డీఎస్సీ– 98 అభ్యర్థుల ఆందోళన
ABN, First Publish Date - 2022-08-01T05:48:10+05:30
1998–డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
నూజివీడు, జూలై 31 : ‘మీ పుట్టిన తేదీ నాట్ వ్యాలిడ్, అని మీ హాల్‌టిక్కెట్ నంబర్ నాట్ వ్యాలిడ్ అని ఎట్టకేలకు ఆన్‌లైన్‌లో కలిసినా ఏజ్ నాట్ వ్యాలిడ్ అని, పుట్టిన తేదీ నాట్ వ్యాలిడ్’ అని వస్తుండడంతో 1998–డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. డీఎస్సీ –98 అర్హత గల అభ్యర్థులు టీచర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలంటూ తమ ఆసక్తిని జూలై 26 నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పాఠశాలల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత విషయాల నమోదుకు సంబంఽ దించి వయస్సు, అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలు, కటాఫ్‌లను ఆన్‌లైన్‌లో స్పష్టంగా పేర్కొనకపోవడంతో గతంలో క్వాలిఫై అయిన అభ్యర్థులు దరఖాస్తులు దాఖలు చేయడంలో అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై సరైన వివరణ తెలుసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నా స్పష్టత ఇచ్చే అధికారులు లేకపోవడం, దరఖాస్తుకు ఒకటో తేదీని చివరిగా పేర్కొనడంతో పాటు అభ్యర్థులు సైట్ ద్వారానే దరఖాస్తులు చేయాలని డీఈవో వద్దకు వెళ్లరాదని పేర్కొనడంతో ఆందోళన నెలకొంది. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచింది. సర్వీస్ ముగింపునకు దగ్గర వయస్సు వచ్చిన వారికి కూడా ఉపాధ్యాయుల నియామకాల్లో ఆశలు చిగురించాయి. అయితే దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌లో ఇబ్బందులు తలెత్తడంతో ఆందోళన చెందుతున్నారు. సైట్‌లో లోపాలు ఉంటే సరిచేసి దరఖాస్తు గడువును పెంచాలని కోరుతున్నారు.
హెల్ప్‌లైన్ నంబర్లు స్విచ్‌ఆఫ్..
95056 19127, 97056 55349, 94944 87347 అని మూడు హెల్ప్‌లైన్ నంబర్లు ఇచ్చారు. ఇవి సాయంత్రం ఐదు గంటల వరకు బిజీబిజీ అని, ఆ తరువాత స్విచ్‌ఆఫ్ అని సమాధానం ఇస్తుండడంతో ప్రభుత్వం అవకాశమిచ్చినా, విద్యాశాఖ అధికారులు కరుణించడంలేదనే భావన అభ్యర్థుల్లో నెలకొంది.
Updated Date - 2022-08-01T05:48:10+05:30 IST