వివో రూ.2,217 కోట్ల సుంకం ఎగవేత
ABN, First Publish Date - 2022-08-04T08:06:23+05:30
చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపె నీ వివోకు చెందిన భారత అనుబంధ విభాగమైన వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేసినట్లు...
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపె నీ వివోకు చెందిన భారత అనుబంధ విభాగమైన వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకం ఎగవేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) గుర్తించింది. వివో మొబైల్ ఇండియా మన దేశంలో స్మార్ట్‌ఫోన్లు, వాటి యాక్సెసరీల తయారీ, అసెంబ్లింగ్, టోకు వర్తకం, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలు నిర్వహిస్తోంది. వివో ఇండియాపై దర్యాప్తులో భాగంగా డీఆర్‌ఐ అధికారులు కంపెనీ ఫ్యాక్టరీలో సోదాలు జరిపారని, దిగుమతులకు సంబంధించి కంపెనీ ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపిందనడానికి సోదాల్లో సాక్ష్యాలు లభించాయని ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొం ది. తప్పుడు లెక్కలు చూపడం ద్వారా కంపెనీ రూ.2,217 కోట్ల కస్టమ్స్ సుంకాల ఎగవేతకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఎగవేసిన సుంకాన్ని చెల్లించాల్సిందిగా వివో ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. గతనెలలో వివో ఇండియాకు చెందిన ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు జరిపింది. దేశంలో పన్నులు ఎగవేసేందుకు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో 2017-21 మధ్యకాలంలో రూ.62,476 కోట్ల టర్నోవర్‌ను చైనాలోని మాతృసంస్థకు తరలించిందని ఆ సందర్భంగా ఈడీ తెలిపింది. ఆ కాలానికి కంపెనీ మొత్తం టర్నోవర్ రూ.1,25,185 కోట్లలో ఇది సగానికి సమానం. కంపెనీకి దేశంలో ఉన్న అనుబంధ సంస్థల ద్వారా అక్రమంగా నిధులను చైనాకు దారి మళ్లించిందని దర్యాప్తు ఏజెన్సీ పేర్కొంది. కాగా, దిగుమతులపై సుంకం ఎగవేసిన మరో చైనా కంపెనీ ఒప్పోకు కూడా డీఆర్‌ఐ ఈ మధ్యనే రూ.4,403.88 కోట్ల కస్టమ్స్ సుంకం డిమాండ్ నోటీసు పంపింది.
Updated Date - 2022-08-04T08:06:23+05:30 IST