వారమన్నారు.. రెండేళ్లయ్యింది!
ABN, First Publish Date - 2022-12-15T00:36:57+05:30
జగనన్న ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూశాఖ భూసేకరణ చేసింది. ఈ భూములకు చెందిన స్థలంలో ఉపాధి హామీ పథకం నిధులతో యుద్ధ ప్రాతిపదికన మట్టి పూడిక పనులు చేపట్టింది.
జగనన్న ఇళ్ల స్థలాల్లో మట్టి పూడ్చివేత
రూ.34 లక్షల కాంట్రాక్ట్‌కు రూ.4 లక్షలు చెల్లింపు
రెండేళ్లయినా బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం
అధికారులకు విన్నవించినా పట్టని వైనం
వీరవాసరం ఎంపీడీవో కార్యాలయం ముందు కాంట్రాక్టరు నిరసన
వీరవాసరం, డిసెంబరు 14 : జగనన్న ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూశాఖ భూసేకరణ చేసింది. ఈ భూములకు చెందిన స్థలంలో ఉపాధి హామీ పథకం నిధులతో యుద్ధ ప్రాతిపదికన మట్టి పూడిక పనులు చేపట్టింది. కొన్ని స్థలాల్లో అధికార పార్టీకి చెందిన ప్రతినిధులే స్థలాల పూడిక చేయగా మరికొన్ని స్థలాల్లో మట్టిరవాణా చేసే కాంట్రాక్టర్లతో పూడిక చేయించారు. పదిరోజుల్లో బిల్లు చెల్లింపులు చేస్తారని బిల్లుల కోసం ఎటువంటి ఆందోళన అవసరం లేదంటూ అధికారులు పనులు పూర్తి చేయించారు. అధికార పార్టీ నేతలకు జగనన్న ఇళ్ల స్థలాల పూడిక బిల్లులు చెల్లింపులు జరిగిపోగా మట్టిరవాణా కాంట్రాక్టర్లలో కొందరికి బిల్లుల చెల్లింపు తీవ్ర జాప్యం జరిగింది. వీరిలో కడలి పద్మరాజు అనే కాంట్రాక్టరు ఒకరు. డిసెంబరు 2020లో పూడిక చేసిన పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. సుమారు రూ.34 లక్షల మట్టిపూడిక పనులు చేస్తే కేవలం రూ.4.16 లక్షలు మాత్రమే చెల్లింపులు చేసినట్టు సమాచారం. దీంతో బుధవారం ఎంపీడీవో కార్యాలయం ముందు కూర్చుని నిరసన వ్యక్తం తెలి పాడు. వీరవాసరం, తోకలపూడి గ్రామాల్లో మూడు ప్రదేశాల్లో జగనన్న స్థలాలను మట్టిపూడిక పనులు చేశారు. రూ.34 లక్షలు పూడిక నిమిత్తం అధికారుల అంచనా వేశారు. ఈ మట్టి పూడిక పనులను నరసాపురం మండలం లక్ష్మణేశ్వరానికి చెందిన కడలి పద్మరాజు చేపట్టి 2020 నాటికే పూర్తిచేశారు. పూడిక చేసిన ప్రదేశాల్లో లేఅవుట్లు చేసి రహదారులను నిర్మించారు. తోకలపూడి స్థలంలో ఇంటి నిర్మాణాలు ప్రారంభం కాగా వీరవాసరం స్థలాలు నేటికీ ఖాళీగానే ఉన్నాయి. మట్టిపూడికకు సుమారు ఎనిమిది కిలోమీటర్లు దూరం నుంచి మట్టిరవాణా చేశారు. కాగా అధికారులు దీనిని ఐదు కిలోమీటర్లు లోపే అంటూ బిల్లులు చేశారు. అయినా కూడా చెల్లింపులు జరగలేదు. సుమారు రూ.25 లక్షలు బిల్లులు గుత్తేదారుకు చెల్లించడంలో అధికారుల జాప్యమే కారణమని సమాచారం. కాగా ఈ బిల్లులు కోసం అమరావతి సీఎప్ఎంఎస్కు వెళ్లాలనే ఉచిత సలహాను ఇస్తున్నారు. ఈ రెండేళ్లలో ముగ్గురు ఎంపీడీవోలు మారారు. తెచ్చిన సొమ్ముకు వడ్డీలు పెరిగి ఆర్థిక పరిస్థితి మారిందని ఆత్మహత్యే శరణ్యమంటూ పద్మరాజు పలుమార్లు అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం లేదు. ‘పద్మరాజు జగనన్న స్థలాల మట్టిపూడిక బిల్లుల చెల్లింపు విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. బుధవారం బాధితుడి సమక్షంలోనే పీడీ దృష్టికి తీసుకెళ్లాం. చెల్లింపునకు చర్యలు తీసుకున్నాం..’ అని ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు.
‘జగనన్న స్థలాల మట్టిపూడిక పనులకు సంబంధించి నాకు బిల్లులు ఎందుకు మంజూరు కాలేదు.. తర్వాత పూడిక పనులు చేసినవారికి బిల్లులు ఎందుకు మంజూర య్యాయి. నాకు నిజం కావాలి. మట్టిపూడిక చేసి రెండేళ్లు అవుతుంది. బిల్లుల చెల్లింపులో నేటికీ అదిగో ఇదిగో అంటున్నారు. సరైన సమాధానం ఇంతవరకూ లేదు. వారం రోజుల్లో బిల్లులు అవుతాయని నాతో పని చేయించారు. అధికారుల వద్ద సరైన లెక్కలు లేవు.. నాకు న్యాయం కావాలి.
– కడలి పద్మరాజు, కాంట్రాక్టర్
Updated Date - 2022-12-15T00:37:01+05:30 IST