YCP Leaders Fight: పెద్దిరెడ్డి సమక్షంలోనే భగ్గుమన్న సమ్మతి
ABN, First Publish Date - 2022-12-16T00:42:36+05:30
వైసీపీ రాయలసీమ ప్రాంతీయ సమన్వయకర్త, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఆయన సమక్షంలోనే ఆ పార్టీ నేతలు పరస్పర ఆరోపణలకు దిగారు.
మడకశిర, హిందూపురంలో వైసీపీ నేతల పరస్పర ఆరోపణలు
ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎంపీ మాధవ్‌పై ఆగ్రహ జ్వాలలు
దిక్కుతోచక మంత్రి బెదిరింపులు
చిల్లర రాజకీయాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
పుట్టపర్తి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వైసీపీ రాయలసీమ ప్రాంతీయ సమన్వయకర్త, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే ఆ పార్టీలో అసమ్మతి భగ్గుమంది. ఆయన సమక్షంలోనే ఆ పార్టీ నేతలు పరస్పర ఆరోపణలకు దిగారు. గురువారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, హిందూపురం నియోజకవర్గాల విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయి. నాయకులు, శ్రేణులు వర్గాలుగా విడిపోయి, పెద్దిరెడ్డికి వేర్వేరుగా స్వాగతం పలికారు. మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామి వ్యతిరేకవర్గం నాయకులు మంత్రి సమక్షంలోనే ‘జగనన్న ముద్దు.. ఎమ్మెల్యే వద్దు’ అని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకరరెడ్డి అసమ్మతి గళం వినిపించారు. ‘ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి.. ఎవరైనా కావచ్చు.. వారు గెలవడానికి కారణమైన నాయకులు, కార్యకర్తలు ఎవరూ బయటకు కనబడని పరిస్థితి పార్టీలో దాపురించింది’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే యువకులను, యోగ్యులను, నిస్వార్థపరులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం వినిపించేందుకు సిద్ధమైన అసమ్మతి నాయకులను బుధవారం పోలీసు స్టేషన్‌కు పిలిపించి బెదిరించడం తెలిసిందే. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో మడకశిరలో వైటీ మినహా మిగిలిన అసమ్మతి నేతలు నోరెత్తలేదు. మరోవైపు.. పెద్దిరెడ్డికి స్వాగతం పలుకుతూ తిప్పేస్వామి వర్గీయులు ఏర్పాటు చేసిన ఫెక్సీలను గురువారం తెల్లవారుజూమున గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. ఇది ఉద్రిక్తతకు దారితీసింది.
మాధవ్.. నీకే దిక్కులేదు!
అటు హిందూపురం సమావేశంలోనూ అసమ్మతి గళాలు వినిపించడంతో పెద్దిరెడ్డికి దిక్కుతోచలేదు. తొలుత ప్రసంగించిన ఎంపీ గోరంట్ల మాధవ్.. ‘ఈసారి హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను గెలిపించుకోవాలి..’ అని పిలుపిచ్చారు. దీనిపై వైసీపీ నాయకుడు, రెడ్డి జేఏసీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్‌రెడ్డి మండిపడ్డారు. పెద్దిరెడ్డి ప్రసంగిస్తుండగా ఆయన అడ్డుతగిలారు. వచ్చే ఎన్నికల్లో ఫలానా వ్యక్తి పోటీ చేస్తారని మాధవ్ ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ‘ఆయనకే ఇక్కడ దిక్కులేదు. ఆయన సీటుకే గ్యారెంటీ లేదు. అలాంటిది ఇక్బాల్‌కు టికెట్ ఇచ్చినట్లు ఎలా ప్రకటన చేస్తారు..’ అని నిలదీశారు. ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి ఆయన్ను పక్కకు తీసుకెళ్లారు. లేపాక్షి వైస్ ఎంపీపీ అంజినరెడ్డి కూడా పెద్దిరెడ్డిని నిలదీశారు. ‘కార్యకర్తల సమస్యలు వినడానికి వచ్చారా? లేక నలుగురి మాటలు విని వెళ్లిపోవడానికి వచ్చారా?’ అని వేదికపైనే అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, పోలీసులు ఆయనకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వారి తీరుపై పెద్దిరెడ్డి విరుచుకుపడ్డారు. చిల్లర రాజకీయాలతో ఇష్యూను క్రియేట్ చేసి.. మీడియాలో మైలేజ్ పొందాలనుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, అంతేతప్ప ఇలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా.. హిందూపురంలో ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్, చౌళూరు రామక్రిష్ణారెడ్డి సోదరి మధుమతి వర్గీయులు పెద్దిరెడ్డికి వేర్వేరుగా స్వాగతం పలికారు. తమ తమ వర్గీయులతో కలిసి సమావేశాలకు వెళ్లారు. మంత్రి ప్రసంగిస్తుండగానే చాలామంది బయటకు వెళ్లిపోయారు. దీంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. పైగా ముఖ్య నాయకులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వడంతో ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Updated Date - 2022-12-16T00:42:37+05:30 IST