వీఆర్వో ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-12-15T00:23:20+05:30
జిల్లాలో ఓ వీర్వో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
సాలూరు రూరల్, డిసెంబరు 14 : జిల్లాలో ఓ వీర్వో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. పని ఒత్తిడే కారణమని తోటి ఉద్యోగులు చెబుతుండగా, ‘మన్యం’లో తొలిసారి ఇటువంటి ఘటన జరగడం ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. మక్కువ మండలం బుచ్చింపేట గ్రామానికి చెందిన శంబంగి సంతోష్‌కుమార్ (30) తొమ్మిదేళ్లుగా వీఆర్వోగా పనిచేస్తున్నారు. తొలుత విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామంలో ఐదేళ్లు విధులు నిర్వహించారు. ఆ తర్వాత సాలూరు మండలం మామిడిపల్లికి వీఆర్వోగా బదిలీపై వచ్చారు. ఇక్కడ నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. సాలూరులోనే కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో భూముల రీ సర్వే, మ్యూటేషన్లపై సర్కారు లక్ష్యాలు విధించగా ఆయా పనుల ఒత్తిడితో తీవ్రంగా సతమతమవుతున్నారు. సకాలంలో పనులు పూర్తికాకపోవడం, ఉన్నతాధికారులకు సమాధానం చెప్పలేకపోవడంతో ఒత్తిడికి గురయ్యారు. ‘ఇదేం ఉద్యోగం’ అని తోటి ఉద్యోగులతో ఓ సారి అన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో విధుల్లో భాగంగా బుధవారం మామిడిపల్లికి వెళ్లిన ఆయన సాలూరు మండలం అంటివలస రహదారిలో ఓ మామిడితోటలో చెట్టుకు ఉరేసుకున్నారు. ఒంటిపై ధరించిన టీషర్టునే ఉరితాడుగా మలచుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో స్వగ్రామంతో పాటు సాలూరు, మామిడిపల్లివాసులు, తోటి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఇక తమకు దిక్కెవరు అంటూ రోదిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇందులో ఒక కుమార్తెకు రోజుల వయసు. ఆయనపై ఆధారపడే తల్లి కూడా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాలూరు రూరల్ ఎస్‌ఐ కె.ప్రయోగమూర్తి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో శవ పంచనామా జరిపి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాలూరు ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని తోటి ఉద్యోగులు కోరుతున్నారు.
Updated Date - 2022-12-15T00:23:21+05:30 IST