ట్విటర్ ఆఫీస్‌లో మస్క్
ABN, First Publish Date - 2022-10-28T03:02:34+05:30
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ కొనుగోలు ను శుక్రవారానికల్లా పూర్తి చేయాల్సి ఉన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్...
సింక్ పట్టుకుని ఆఫీసులోకి ప్రవేశించిన ప్రపంచ కుబేరుడు
‘చీఫ్ ట్విట్’గా తన ప్రొఫైల్ పేరు మార్పు
ట్విటర్ కొనుగోలును పూర్తి చేసేందుకు నేటి వరకు గడువిచ్చిన కోర్టు
శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ కొనుగోలు ను శుక్రవారానికల్లా పూర్తి చేయాల్సి ఉన్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సింక్‌ను చేతబట్టుకొని ఆఫీస్ లాబీలో తిరుగుతున్న వీడియోను ట్విటర్ ద్వారా పంచుకున్నారు. అంతేకాదు, తన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్‌లో హోదాను ‘చీఫ్ ట్విట్’గా మార్చుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారంగా ట్విటర్ కొనుగోలును శుక్రవారాని (ఈ నెల 28) కల్లా పూర్తి చేయాలని అమెరికా కోర్టు మస్క్‌కు గడువిచ్చింది. డీల్ పూర్తయిందని ఇప్పటివరకు మస్క్ గానీ, ట్విటర్ గానీ ప్రకటించలేదు.
ట్విటర్‌లో 100 శాతం వాటాను 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మస్క్.. అగ్రిమెంట్‌లో భాగంగా నకిలీ ఖాతాలపై సమాచారం ఇవ్వని కారణంగా డీల్ రద్దు చేసుకున్నట్లు జూలైలో ప్రకటించారు. దాంతో ట్విటర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
75 శాతం ఉద్యోగాల కోత!?
ట్విటర్‌ను టేకోవర్ చేసుకున్నాక కంపెనీలోని మూడొంతుల మంది ఉద్యోగుల (75 శాతం)కు ఉద్వాసన పలుకుతానని ఈ డీల్‌కు నిధులు సమకూరుస్తున్న ఇన్వెస్టర్లతో మస్క్ తెలిపినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ముందు నుంచీ ట్విటర్ ఉద్యోగులు కూడా ఇదే భయాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే, తీసివేతలుండవని బుధవారం ట్విటర్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించిన సందర్భంగా ఉద్యోగులకు మస్క్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ట్విటర్ ప్రధాన కార్యాలయంలో 7,500 మంది పనిచేస్తున్నారు.
Updated Date - 2022-10-28T06:31:16+05:30 IST