బాణసంచా ప్రమాదాలు.. 525 మందికి గాయాలు
ABN, First Publish Date - 2022-10-26T08:07:41+05:30
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఆనందోత్సాహాలతో ప్రజలు జరుపుకున్న దీపావళి(Diwali) వేడుకల్లో కొన్నిచోట్ల దుర్ఘటనలు నెలకొన్నాయి.
- క్షతగాత్రులకు మంత్రి పరామర్శ
పెరంబూర్(చెన్నై), అక్టోబరు 25: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఆనందోత్సాహాలతో ప్రజలు జరుపుకున్న దీపావళి(Diwali) వేడుకల్లో కొన్నిచోట్ల దుర్ఘటనలు నెలకొన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు రాష్ట్రవ్యాప్తంగా 284 ప్రాంతాల్లో బాణసంచా ప్రమాదాలు సంభవించాయి. ఆ సమయంలో సిద్ధంగా వున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఆయా ప్రాంతాలకు చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. అదే విధంగా ప్రమాదాల్లో రాష్ట్రవ్యాప్తంగా 525 మంది గాయపడ్డారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుపత్రిలో గాయాలతో చికిత్స పొందుతుండగా, మరొకరు చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. స్టాన్లీ ప్రభుత్వాసుపత్రిలో 11 మంది చికిత్స పొందుతుండగా, మరో 25 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే, ఎగ్మూర్ చిన్నపిల్లల ఆసుపత్రిలో 11 మంది, కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రిలో 10 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36 వైద్యకళాశాల ఆసుపత్రుల్లో 345 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ కాగా, మరో 180 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా వుండగా రాజీవ్‌గాంధీ ప్రభుత్వాసుత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం మంగళవారం ఉదయం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, బాణసంచా పేలుళ్లలో గాయపడిన వారిని సత్వరం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలా చర్యలు చేపట్టామన్నారు. పండుగ సందర్భంగా అగ్నిప్రమాదాలు జరగకుండా చేపట్టిన అవగాహన ప్రచారాలతో ఈ ఏడాది బాధితుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రి(Rajiv Gandhi Government Hospital) చికిత్స పొందుతున్న నలుగురు చిన్నారులు పదేళ్లలోపు వారని తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి మాత్రం కంటి చూపు కోల్పోయే అవకాశముందని, అతనికి వైద్యులు తగిన చికిత్స అందిస్తున్నారని మంత్రి తెలిపారు. సినీనటి నయనతార-విఘ్నేష్ శివన్ కవల పిల్లల వ్యవహారంలో బుధవారం సాయంత్రం విచారణ నివేదిక వెల్లడిస్తామని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. అలాగే టీవీ ఛానళ్లలో అద్దె తల్లుల వ్యవహారంపై వెలువడిన కథనాలకు సంబంధించిన విచారణ నివేదిక కూడా విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
Updated Date - 2022-10-26T08:07:46+05:30 IST