చరిత్ర చెక్కిన శిల్పం.. భీమవరం
ABN, First Publish Date - 2022-04-04T06:09:20+05:30
భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా కొత్తగా ఏర్పాటు చేయడంతో ఖ్యాతి మరింత పదిలపరుచుకున్నది.
వేల సంవత్సరాల చరిత్ర సొంతం
తూర్పు చాళుక్యుల కాలంలోనే గుర్తింపు
బ్రిటీష్ హయాంలో సబ్ కలెక్టర్ కేంద్రంగా.. తాలూకా హెడ్‌క్వార్టర్‌గా..
స్వాతంత్రోద్యమంలో రెండో బార్డోలిగా మహాత్ముడిచే ప్రశంసలు
అంతర్జాతీయ స్థాయిలో ఆక్వా హబ్
భీమవరం, ఏప్రిల్ 3 : భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా కొత్తగా ఏర్పాటు చేయడంతో ఖ్యాతి మరింత పదిలపరుచుకున్నది. 7–9వ శతాబ్దంలో పెదవేగిని పాలించిన తూర్పు చాళుక్యుల కాలంలోనే గునుపూడి ప్రాంతం గుర్తింపు పొందింది. క్రీ.శ.912లో వేంగీ రెండో చాళుక్య భీముడు పాలించినప్పుడు పంచారామ క్షేత్ర ఆలయ అభివృద్ధి, భీమేశ్వరాలయం నిర్మించారు. కొంతకాలం మృత్యుంజయనగర్‌గా పిలిచేవారు. ఆ తర్వాత చాళుక్య భీమవరంగా స్థిరపడింది. బ్రిటీష్ కాలంలో 1832 నుంచి తాలూకా హెడ్‌క్వార్టర్‌గా ఉండేది. స్వాతంత్య్రం వచ్చే వరకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఉండేది. స్వాతంత్రోద్యమంలో 1922–28 మధ్య పన్నుల సహాయ నిరాకరణ విజయవంతం కావడంతో రెండో బార్డోలిగా మహాత్ముడిచే ప్రశంసలు పొందిన పట్టణమిది. మూడు దశాబ్దాలుగా విద్యా కేంద్రంగా పేరు పొందింది. 1980 దశకంలో పునాదులు పడి.. చేప, ఆపై రొయ్యల సాగు విస్తరించి నేడు ఆక్వా హబ్‌గా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 1912లో గునుపూడి, భీమవరం విలీనం చేసి భీమవరం పంచాయతీగా మార్చారు. 1948లో మునిసిపాలిటీగా రూపుదిద్దుకుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా మావుళ్ళమ్మ ఆలయం ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే తొలి మల్టీఫ్లెక్స్ ఇక్కడే నిర్మించారు. వచ్చే నెల మూడో వారం నుంచి విద్యుత్ రైళ్లు నడవనున్నాయి. రేపో మాపో కార్పొరేషన్‌గా మారే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 1.87 లక్షలు.
జిల్లా విభజన సాగిందిలా..
ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రఖ్యాతి పొంది.. సస్య శ్యామలమైన పశ్చిమ గోదావరి జిల్లా మూడు ముక్కలైంది.. చరిత్రలోకి వెళితే ఈ జిల్లా ఆరోసారి విభజనతో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. 1852–59 మధ్య ధవళేశ్వరం బ్యారేజీ పనులు పూర్తయ్యాక గోదావరి జిల్లాల రూపురేఖలు మారిపోయాయి. బ్రిటీష్ వారి కాలంలో గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది.
1794లో కాకినాడ, రాజమండ్రిలకు వేర్వేరుగా కలెక్టర్లను నియమించారు. అప్పుడు మన జిల్లా వారి పరిధిలోకి వెళ్లింది. బ్రిటీష్ వారు జిల్లా పాలన సౌలభ్యం కోసం 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు.
1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుంచి కృష్ణా జిల్లాలోకి చేర్చారు.
1925లో కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పటి వరకూ ఉమ్మడి గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మార్చారు.
1925 ఏప్రిల్ 15న పశ్చిమ గోదావరి జిల్లా ఆవిర్భావం జరిగింది. ఈ జిల్లాకు కేంద్రంగా ఏలూరు ఏర్పడింది. ఇక్కడే అన్ని జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుంచి పశ్చిమ గోదావరికి మారుస్తూ మళ్లీ సవరణ జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014లో విభజించినపుడు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పశ్చిమలో విలీనం చేశారు. అలా 76 ఏళ్ల తరువాత జిల్లా భౌగోళిక రూపు కొద్దిగా మారింది. మళ్లీ ఎనిమిదేళ్ల తరువాత ఈ 2022లో జిల్లాల విభజన కారణంగా మూడు ముక్కలైంది.
Updated Date - 2022-04-04T06:09:20+05:30 IST