మెరుగైన దిగుబడులకు..అనువైన రకాలు
ABN, First Publish Date - 2022-06-20T05:19:35+05:30
మెరుగైన దిగుబడులకు..అనువైన రకాలు
సార్వా వరి సాగుకు విత్తనాల ఎంపికపై కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వి.కృష్ణాజీ సూచనలు
ఉండి జూన్ 19: రైతులు సార్వా పంటను పం డించడానికి ఎన్నో వ్యయప్రయాసలకు లోనవుతారు. ఖరీఫ్ సీజన్ వచ్చిందంటే ఏ రకం సాగు చేయాలి..ఏది వేస్తే దిగుబడులు బాగా వస్తాయనే దానిపై రైతులు ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. అందుకోసం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచనలను, సలహాలను తీసుకుని ముందుకు సాగుతారు. అన్నపూర్ణగా ప్రసిద్ధి గాంచిన పశ్చిమ గోదావరి జిల్లాలో వరి ప్రధానమైన పంట. జిల్లాలో సుమారుగా 2.2లక్షల హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులు సార్వా పంట కోసం విత్తనాలు సమకూర్చుకునే పనిలో నిమగ్న మయ్యారు. వారి ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక చేసుకుని సిఫారసు చేసిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని, ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్ర వేత్త(విస్తరణ) డాక్టర్ ఎం.వి.కృష్ణాజీ సూచించారు. సార్వా పంటకు విత్తనాల ఎంపికపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
స్వర్ణ(ఎంటీయూ–7029)– తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చే రకం. చౌడు భూముల్లో సాగుకు, ఎం డాకు తెగులు ఆశించే ప్రాంతాలకు అత్యంత అను కూలం. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే అధిక దిగుబడినిచ్చే రకం. పంటకాలం 150 రోజులు. మూడు వారాలు నిద్రావస్థ కలిగి ఉండి గింజ మొలకెత్తదు.
ఇంద్ర (ఎంటీయూ– 1061)– వరిచేను పడిపోదు. పిలక దశలో 10రోజుల వరకు ముంపును తట్టుకుని అధిక దిగుబడిని ఇస్తుంది. సన్న బియ్యం, మార్కెట్ రేటు ఎక్కువగా ఉంటుంది. పంటకాలం 159 రోజులు. దోమపోటు, కొంత వరకు చౌడును తట్టు కుంటుంది. గింజరాలడం తక్కువ.
అమర (ఎంటీయూ–1064)– పిలక దశలో రెండు వారాల వరకు ముంపును తట్టుకుంటుంది. చేను పడిపోదు. దోమపోటు, ఎండాకు తెగుళ్లను తట్టుకుని ఎకరాకు సగటున 33 బస్తాలు దిగుబడి ఇస్తుంది. పంటకాలం 150 రోజులు.
బాండవ మసూరి(పీఎల్‌ఏ–1100)– నీరునిలువ ఉండే పల్లపు ప్రాంతాలకు, ముంపు ప్రాంతాలకు అత్యంత అనుకూలం. గింజ సన్నగా మసూరి రకాన్ని పోలి ఉంటుంది. పంటకాలం 160 రోజులు. గింజ రాలడం ఎక్కువగా ఉంటుంది. నిద్రావస్థ లేక పోవడం వలన కోత సమయంలో వర్షం వస్తే గింజ మొలకెత్తుతుంది.
భీమ(ఎంటీయూ–1140)– పంటకాలం 145 రోజులు. ఎదిగే దశలో 10 రోజుల వరకు ముంపును తట్టుకుం టుంది. దోమపోటును తట్టుకుంటుంది.
వరం(ఎంటీయూ–1190)– పంటకాలం 140 రోజులు. సన్నగింజ..మిల్లింగ్ శాతం ఎక్కువగా ఉండి పచ్చి బియ్యానికి బాగుంటుంది. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది. అగ్గితెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
క్షీర(ఎంటీయూ–1172)– పంటకాలం 150 రోజులు. ముంపును, కొంత వరకు అగ్గి తెగులు, ఆకు ఎండు తెగుళ్లను తట్టుకుంటుంది.
సుజాత(ఎంటీయూ–1210)– పంటకాలం సార్వాలో 135, దాళ్వాలో 125 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి దోమపోటు, అగ్గితెగులును తట్టుకుం టుంది. కాండం గట్టిగా ఉండి చేను పడిపోదు. గింజ రాలడం తక్కువ. నేరుగా విత్తే విధానానికి అను కూలం.
మార్టేరు సాంబ(ఎంటీయూ–1224)– పంటకాలం 135 రోజులు. దోమపోటును తట్టుకుంటుంది. సన్న బియ్యం..పారదర్శకంగా ఉండి అన్నానికి బాగుం టుంది.
శ్రావణి(ఎంటీయూ–1239)– పంటకాలం 140 రోజులు. రెండు వారాల నిద్రావస్థ కలిగి ఉండి దోమ పోటును తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి వరి చేను పడిపోదు.
సాంబమసూరి(బీపీటీ–5204)– పంటకాలం 145–150 రోజులు. సన్న బియ్యం.. అన్నానికి చాలా బాగుం టుంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న రకం. మార్కెట్‌లో ధర ఎక్కువ పలుకుతుంది.
Updated Date - 2022-06-20T05:19:35+05:30 IST