ఒపెక్ చమురు ఉత్పత్తి మరో లక్ష బ్యారెళ్లు పెంపు
ABN, First Publish Date - 2022-08-04T07:55:30+05:30
రోజువారీ చమురు ఉత్పత్తిని వచ్చే నెలలో మరో 1,00,000 బ్యారెళ్లు పెంచాలని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్), రష్యా సహా ఇతర అనుబంధ దేశాలు...
వియన్నా: రోజువారీ చమురు ఉత్పత్తిని వచ్చే నెలలో మరో 1,00,000 బ్యారెళ్లు పెంచాలని పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య (ఒపెక్), రష్యా సహా ఇతర అనుబంధ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. జూలై, ఆగస్టులో 6.48 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి పెంపుతో పోలిస్తే మాత్రం ఇది చాలా తక్కువే. అంతేకాదు, ప్రపంచ ఇంధన డిమాండ్‌తో పోలిస్తే తాజా పెంపు కేవలం 0.1 శాతంతో సమానం. ఉత్పత్తి పెంపు అంచనాల కంటే తక్కువగా ఉండటంతోపాటు అమెరికాలో చమురు నిల్వలు ఒక్కసారిగా పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఒకదశలో బ్రెంట్ క్రూడ్ 2.90 శాతం తగ్గి 97.60 డాలర్లకు దిగిరాగా.. డబ్యూటీఐ క్రూడాయిల్ రేటు 3.13 శాతం క్షీణించి 91.44 డాలర్ల వద్ద ట్రేడైంది.
Updated Date - 2022-08-04T07:55:30+05:30 IST