చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల పెంపు
ABN, First Publish Date - 2022-12-31T03:23:56+05:30
చిన్న పొదుపు పథకాల్లో మదుపు చేసే చిన్న మదుపరులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
1.1% వరకు పెంచిన ప్రభుత్వం
పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనపై యథాతథం
న్యూఢిల్లీ: చిన్న పొదుపు పథకాల్లో మదుపు చేసే చిన్న మదుపరులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023 మార్చితో ముగిసే త్రైమాసికానికి ఈ పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లను 1.1 శాతం వరకు పెంచింది. పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (ఎన్‌ఎ్‌ససీ) వంటి చిన్న పొదుపు పథకాలకు ఈ పెంపు వర్తిస్తుంది. అయితే పన్ను ఆదా కోసం అత్యంత ప్రజాదరణ పొందిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన పథకాలపై చెల్లించే వడ్డీ రేట్లను మాత్రం యథాతథంగా 7.1 శాతం వద్ద ఉంచింది.
సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం ఎన్‌ఎ్‌ససీ సర్టిఫికెట్లపై ప్రస్తుతం ఉన్న 6.8 శాతం వడ్డీ రేటు జనవరి 1 నుంచి 7 శాతానికి, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.6 శాతం నుంచి 8 శాతానికి పెరుగుతుంది.
ఏడాది నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉండే పోస్టాఫీసు టర్మ్ డిపాజిట్ పథకంపై చెల్లించే వడ్డీ రేటునీ 1.1 శాతం వరకు పెంచారు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకంపై చెల్లించే వడ్డీనీ 6.7 శాతం నుంచి 7.1 శాతానికి పెంచారు. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ) గడువుని 123 నెలల నుంచి 120 నెలలకు కుదించారు. ఈ పథకంపై చెల్లించే వడ్డీ రేటును 7 నుంచి 7.2 శాతానికి పెంచారు. బ్యాంకు డిపాజిట్లు, రుణ పత్రాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
Updated Date - 2022-12-31T03:23:57+05:30 IST