పనిఒత్తిడి..ప్రాణాలు తీస్తోంది!
ABN, First Publish Date - 2022-12-16T23:58:06+05:30
రెవెన్యూ శాఖలో ఎంతో కీలకంగా వ్యవహరించే వీఆర్వోలు పనిఒత్తిడితో సతమతమవుతున్నారు. ఊపిరిసలపని విధులతో కొందరు అనారోగ్య సమస్యలకు గురువుతుంటే.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
సర్కారు లక్ష్యాలు చేరుకోలేక.. అధికారులకు సమాధానం చెప్పుకోలేక
ఉసురు తీసుకుంటున్న వైనం
ఇంకొందరు అనారోగ్య సమస్యలతో సతమతం
ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందిస్తున్నా స్పందన నిల్
(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)
రెవెన్యూ శాఖలో ఎంతో కీలకంగా వ్యవహరించే వీఆర్వోలు పనిఒత్తిడితో సతమతమవుతున్నారు. ఊపిరిసలపని విధులతో కొందరు అనారోగ్య సమస్యలకు గురువుతుంటే.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం విధించిన లక్ష్యాల మేరకు క్షేత్రస్థాయిలో పనులను పూర్తి చేయలేక... ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. కాగా ఇటీవల కాలంలో వరుసగా ఉమ్మడి జిల్లాలో వీఆర్వోలు మృతి చెందుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు విధులు చేపట్టడం ఎలా? అని ఉద్యోగ సంఘాల నాయకులు మథనపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో వీర్వోలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని ఆదేశాలు జారీ చేయడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 333 మంది వీఆర్వోలు పని చేస్తున్నారు. వారంతా ప్రస్తుతం 66 విధులు నిర్వర్తిస్తున్నారు. రెవెన్యూ శాఖపరమైన విధుల్లో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు భూ రీ సర్వేతో పాటు వివిధ సర్వేల నిర్వహణ, వాటికి సంబంధించిన ఫొటోలు యాప్‌ల్లో అప్‌లోడ్ చేయడం వంటివి చేస్తున్నారు. ఇంకోవైపు ఓటరు నమోదు, ఎన్నికల విధులు నిర్వర్తిస్తూనే.. అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామ పర్యటనలోనూ ఉండాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో భూ సర్వే తదితర విషయాల్లో వైసీపీ సర్కారు విధిస్తున్న లక్ష్యాలతో వారంతా పని ఒత్తిడికి గురవుతున్నారు. చాలామంది ఈ విషయాన్ని బయటికి చెప్పుకోలేక లోలోపన సతమతమవుతున్నారు. ఇటీవల కాలంలో ముగ్గురు మృతి చెందగా, ఈ నెల 14న మామిడిపల్లి వీఆర్‌వో శంబంగి సంతోష్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నారంటే వారిపై పనిఒత్తిడి ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరిస్థితి లేదని కొంతమంది వీఆర్‌వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతుండగా, వీఆర్‌వోలతో పాటు విలేజ్ సర్వేయర్ల హాజరు నమోదుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఇటీవల ప్రభుత్వ నుంచి ఆదేశాలు రావడం మరింత ఆందోళన చెందుతున్నారు.
నెల రోజులుగా వినతులు
పనిఒత్తిడి వల్ల అనారోగ్యాలకు గురవుతున్నామని తక్షణమే తగ్గించాలని సుమారు నెల రోజులుగా వీఆర్వోలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులకు సంఘ నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రాలు ఇస్తున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. రోజురోజుకూ పనిఒత్తిడి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదని అనేకమంది వీఆర్‌వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
విధులు ఇవీ..
పంటల నమోదు కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులు సంయుక్తంగా సర్వే చేపడుతుండగా వీఆర్‌వోలు మరోసారి ప్రత్యేకంగా సర్వే నిర్వహించాల్సి వస్తోంది.
వ్యవసాయ గణన చేపట్టాల్సిన పరిస్థితి ఉంది.
ఎన్నికల విధుల్లో భాగంగా ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం, ఓటరు నమోదు, తొలగింపుతో పాటు ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
భూములు రీ సర్వేలో భాగంగా ఉన్నతాధికారులు లక్ష్యాలను విధిస్తుండడంతో రాత్రి, పగలు అని తేడా లేకుండా వీఆర్‌వోలతో పాటు గ్రామ సర్వేయర్లు కూడా ఆయా పనుల్లో నిమగ్నమవ్వాల్సి వస్తోంది. ఉదయం 7 గంటలకు భూసర్వే కార్యక్రమంలో సర్వేయర్లతో పాటు వీఆర్‌వోలు తప్పనిసరిగా హాజరైన తరువాత ఫొటోను యాప్‌లోకి అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అనంతరం పదో గంటలకు గ్రామ సచివాలయానికి వెళ్లి హాజరు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా మధ్యాహ్నం 3 , సాయంత్రం 5 గంటలకు కూడా సచివాలయం వద్ద హాజరు నమోదు తప్పనిసరి.
గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరులో భాగంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని వీఆర్వోలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదికలు అందించాల్సి ఉంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కస్టోడియన్ అధికారులుగా ఉండడంతో పాటు ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ. ఆక్రమణల తొలగింపు, చెరువు గర్భాలను కాపాడడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అగ్ని ప్రమాదాలు, తుపాన్లు తదితర విపత్తుల సమయాల్లో అవసరమైన సేవలు అందించాల్సి ఉంది.
పట్టణాలు, గ్రామాల్లో ఎవరైనా ఆత్మహత్యలకు పాల్పడితే దానికి సంబంధించిన కేసుల విచారణ సమయంలో సాక్ష్యాల కోసం కోర్టులకు హాజరు కావలసి ఉంది.
తహసీల్దార్ స్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధుల గ్రామ పర్యాటనల్లో వీఆర్వోలు తప్పనిసరిగా హాజరుకావలసి ఉంది.
వైసీపీ సర్కారు చేపడుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో రెవెన్యూ శాఖ పరంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి జవాబుదారుగా వ్యవహరించాల్సి వస్తోంది.
ఇటీవల మృతి చెందిన వారు..
కురుపాం మండలం ఊసకొండ వీఆర్‌వో డి.సీతారాం గుండెపోటుతో మృతి చెందారు.
గత నెల 28న జియ్యమ్మవలస మండలం పెదతోలుమండ వీఆర్‌వో కె.అనంత్ గుండెపోటుతో మృతి చెందారు.
ఈ నెల 14న విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రాగివలస వీఆర్‌వో మృతి చెందారు.
ఇటీవల సాలూరు మండలం మామిడిపల్లి వీఆర్‌వో శంబంగి సంతోష్‌కుమార్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. దీనికి కారణం పని ఒత్తిడేనని తోటి ఉద్యోగులు భావిస్తున్నారు.
పని ఒత్తిడి తగ్గించాలి
మాకున్న సమాచారం మేరకు మామిడిపల్లి వీఆర్‌వో పని ఒత్తిడి వల్ల మృతి చెందారని తెలిసింది. జిల్లాలో ఇంకెంతోమంది పనిఒత్తిడి కారణంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. మృతి చెందిన వీఆర్‌వోల కుటుంబాలకు రూ. 25 లక్షలు చొప్పున అందించాలి. పని ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
- ఎం.సింహాచలం, అధ్యక్షుడు, జిల్లా వీఆర్‌వోల సంఘం, పార్వతీపురం
ప్రభుత్వం ఆదుకోవాలి
మృతి చెందిన వీఆర్‌వోల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఇకపై సాయంత్రం ఐదు గంటల వరకే విధులు నిర్వహిస్తామని అధికారులకు వినతిపత్రాలు అందించాం.
- పురుషోత్తంనాయుడు, అధ్యక్షుడు, పార్వతీపురం రెవెన్యూ డివిజన్ వీఆర్‌వోల సంఘం
Updated Date - 2022-12-16T23:58:07+05:30 IST