పేరు మారినా, ‘చరిత్ర’ మారునా...!?
ABN, First Publish Date - 2022-10-07T05:54:26+05:30
తెలంగాణ అస్తిత్వవాదంతో పురుడుపోసుకుని, పెరిగి, పెద్దదై, అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) నేడు భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)గా పేరు మార్చుకున్నది...
తెలంగాణ అస్తిత్వవాదంతో పురుడుపోసుకుని, పెరిగి, పెద్దదై, అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్) నేడు భారత్ రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్.)గా పేరు మార్చుకున్నది. పర్యవసానంగా టి.ఆర్.ఎస్. ఉనికి కోల్పోయింది. బి.ఆర్.ఎస్‌కు దేశంలో ఎదిగే అవకాశాలు మృగ్యం. ప్రాంతీయ అస్తిత్వవాదంతో ఎదిగిన సంకుచిత రాజకీయ నాయకత్వానికి జాతీయ దృక్పథం వంట పట్టదు.
ఆల్ ఇండియా అన్నాడిఎంకె ఇంకే రాష్ట్రంలోనైనా ఉన్నదా? ఎన్నికల కమిషన్ దగ్గర నమోదు చేసుకొన్నంత మాత్రాన ప్రతి పార్టీ జాతీయ పార్టీ అయిపోదు. నమోదు తొలి మెట్టే. నేడు జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉన్న ఎనిమిది పార్టీల్లో ఆరు తమ గుర్తింపును కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయి. హైదరాబాదు కేంద్రంగా ఉన్న ప్రసారమాధ్యమాలకు విధిలేక కేసీఆర్ పెట్టిన బి.ఆర్.ఎస్‌కు కృత్రిమంగా హైప్ సృష్టిస్తున్నట్లు కనపడుతున్నది. గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో మోదీ ప్రభుత్వం అమలు చేసిన లౌకిక -ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థకు ప్రమాదకారిగా పరిణమించే విధానాలను,- బిల్లులను, దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ దిగ్గజాల ఆధిపత్యంలోకి నెడుతున్న ప్రజా వ్యతిరేక చర్యలను ఏనాడైనా కేసిఆర్ ప్రతిఘటించారా?
గడచిన ఎనిమిదేళ్ళుగా కేసీఆర్ సుపరిపాలన అందించలేదు కదా, అవినీతి, అప్రజాస్వామిక పాలన చేశారు. టి.ఆర్.ఎస్ తెలంగాణలో అడుగంటిపోతున్నదనే భయాందోళనలు కంటికి కునుకు లేకుండా చేశాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల కాలంలో కాస్త నోరు తెరచి మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మోదీ–కెసిఆర్ లాలూచీ కుస్తీ చేస్తున్నారేమోనన్న అనుమానాలూ ఉన్నాయి. ఇద్దరూ హోరాహోరీ పోట్లాడుకొంటున్నట్లు సీన్ సృష్టిస్తే మధ్యలో కాంగ్రెస్ ఎత్తిపోతే ఉభయులకు లాభం చేకూరుతుంది.
ఈ అనుమానాలకు ప్రాతిపదిక మోదీ– కేసీఆర్ వ్యక్తిత్వాలపై ఉన్న అవిశ్వాసమే. సమాఖ్య వ్యవస్థను గురించి మాట్లాడే కేసీఆర్ పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాల అమలుకు మాత్రం అంగీకరించడం లేదు. నదీ జలాల వినియోగం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అనుమతులు లేకుండానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణం, అక్రమంగా జల విద్యుదుత్పాదన, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చినా విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడం, ఉమ్మడి ఆస్తుల పంపకం తదితర అంశాల్లో అంధ్రప్రదేశ్ వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్న కేసీఆర్ పెట్టిన బి.ఆర్.ఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే కనీస అర్హత ఉందా? ఆ పార్టీలో చేరే వారు కూడా ఉంటారా?
ఏమో చెప్పలేం! అవినీతిపరులను, అవకాశవాదులను, ఫిరాయింపుదారులను ఆదరిస్తున్న నేటి ఆంధ్రప్రదేశ్ సమాజం పోకడలు చూస్తుంటే తెలుగుజాతిని రెండు ముక్కలు చేసిన, ఆంధ్రులను నోటికొచ్చినట్లు దూషించిన కేసిఆర్‌కు అక్కడక్కడా స్వాగత సత్కారాలు దక్కుతాయేమో! అప్పుడెప్పుడో రాయలసీమను రతనాలసీమ చేస్తామని కేసీఆర్ నోట మాయమాటలు జాలువారితే ఉప్పొంగిపోయి గజమాలలు వేసిన ప్రబుద్ధులున్న సమాజం కదా! కొంతకాలం తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అక్రమ కట్టడమని, కృష్ణా నదీజలాలను దొంగలించుకు పోతున్నారని, కె.సి. కెనాల్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది 39.9 టియంసిలు కాదు, 10 టియంసిలేనని కేసీఆర్ మాట్లాడడం, కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం చూశాక ఆయనకు సన్మానాలు చేసిన ప్రబుద్ధుల నోట మాట పడిపోయింది. ఇలాంటి చరిత్ర కేసీఆర్‌కు చాలానే ఉన్నది. అలాంటి వ్యక్తి పెట్టిన పార్టీని ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశంలో ఆదరించే వారు ఉంటారనుకోవడం లేదు.
టి. లక్ష్మీనారాయణ
కమ్యూనిస్టు, సామాజిక ఉద్యమకారుడు
Updated Date - 2022-10-07T05:54:26+05:30 IST