ముంచుతున్న సీడ్!
ABN, First Publish Date - 2022-06-05T05:35:55+05:30
కాసులు వర్షం కురిపించే ఆక్వా సాగు నేడు కష్టాల సాగుగా మారింది.
నాణ్యమైన ఆక్వా సీడ్ లభించక రైతులకు నష్టాలు
ప్రభుత్వ పర్యవేక్షణ లేక ప్రైవేటు కంపెనీల ఇష్టారాజ్యం
ఆకివీడు రూరల్ జూన్ 4 : కాసులు వర్షం కురిపించే ఆక్వా సాగు నేడు కష్టాల సాగుగా మారింది. దీనికి ప్రధాన కారణం సీడ్. విపరీతంగా పెరిగి పోయిన ఆక్వా సాగుతో పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన సీడ్ హేచరీస్ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి సీడ్‌ను ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముతున్నాయి. రైతులు చేసేదేమీలేక ఆ సీడ్‌నే కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. సీడ్‌లో నాణ్యత, వ్యాధి నిరోధక శక్తి లేకపోవడంతో వ్యాధుల బారిన పడి ఖర్చు పెరిగి రైతులు నష్టాలు పాలవుతున్నారు. ప్రభుత్వ పరంగా హేచరీస్ లేక రైతులు దోపీడికీ గురవుతున్నారు. ప్రైవేటు హేచరీస్ సూపర్ గ్రోత్, గ్రోత్ లైన్, సుపీరియర్, హాటలైన్, బెంచ్ మార్కు వంటి తదితర పేర్లతో రకరకాల ధరలు పెట్టి దోచు కుంటున్నారు. రకరకాల సైజులను అమ్ముతుండడంతో దిగుబడికి వచ్చేసరికి కౌంట్‌లలో తేడాలు వస్తున్నాయి. కొన్ని సీడ్ కంపెనీలు లక్ష సీడ్‌కు 30 వేలు బోనస్ ఇస్తుండగా, మరికొన్ని కంపెనీలు లక్ష సీడ్ కొంటే 80 వేలు కూడా ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీడ్‌లో వ్యాధి నిరోధక శక్తి లేక పోవడంతో వైట్‌కట్, వైరస్ ధాటికి తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం పర్యవేక్షణ చేసి ప్రైవేటు సీడ్ కంపెనీల దోపిడీ అరికట్టాలని రైతులు కోరుతున్నారు. లేదంటే ప్రభుత్వమే సీడ్ సరఫరా చేస్తే ప్రైవేటు కంపెనీలు దోపిడీ తగ్గుతుందని రైతులు విన్నవిస్తున్నారు.
సిండికేట్‌తో దోపిడీ
సీడ్–ఫీడ్–మెడికల్స్–ఎక్స్‌పోర్టర్స్ సిండికేట్ అయ్యి ఆక్వా రంగాన్ని దోచుకుంటున్నారు. ఒకే కంపెనీ అన్ని విభాగాల్లో వ్యాపారం కలిగి ఉండడంతో దానికి తగ్గట్టు ప్రణాళికలు వేస్తూ రైతులును దోచుకుంటున్నారు. సీడ్ నాణ్యతను గుర్తించేందుకు ఎటువంటి సాధనాలు లేకపోవడం హేచరీస్‌కు మంచి అవ కాశంగా ఉంది. ఆక్వా రైతులు నష్టపోవడానికి సీడ్ ప్రధాన కారణం. ఆక్వా రైతులు నష్టపోతున్నా మత్యశాఖాధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకో వడం లేదు.
– ముద్దే విశ్వేశ్వరరావు, ఆక్వా రైతు, దుంపగడప
ప్రభుత్వమే సీడ్ సరఫరా చేయాలి
ప్రభుత్వమే సీడ్ సరఫరా చేయాలి. ప్రైవేటు ఏజన్సీల ద్వారా లభించే సీడ్‌లో నాణ్యత లేక వ్యాధుల కారణంగా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం సీడ్ కంపెనీలపై పర్యవేక్షణ చేస్తే కంపెనీలు అక్రమాలకు పాల్పడకుండా ఉంటాయి. సీడ్ ధరలు దిగొస్తాయి. కోట్లాది రూపాయలు విదేశీయ మారకద్రవ్యం ఆర్జించే రంగానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే పురోగతి ఉంటుంది.
– శ్రీకృష్ణ, కోళ్ళపర్రు, ఆక్వా రైతు
Updated Date - 2022-06-05T05:35:55+05:30 IST