పదిలో 13..
ABN, First Publish Date - 2022-08-04T05:32:16+05:30
ప్రత్యేక తరగతులతో బోధన అన్నారు. ఫెయిలైన విద్యార్థులందరిపైనా వ్యక్తిగత శ్రద్ధ అన్నారు. రెగ్యులర్ పరీక్షల్లో దిగజారిన ఉత్తీర్ణతను మెరుగు పర్చేందుకు అదనపు చర్యలు అన్నారు
రాష్ట్రంలో అట్టడుగున ఉమ్మడి పశ్చిమ
ప్రత్యేక తరగతులు పెట్టినా నిష్ఫలమే
ఉమ్మడి పశ్చిమలో పరీక్షలకు 18,846 మంది
8,793 మంది ఉత్తీర్ణత.. 46.66 శాతంతో సరి
ఏలూరు ఎడ్యుకేషన్, ఆగస్టు 3 : ప్రత్యేక తరగతులతో బోధన అన్నారు. ఫెయిలైన విద్యార్థులందరిపైనా వ్యక్తిగత శ్రద్ధ అన్నారు. రెగ్యులర్ పరీక్షల్లో దిగజారిన ఉత్తీర్ణతను మెరుగు పర్చేందుకు అదనపు చర్యలు అన్నారు. తీరా చూస్తే తుస్సనిపించారు. బుధవారం విడుదలైన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల సరళిని పరిశీలిస్తే విద్యా శాఖ వైఫల్యమా, లేక మరేదైనా లోపమా.. ఉత్తీర్ణత మరీ ఇంతగా దిగజారడానికి కారణాలు ఏమై ఉంటాయన్న విశ్లేషణలు, మేథో మదనంతోపాటు, భవిష్యత్తులో ఇక ఎలా వ్యవహరించాలో వ్యూహాలు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన టెన్త్ రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిలైన 18,846 మంది బాల బాలికలకు జూలైలో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల్లో ఉమ్మడి జిల్లాకు కేవలం 46.66 శాతం ఉత్తీర్ణత మాత్రమే లభించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో ఉమ్మడి జిల్లాలో 8793 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఉత్తీర్ణతతో ఉమ్మడి జిల్లాకు రాష్ట్రంలో చిట్టచివరిన అంటే 13వ స్థానం లభించింది. రెగ్యులర్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్రంలో 12వ స్థానంతో సాధించిన 57.55 శాతం ఉత్తీర్ణతకంటే సప్లిమెంటరీ ఫలితాల్లో మరింత తగ్గడం గమనార్హం. సప్లిమెంటరీ పరీక్షలకు 10,578 మంది బాలురు హాజరుకాగా 4,369 మంది (41.3 శాతం), 8,268 మంది బాలికలు హాజరు కాగా 4,424 మంది (53.51 శాతం) ఉత్తీర్ణులయ్యారు. రీ కౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500 చొప్పున, రీ వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున సీఎఫ్ఎంఎస్ చలానా ద్వారా చెల్లించి, దరఖాస్తులను ఏలూరులోని డీఈవో కార్యాలయంలో ఈ నెల 10 వ తేదీలోగా అందజేయాలని డీఈవో ఆర్.ఎస్.గంగాభవాని తెలిపారు. పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపే దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. బీఎస్ఈ వెబ్సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. అలాగే మైగ్రేషన్ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సంబంధిత ప్రధానోపాధ్యాయులను సంప్రదించి పొందాలని సూచించారు.
కారణాలివేనా ?
రెగ్యులర్ పరీక్షలతోపాటు, సప్లిమెంటరీ పరీక్షల్లోనూ ఉమ్మడి జిల్లా వైఫల్యానికి పలు కారణాలను చెబుతున్నారు. ఫెయిలైన విద్యార్థుల కోసం నెల రోజులపాటు ఆయా సబ్జెక్టు టీచర్లను వేసవి సెలవుల్లోను పాఠశాలలకు రప్పించి ప్రత్యేక తరగతులు నిర్వహించినా హాజరైన విద్యార్థులు చాలా తక్కువగా ఉండటమే ఉత్తీర్ణత తగ్గడానికి ఓ కారణం కావచ్చునని డీఈవో గంగాభవాని వ్యాఖ్యానించారు. పిల్లలపట్ల తల్లితండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. పరీక్షల్లో కాపీయింగ్‌కు తావు లేకుండా నిర్వహించడం వల్ల వచ్చిన ఈ ఉత్తీర్ణతే నాణ్యతతో కూడిన ఫలితాలకు నిదర్శనమని ఓ అధికారి తన పంఽథాలో విశ్లేషించడం గమనార్హం. ఇక టీచర్ల అభిప్రాయాలు మరోలా ఉన్నాయి. వరుసగా రెండేళ్ళపాటు కొవిడ్ ఉదృతితో పరీక్షలు లేకుండా 8, 9 తరగతులు పాసై నేరుగా పదో తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సిద్దపడ లేకపోయారని, అలాగే పరీక్షల వాతావరణానికి అలవాటు పడకపోవడం ఫెయిల్యూర్‌కు దారి తీసిందని చెబుతున్నారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలో ఓ జాడ్యంలా పరిణమించిన మొబైల్ ఫోన్ల అలవాటు నుంచి విద్యార్థులు ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారనడానికి ఈ ఉత్తీర్ణత ఓ నిదర్శనమని మరికొందరు విశ్లేషించారు. ఈ ఉత్తీర్ణత నేపథ్యంలో ఇప్పటి నుంచే దీర్ఘకాలిక ప్రణాళికతో కార్యాచరణ ఉంటేనే నాణ్యతతో కూడిన మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు.
Updated Date - 2022-08-04T05:32:16+05:30 IST