కార్పొరేట్ ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్స్‌తోనే దిశ!
ABN, First Publish Date - 2022-10-17T09:36:03+05:30
ఈ వారం స్టాక్ మార్కెట్ల గమనాన్ని కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్స్ నిర్దేశించే వీలుంది.
ఈ వారం స్టాక్ మార్కెట్ల గమనాన్ని కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు, గ్లోబల్ ట్రెండ్స్ నిర్దేశించే వీలుంది. ఇదే సమయంలో రూపాయి గమనం, క్రూడాయిల్ ధరలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. గత వారాంతంలో మార్కెట్లు అనూహ్యంగా లాభాల్లో ముగిసినప్పటికీ ఇంకా అనిశ్చిత ధోరణి కనిపిస్తోంది. నిఫ్టీ కీలకమైన 89 రోజుల ఈఎంఏ, 200 రోజుల ఎస్ఎంఏ వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ ట్రెండ్స్ సానుకూలంగా ఉంటే ఈ వారం మార్కెట్లు పాజిటివ్‌గా సాగే వీలుంది. అప్‌ట్రెండ్‌ను సూచిస్తే మాత్రం నిఫ్టీ 17400 పాయింట్ల దిశగా సాగొచ్చు. ఈ వారం లాభాలను కొనసాగిస్తే మాత్రం ప్రీ-దివాలీ ర్యాలీగా భావించవచ్చు. ఒకవేళ ఏదేనీ డౌన్‌ట్రెండ్‌ను కనబరిస్తే మాత్రం 17000 -16800 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. అయితే ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది.
స్టాక్ రికమండేషన్స్
సన్ ఫార్మా: బెంచ్‌మార్క్ ఇండెక్స్ పతనబాటలో సాగుతున్నప్పటికీ ఫార్మా రంగంలోని ఈ షేరు అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. గడచిన నెల రోజుల వ్యవధిలోనే ఈ షేరు 12 శాతానికి పైగా లాభపడింది. ప్రస్తుతం ఈ షేరు ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. టెక్నికల్‌గా చూస్తే ఈ షేరు రానున్న రోజుల్లో మరింత దూకుడుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం రూ.976.30 వద్ద క్లోజైన ఈ షేరును స్వల్పకాలానికి రూ.1,010 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.963 స్థాయిని మాత్రం కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎంఫసిస్:
ఈ ఏడాది ఐటీ విభాగంలో దారుణమైన పనితీరును కనబరిచిన కంపెనీల్లో ఇది ఒకటి. అయితే ఇటీవల కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలకు మించి ఉండటంతో ఒక్కసారిగా ఈ షేరు వెలుగులోకి వచ్చింది. ఈ వారంలో ఈ షేరు మెరుగైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధరపరంగా చూస్తే కీలకమైన మద్దతు జోన్ నుంచి బ్రేకౌట్ సాధించే వీలుంది. గత శుక్రవారం రూ.2,105.70 వద్ద క్లోజైన ఈ షేరు రూ.2,150 స్థాయిని అధిగమించిన తర్వాత దూకుడును ప్రదర్శించవచ్చు. ట్రేడర్లు స్వల్ప కాలానికి రూ.2,250 టార్గెట్ ధరతో ఈ షేరును కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,040 స్థాయిని మాత్రం కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.
-సమీత్ చవాన్, చీఫ్ ఎనలి్‌స్ట,టెక్నికల్,
డెరివేటివ్స్, ఏంజెల్ వన్ లిమిటెడ్
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
Updated Date - 2022-10-17T09:36:03+05:30 IST