కాకినాడ కాంగ్రెస్ మహాసభ
ABN, First Publish Date - 2022-06-03T06:11:34+05:30
కాకినాడ కాంగ్రెస్‌లో శ్రీమతి సరోజినీనాయుడు ప్రసంగిస్తూ ‘దాక్షిణాత్యులు బుద్ధి సూక్ష్మతయందు ప్రసిద్ధులనియు, ఆంధ్రులు హృదయ పరిపాకమున శ్రేష్ఠులనియు’ ప్రస్తుతించారు....
కాకినాడ కాంగ్రెస్‌లో శ్రీమతి సరోజినీనాయుడు ప్రసంగిస్తూ ‘దాక్షిణాత్యులు బుద్ధి సూక్ష్మతయందు ప్రసిద్ధులనియు, ఆంధ్రులు హృదయ పరిపాకమున శ్రేష్ఠులనియు’ ప్రస్తుతించారు. దీనిపై కొండా వెంకటప్పయ్య ఇలా వ్యాఖ్యానించారు: ‘అప్పటికి ఆంధ్రులు స్వతంత్రులు, సమర్థులునగు ప్రత్యేకోపజాతి యను విషయము భారతదేశమున నెల్లరకు తెల్లమయ్యెను’.
ఇంచుమించు వంద సంవత్సరాల క్రితం గోదావరి నదిలో పెను వరదలు సంభవించాయి. అదే సమయంలో గోదావరీ తీరస్థ ప్రాంతాలు తుఫాను దెబ్బకు తల్లడిల్లిపోయాయి. టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ వరద బాధితుల సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టింది. ఆ విపత్సమయంలోనే భారత జాతీయ కాంగ్రెస్ తన వార్షిక మహాసభను కాకినాడలో నిర్వహించాలని నిర్ణయించింది.
1923 డిసెంబర్‌లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభ చరిత్రాత్మకమైనది. ఆంధ్రరాష్ట్రంలో ప్రప్రథమంగా జరిగిన కాంగ్రెస్ మహాసభ అది.
ప్రకాశం తన ‘నా జీవిత యాత్ర’లో ఇలా రాశారు : ‘నాటి వరదలూ, తుఫానులూ కూడా కాంగ్రెస్‌కు కావలసిన యేర్పాట్లు సవ్యంగా చేయడానికి వీలులేకుండా చికాకులూ, ఇబ్బందులూ కలుగజేశాయి. కాంగ్రెస్‌కు అవసరమయ్యే ఖర్చుల కోసం, కాంగ్రెస్ వారు ధనాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు... ఆంధ్ర ప్రజానీకంలో వెనకాడే గుణం లేకపోవడాన్ని, వారికున్న ఆర్థిక ఇబ్బందులను విస్మరించి, వలసిన ఆర్థిక సహాయాన్ని ఆనందంగా అందజేశారు’.
కాకినాడ కాంగ్రెస్‌కు మౌలానా మహమ్మదాలీ అధ్యక్షత వహించారు. కొండా వెంకటప్పయ్య ఆహ్వాన సంఘాధ్యక్షులు. మోతీలాల్, జవహర్‌లాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్, సేలం విజయరాఘవాచార్య, కస్తూరిబాయి, సరోజినీ నాయుడు మొదలైన ప్రముఖులు ఈ మహాసభకు విచ్చేశారు. ఈ మహాసభ సమయంలో మహాత్మాగాంధీ ఎరవాడ జైలులో ఉన్నారు. కొండా వెంకటప్పయ్య తన ‘స్వీయ చరిత్ర’లో ఇలా రాశారు: ‘కాంగ్రెస్ మహాసభ వేద పారాయణముతోడను, మహమ్మదీయ క్రైస్తవ ప్రార్థనలతోడను, వందేమాతర గీతము తోడను ప్రారంభము కాబడెను. బొంబాయిలో గాంధర్వ విద్యా పీఠమునకు అధ్యక్షుడును సుప్రసిద్ధ గాయకులునగు విష్ణు దిగంబరులు మంగళగీతములు పాడి సభ్యులను ఆనందసాగరమున ముంచివేసిరి. నేను సన్మాన సంఘాధ్యక్షోపన్యాసమును హిందీలోను, తెలుగులోను వ్రాసి అచ్చువేయించితిని. ఇదియే హిందీలో అధ్యక్షోపన్యాసము వ్రాసి చదువుటకు ప్రథమమగుట చేత ఉత్తర హిందూస్థానము నుండి సభకు వచ్చిన వారందరికిని పరమానందము కల్పించెను. ఉత్తర హిందూస్థానము నందు పత్రికలలో సయితము దీనిని విశేషముగ ప్రస్తుతించిరి’.
చట్టసభలలో ప్రవేశించి సహాయనిరాకరణం కొనసాగించాలని వాదిస్తున్న స్వరాజ్యవాదులకు అనుకూలంగా తీర్మానాలు ఆమోదం పొందాయి. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూల నాయకత్వంలోని స్వరాజ్యవాదుల పక్షానికి విజయం లభించేందుకు, వారి వాదనతో ఏకీభవించని ప్రకాశం గణనీయమైన తోడ్పాటునందించారు.
కాకినాడ కాంగ్రెస్‌కు సంబంధించి చెప్పుకోవలసిన విశేషం ఒకటి ఉంది. ఏటా కాంగ్రెస్ మహాసభ జరిగిన చోట పెద్ద పందిళ్లు నిర్మించడం పరిపాటిగా ఉండేది. వాటి నిర్మాణానికి భారీ వ్యయమయ్యేది. కాకినాడ అనంతరం కూడా మహాసభ ఎక్కడ జరిగినా వేసుకోవడానికి సువిశాలమైన ఖాదీ డేరా, దానికి కావలసిన హంగులను ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ శాశ్వతంగా సమకూర్చింది. కాకినాడలో నిర్మించిన డేరానే మరుసటి సంవత్సరం బెల్గాంలోనూ, ఆ తరువాత కొన్ని సంవత్సరాల పాటు మహాసభ ఎక్కడ జరిగినా ఉపయోగించడం జరిగింది.
కాకినాడ కాంగ్రెస్ నిర్వహణకు అనుపమేయమైన కృషి చేసినవారు బులుసు సాంబమూర్తి. ఏకపుత్ర శోకంలో ఉండి కూడా కాకినాడ సభలను ఆంధ్రులకు గర్వకారణమయేలా విజయవంతంగా నిర్వహించారు. ప్రకాశం ఇలా రాశారు: ‘కాకినాడ కాంగ్రెస్ చరిత్ర (మహర్షి) బులుసు సాంబమూర్తి గారిని తలపెట్టకుండా ముగించకూడదు. కాంగ్రెస్ ఏర్పాట్లన్నీ ఆయన భుజస్కంధాలపైనే మోపబడ్డాయి... కాంగ్రెస్‌కు వచ్చిన ప్రతినిధులూ, ప్రేక్షకులూ కూడా జరిగిన, జరుగుతున్న ఏర్పాట్లకు విస్తుపోయారు. వచ్చిన వారికందరికీ అనుకున్న దానికంటే ఎన్నోరెట్లు అధికంగానే ఆదరణ లభించింది. ఆయన చేసిన ప్రతికార్యం అమోఘంగానే నిర్వహింపబడింది. సాంబమూర్తిగారు తమ నేర్పుతో ఆంధ్రదేశీయుల నందరినీ ఒక ‘‘కామధేనువు’’గా మార్చగలిగారు’.
Updated Date - 2022-06-03T06:11:34+05:30 IST