అశుద్ధ మానవుడెవడు..!
ABN, First Publish Date - 2022-03-14T05:58:12+05:30
కొన్ని హస్తాలు ఎప్పటికీ కనికరం గింజలు విదల్చలేవు కొన్ని మనసు తీగలకు ఔదార్యం పూలు పూయవు ఏ దేవుడూ భారతీయ...
కొన్ని హస్తాలు
ఎప్పటికీ కనికరం గింజలు విదల్చలేవు
కొన్ని మనసు తీగలకు ఔదార్యం పూలు పూయవు
ఏ దేవుడూ భారతీయ ప్రామాణిక సమయానికి
మన్నా కురిపించడు
కంటికి పంటికి ఒంటికి మంచిదనిపించింది
ఈ దీనశరీరాకలికి ఆహుతి కావాలి
నత్తగుల్లలు-పిత్తపరిగలు-ఎండ్రకాయలు-పంది పేగుల్లో
పోషకాహారాన్ని పోగుచేసుకుని ఒంటికి పట్టించుకోవాలి
మంచి కొవ్వునిచ్చే నునుపైన వేరుశనగ వెన్న మాకెక్కడిదీ!
రీడర్స్ పోల్ నిర్వహించినా
రాడార్ మీద వెతికినా గంజి అన్న పదం
ఆంధ్రభారతిలో ఇప్పుడెంత మందికి తెలుసుగానీ
కరువాచిపోడానికి వార్చిన గంజి నీళ్లు చాలేమోనన్న జమానాలో
బతుకు బోను పెట్టిన చోటల్లా ప్రోటీన్ పడుతుందని
ఎన్నిసార్లు ఎలుకలు తినే ముషాహారుల వేషంగట్టామో
నిగ్గు తేల్చిన లెక్కలు తాజా జనగణన అంకెల్ని దాటేసి
తగ్గిన దేశ దయాదాక్షిణ్యాల భోగట్టాకు
జనగణమన పాడతాయి
దేశానికి ఆహారమే దొరకనప్పుడు
దేహానికి శాకాహార అవయవాలు పెంచినదెవడు ఓ గువ్వల చెన్న!
మా అనుదినాహారాన్ని వెజిటేరియన్ యేసు ప్రభువు స్విగ్గీలో పంపుతాడా!
సుతీమతీ లేకుండా కొన్ని సుమతీ శతకం పద్యాలు వల్లించినట్లు
ప్రతి పొయ్యిలో శాకాహార శ్లోకాలు చదివే పిల్లి పవ్వళిస్తే
మధ్యాహ్న భోజన పథకంలో అపురూపంగా దొరికే ఒకే ఒక గుడ్డు
పేద పిల్లల పళ్లెంలో సంపూర్ణాహారంగానే అలయ్ బలయ్ అడుతుంది!
కన్నప్పలా దర్జాగా మాంసాన్ని తెచ్చి ఆత్మారాముడికు నైవేద్యం పెట్టిన రోజులు
మలేషియన్ల తెలుగు భాషలా అంతరించిపోతాయి
అహింసా పరమోధర్మః కిలకిలారావాలకేంగానీ
చుండూరు మాలోళ్ళ రక్తంతో కట్టిన రక్తక్షేత్రం దగ్గర
వంటికి మాంసకృత్తులు పట్టడానికి మాంసమక్కరలేదని
రక్తంలో తడిచిన పూలదండలేసుకుని మా తెలుగుతల్లి పచ్చిగా బుకాయించినప్పుడు
దండిగా తగిలిన నరమాంసం రుచి
సర్వజనాభ్యుదయానికి బాగా తెలిసి ఉండాలి
కాలం కలిసి రావాలేగానీ
ఒక్క బియ్యపు గింజ పండించడం తెలియనోడు కూడా
నగర నడివీధుల్లో శాకాహార భోజన హోటల్ తెరుస్తాడు..
పురుగులు విసర్జించిన అశుద్ధంతో నేసిన పట్టువస్త్రధారిగా
జీడిపప్పు తింటూ తాగే చిక్కటి మేకపాలు జాతీయ పానం అవుతుంది..
తీసుకున్న దక్షిణలన్నీ ఒకే మాంసాహార వాసన..
పశువుల అశుద్ధాన్ని ఎరువుగా పెంచిన
ఆర్గానిక్ వెజిటెబుల్స్ ఫక్తు శాకాహారమని నేనెందుకనాలి
అశుద్ధ మానవుడు ఎవడు ఓ కుల కుంకుమపువ్వా!
తమోగుణమో రజోగుణమో సత్వగుణమో
తమామూ అలవాటులేని పెనుగులాటలో
మనుషుల్లో మనిషి లక్షణం ఏమన్నా ఏకొద్దిగైనా ఎక్కడైనా
మిగిలి ఉందో లేదోనని లోలోపలికి ఒకటే వెదుకులాట..
తుల్లిమల్లి విల్సన్ సుధాకర్
95380 53030
Updated Date - 2022-03-14T05:58:12+05:30 IST