ్చుచును/ ఉరవడితో వచ్చి పరునడివేసి/ కటపెట ఖంఖంగు ఘల్లు ఘల్లనుచు....’’
ఈ విధమైన జానపద కథాగానం వెనుక వాస్త వికతను ఆచార్య తంగిరాల వారు చాలా సూక్ష్మంగా విశ్లేషించి ఈ కథలు ఎందుకు చారిత్రక వాస్తవమో సహేతుకంగా వివ రించారు. ‘‘కాటమ రాజుల ఆస్థానాలలో ఎంతోమంది కవులుండేవారు. వారంతా ఈ వీరుల సాహస గాథలను ‘‘కళ్ళార చూసి, యథాతథంగా వర్ణించి ఉండటం వల్లనే ఈ కథాకథనం ఒళ్ళు గగుర్పొడిచెలా సాగి ఉంటుంది. లేకపోతే ఈ కథలలో ఉండే అతి సూక్షమైన వివరాలు, అత్యద్భుత వర్ణనలు, వీర- రౌద్ర- కరుణ- అద్భుత రసాల పోషణ ఎక్కడి నుండి వస్తాయి’’ అంటారు తంగిరాల.
వాస్తవానికి ‘పల్నాటి వీరచరిత్ర’ను ద్విపదగా రాసిన శ్రీనాథుని రచనను ఆధారంగా చేసికొని తర్వాతి కాలంలో మల్లయ్య, కొండయ్య అనే కవులు ‘పల్నాటి వీరచరిత్ర’ జానపద గానంగా, వీరగానంగా మలిచారు. ‘పల్నాటి వీర చరిత్ర’ రాసిన శ్రీనాధుడే ‘కాటమరాజు చరిత్ర కూడ’ రాసి ఉంటాడని ఈ ప్రాంతంలో జనవాక్యంగా తంగిరాల వారి పరిశోధనలో వెల్లడైంది. కాని శ్రీనాథుని రచనగా ఏ కాటమరాజు కథ లభించకపోవటం వలన ఈ జన వాక్యాన్ని ‘ప్రామాణికంగా తీసుకోలేక పోయారు తంగిరాల.
కాటమరాజుల కథలకు సంబంధించిన తాళపత్రగ్రంథాల ఆధారంగా తొమ్మిది మంది జానపద కవులున్నట్లు గుర్తించారు తంగిరాలవారు. వారిలో గుంగుల పినయల్లయ, వడరూప మద్దులేటి కవి (ఆవుల వలు రాజు కథ), మల్లయ్య (పంపాద్రి కథ), కనకబండి ఘట్టయ్య (పోలు రాజు కథ, జన్నివాడ కథ), కట్టెబోయిన మారయ్య కవి (కాటమరాజు పట్టాభిషేకం), గొట్టిపాటి మల్లయ్య (బొంగరాల కథ), కదిరి మంగళం వెంకటాద్రి/ మంగళపురి వెంకటాద్రి (పాపనూక కథ) రాలపాక వెంకురాం కవి (పాపనూక కథ), జరుగుపల్లె చెన్నయ్య (అగుమంచి కథ). ప్రముఖ కవి గంగుల పినయల్లయ్య (పిన మల్లన అనే మరో మారు పేరు కూడ ఈయనకే ఉంది) కఱియావుల రాజు కథ, ఎఱ్ఱగడ్డపాటి పోట్లాట కథలను జానపద గానంగా రాశాడు.
కాటమరాజులు ఏ కాలానికి చెందినవారు అన్నది తంగిరాల వారి పరిశోధనలో తేటతెల్లమయింది. నిజానికి ‘చరిత్ర’ను ఒక పాఠ్యాంశంగా పరిశోధించేవారు సాహితీ పరిశోధనలో వెలువడే సాహితీ చరిత్రతో తమ పరిశోధనలను సరిపోల్చుకుంటే, చారిత్రక శోధన ప్రస్తుత గమనం అంత అస్తవ్యస్తంగా ఉండేది కాదు. కాటమరాజు కథలలోని వీరుల కాలం దాదాపుగా పన్నెండు, పదమూడవ శతాబ్దాల మధ్య కేంద్రీకృతమై ఉంది. ఆవుల వలురాజు (క్రీ.శ. 1170-1195), పెద్దిరాజు (1195-1223), పోలు రాజు (1212-1223), అయతమరాజు (1222-1283), కాటమరాజు (1217- 1283), చోడ తిక్క లేక మొదటి తిక్క (1209-1248), మనుమసిద్ధి (1248-12067), నల్లసిద్ధి (1270-1283).
కాటమరాజును యాదవులు విష్ణు అవతారంగా భావిస్తారు. అందు వలన కృష్ణ భాగవతాన్ని (కంసుడు కథ) కూడ కాటమరాజు కథల్లో ఒకటిగా పరిగణిస్తారు. ‘అగుమంచి వల పోత’, ‘గంగ పుట్టుక’, ‘వల్లికొండ పుట్టుక’, ‘కంసుడు కథ’ (కృష్ణ భాగవతము/ విష్ణు భాగవతము)లను నాలుగు వీర గాథలను కూడ కాటమరాజు కథా చక్రములో భాగంగానే పరిగణించారు తంగిరాల. కాటమరాజుకు ఆరు పేర్లు, 77 బిరుదులు ఉన్నాయని కాటమరాజు కథలను బట్టి తెలు స్తుంది. నలనన్న, ఆవులన్న, పశువులన్న, నాట కోటేశ్వరుడు, కాటమ రాజు, కత్రేయుడు అని ఆరు రకాలు పేర్లతో కాటమరాజు కథలు గానం చేస్తారు. ఆంభోజ బిరుదు, ప్రళయ కాల బిరుదు, సింగిణీ తోరణాలు, కనక సింగిణీలు, విష్ణు బిరుదు, చంద్ర బిరుదు, గరుడ శార్దూల, కనక పడగలు, భాస్మశంకర వంటివి ఆ 77 బిరు దుల్లో కొన్ని.
కాటమరాజు ముత్తాత పేరు కవులావుల గంగురాజు, తాత పేరు ఆవుల వలురాజు. తంగిరాల పరిశోధన ప్రకారం కాటమరాజు ఇంటిపేరు మొదట ‘కవులావులవారు’గా ఉండి ఉండవచ్చునని, తరువాతి కాలంలో అది ‘ఆవులవారు’గా మారిందని తెలుస్తున్నది. గుఱ్ఱం కొండ భక్తవత్సల కవి తన పద్య కావ్యంలో కాటమరాజు ఇంటిపేరు ‘కఱియావుల వారు’ అని పేర్కొన్నారు. అంటే ‘కవులావుల’నే ‘కఱి యావులగా’ మార్చినది విస్పష్టం (కఱియావుల వారంటే నల్లని ఆవులు కలవారు అని). కాట మరాజు కథా చక్రములోని ప్రధాన వీరుడు, అవతార పురుషుడు అయిన కాటమరాజు జననం క్రీ.శ. 1217 ఫిబ్రవరి 19వ తేదీగానూ, ఆయన ఎఱ్ఱగడ్డ పాడులో నెల్లూరు పాలకుడైన, మనుమసిద్ధి కుమా రుడు నల్లసిద్ధిరాజు చేతిలో వీర మరణం పొందిన తేదీని మార్చి 7, 1283గాను తంగిరాలవారి పరిశోధన నిర్ధారించింది.
కాటమరాజు మధ్యయుగంనాడు ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాల్లోని చిన్నచిన్న దేశాలను పాలించారు. యలమంచి, పంపాద్రి, అర్థవీడు, ఉర్లుకొండ యలమంచి, దొనకొండ, బురగడ్డపాడు వంటివి ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం, నల్లగొండ ప్రాంతాలకు చెందినవి. కొన్ని ఇప్పటికీ అవే పేర్లతో ఉన్న విషయం కూడ విజ్ఞులకు విదితమే (అర్దవీడు, దొనకొండ). యలమంచి విశాఖ జిల్లాలోనిది. పంపాద్రి తూర్పు గోదావరి జిల్లాలోను, ఉర్లుకొండ యలమంచి నల్లగొండ జిల్లాలోను ఉన్నాయి. ఈ కథల్లో పంపా నదే నేటి అన్నవరం కొండ పక్కనుంచి పారుతున్న పంపానది. ఒంగోలు దగ్గరగా ఉంటున్న కనిగిరి కోట కాటమరాజు కట్టించిందేనని ఇప్పటికీ ఆ ప్రాంతం ప్రజలు నమ్ముతారు. ఉర్లుకొండ యలమంచి ఓరుగల్లుకు సమీపంలో ఉంటుంది. భక్తిరన్న ఈ ప్రాంతాన్ని పాలించాడు.
కాటమరాజు కథాచక్రములోని గాథలు, గానాలు సాహిత్య ఔన్న త్యంతో వీర, భీభత్స, శాంత రసపోషణలతో వీనుల విందుగా సాగు తాయి. ప్రస్తుతానికి 19కథలే లభ్యమవుతున్నా, తంగిరాలవారి పరిశో ధనలో ఇంకా ఆరు కథలు సేకరించవలసి ఉన్నాయి. అవి: సింహాద్రి రాజు కథ, నలనూకరాజు కథ, భైరవ కురవ యుద్ధం, గంగ పుట్టుక, పల్లికొండ పుట్టుక, అగుమంచి వలపోత. ఇవికాక ఇంకా ఆరు మిగిలే ఉంటాయి. వాటి పేర్లు ఏమిటో కూడ భవిష్యత్తు పరిశోధకులు శోధించాలి అని ఒక ఆశయాన్ని వ్యక్తం చేస్తున్నారు తంగిరాల వెంకట సుబ్బారావు.
కొప్పరపు నారాయణమూర్తి
Updated Date - 2022-02-28T10:01:11+05:30 IST