భారత్ దూకుడు!
ABN, First Publish Date - 2022-10-17T09:34:08+05:30
కొన్ని కష్టాలు ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి తిరుగులేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ పేర్కొంది.
ఐదేళ్లలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ
5.36 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి జీడీపీ
సమస్యలున్నా ఆర్థిక పునాదులు పటిష్ఠం: ఐఎంఎఫ్
వాషింగ్టన్: కొన్ని కష్టాలు ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి తిరుగులేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ పేర్కొంది. భారత జీడీపీ వృద్ధి రేటు ఇలానే కొనసాగితే 2028 మార్చి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ జర్మనీ, జపాన్‌లను పక్కకు నెట్టి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా వేసింది. అమెరికా, చైనాలు మాత్రం అప్పటికీ ఒకటి, రెండు స్థానాల్లో ఉంటాయని ‘వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్’ పేరుతో విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.
2027కి జర్మనీని మించి పోతాం:
జీడీపీపరంగా చూస్తే ప్రస్తుతం బ్రిటన్ 3.19 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో ఐదో స్థానంలో, 3.18 లక్షల కోట్ల డాలర్లతో భారత్ ఆరో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికల్లా 3.47 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో భారత ఆర్థిక వ్యవస్థ.. బ్రిటన్‌ను అధిగమించి ఐదో స్థానానికి చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా. 2027 మార్చి నాటికి 4.94 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో జర్మనీని తోసిపుచ్చి నాలుగో స్థానానికి, 2028 మార్చి నాటికి 5.36 లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో జపాన్‌ను అధిగమించి మూడో స్థానానికి భారత్ ఎదుగుతుందని ఐఎంఎఫ్ తెలిపింది.
పునాదులు యమ స్ట్రాంగ్:
కొన్ని సమస్యలున్నా భారత ఆర్థిక పునాదులు ఇంకా పటిష్ఠంగానే ఉన్నట్టు ఐఎంఎఫ్ తెలిపింది. డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనంపై పెద్దగా ఆందోళన చెందాల్సిందేమీ లేదని స్పష్టం చేసింది. మిగతా దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్‌తో రూపాయి పతనం చాలా తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. ధరల సెగ (ద్రవ్యోల్బణం) పెరిగినా.. అది ఇంకా చుక్కలంటే స్థాయిలో లేదని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) ప్రస్తుతం ఎక్కువగా ఉన్నా.. త్వరలోనే అది తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది.
Updated Date - 2022-10-17T09:34:08+05:30 IST