ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంకెన్నాళ్లిలా?

ABN, First Publish Date - 2022-08-08T05:24:03+05:30

ప్రభుత్వాలు మారుతున్నాయి.. ప్రజాప్రతినిధులు మారుతున్నారు.. కానీ దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. వారి బతుకుల్లో మార్పు కనిపించడం లేదు.

ఆదివాసీ దినోత్సవానికి సిద్ధమవుతున్న సీతంపేట ఐటీడీఏ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మారని గిరిజన బతుకులు
   సమకూరని మౌలిక వసతులు
 అందని ద్రాక్షగా విద్య, వైద్యం
  రవాణాకు దూరంగా కొండ శిఖర గ్రామాలు
  అత్యవసర  సమయాల్లో డోలీయే శరణ్యం
  రేపు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి/సీతంపేట)


ప్రభుత్వాలు మారుతున్నాయి.. ప్రజాప్రతినిధులు మారుతున్నారు.. కానీ దశాబ్దాలు గడుస్తున్నా గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. వారి బతుకుల్లో మార్పు కనిపించడం లేదు.  గిరిజన గ్రామాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చుపెడుతున్నట్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. కనీస మౌలిక వసతులు సమకూరడం లేదు. విద్య, వైద్య సేవలు మెరుగుపడడం లేదు. నేటికీ వందలాది కొండ శిఖర గ్రామాలకు కనీస రహదారి సదుపాయం కూడా లేదు. అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర లభించడం లేదు. జీసీసీ సేవలు వారికి అక్కరకు రావడం లేదు. పాలకుల మాటలు స్వాంతన చేకూర్చడం లేదు. ఫలితంగా గిరిజనులకు ఇక్కట్లు తప్పడం లేదు.  రేపు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
ఇదీ పరిస్థితి..
జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం కాగా.. సాలూరు, కురుపాం, పాలకొండ ఎస్టీ నియోజకవర్గాలు. పునర్విభజనతో ప్రస్తుతం పార్వతీపురం ఐటీడీఏతో పాటు సీతంపేట ఐటీడీఏ జిల్లాలోనే కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2,60,419 మంది గిరిజనులు ఉన్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 1,87,829 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో  35,182 మంది గిరిజనులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా మైదాన ప్రాంతాల్లో 37,408 మంది గిరిజనులు ఉన్నారు. వీరిలో జీతాపు, కొండదొర, సవర, గదబ, ఎరుకుల, మోకుదొర, మన్నెదొర, ఎంటిక హండ్స్‌, బగత, తదితర తెగలకు చెందిన ఆదివాసీలు ఉన్నారు. జిల్లాలోని మొత్తంగా 956  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని 12 మండలాల్లో 845 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. జిల్లాలోని 15 మండలాల్లో 451 పంచాయతీలు ఉండగా పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 367 పంచాయతీలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజనులకు కొత్తగా పథకాలు ప్రారం భించలేదు. ఉన్న పథకాలను నిర్వీర్యం చేశారు. అన్నీ నవరత్నాలతో సరిపెడుతున్నారు.  
దళారుల దోపిడీ..
గిరిజనులకు పోడు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఏడాది పొడవునా లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులను విక్రయించి ఉపాధి పొందుతుంటారు. చింతపండు, కొండచీపుళ్లు, సీతాఫలాలు, పనస, మామిడి పండ్లు సేకరిస్తుంటారు. కందులు, మినుములు, పెసలు, ఉలవలు, బొబ్బర్లు, అలసందర్లు, అనువులు,  జినుగులు, రాగులు, కొర్రలు, గంటెలు, ఆరెకలు, జొన్నలు ఇలా వివిధ రాకాల చిరు ధాన్యాలు, చిక్కుడు జాతి పంటలను సాగుచేస్తుంటారు. వాగులు, వంకల పరిధిలో వరి, మొక్కజొన్నను పండిస్తుంటారు. వీటిలో చింతపండుకే కాస్తోకుస్తో గిట్టుబాటయ్యేది. జీసీసీ ద్వారా కొనుగోళ్లు జరిగేది. మిగతా పంటలకు గిట్టుబాటు అంతంతమాత్రమే. దీంతో గిరిజనులే వ్యయప్రయాసలకు గురై మైదాన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. అటవీ, గిరిజన ఉత్పత్తులకు ఆశించిన స్థాయిలో మార్కెటింగ్‌, రవాణా సదుపాయాలు లేవు. గిట్టుబాటు ధర కూడా అంతంతమాత్రమే.  ఇప్పటికీ గిరిజనులు అటవీ ఉత్పత్తులను విక్రయించేందుకు మైదాన ప్రాంతాలకు, పట్టణాలకు వెళ్తున్నారు. జీసీసీ డిపోల పనితీరు మెరుగ్గా లేకపోవడంతో దళారులు, వ్యాపారులు రంగప్రవేశం చేసి గిరిజనులను దోచుకుంటున్నారు. జీసీసీ ప్రకటించిన మద్దతు ధర కంటే నేరుగా విక్రయాల ద్వారానే గిట్టుబాటవుతుం దని గిరిజనులు  చెబుతున్నారు. ఇదిలా ఉండగా గిరిజన ప్రాంతాల్లో జీడి రైతులు మూడేళ్లుగా ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే ఏటా  తెగుళ్ల కారణంగా పంటను నష్టపోతున్న వారికి ప్రభుత్వం పరిహారం, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ వర్తింపజేయడం లేదు. సబ్‌ ప్లాన్‌ మండలాల్లో జీడి ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పితే గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. చింతపండుకు సంబంధించి అధునాతన ప్రాసెసింగ్‌ యూనిట్లు పెడితే మేలు జరుగుతుంది.
 డోలీయే దిక్కు..
ఐటీడీఏ పరిధిలో 1,122 గిరిజన గ్రామాలకుగాను కేవలం 511 గ్రామాలకే పక్కా రహదారులున్నాయి. 168 గ్రామాలకు డబ్ల్యూబీఎం రహదారులు, 162 గ్రామాలకు గ్రావెల్‌ రోడ్లు ఉన్నాయి. 179 కొండ శిఖర గ్రామాలకు రహదారులు నిర్మించాలని ప్రతిపాదనలు పంపినా అతీగతీలేదు. అయితే కొన్ని గ్రామాల రహదారుల విషయంలో అటవీ శాఖ కొర్రీలు పెడుతోంది.  దీంతో ఇప్పటికీ చాలా గ్రామాలకు రహదారి సదుపాయం లేదు. కొండ శిఖర గ్రామాలకు మరీ దారుణం. రాళ్లు రప్పలతో కూడిన కాలి నడక మార్గమే శరణ్యం. దీంతో అత్యవసర సమయంలో వారు పడే బాధలు వర్ణనాతీతం. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోగులు, గర్భిణులను అతి కష్టమ్మీద డోలిలోనే తరలిస్తున్నారు.  రహదారి లేని గ్రామాల కోసం ఫీడర్‌ అంబులెన్సులు ఏర్పాటు చేశారే తప్ప పక్కా రహదారుల నిర్మాణం చేపట్టలేని పరిస్థితి జిల్లాలో ఉంది. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల్లో కూడా ఆశించిన పురోగతి లేదు. వ్యాధులు, జ్వరాలతో ఏటా పదుల సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడుతున్నా పటిష్ట చర్యలు చేపట్టడం లేదు. మాతా శిశు మరణాల నియంత్రణకు సాలూరు, భద్రగిరి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గర్భిణుల వసతి గృహాల నిర్వహణకు నిధుల లేమి వెంటాడుతోంది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఎదురైంది. సిబ్బందికి ఉద్యోగభద్రత కరువైంది.  నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్‌గా మార్చాలని దశాబ్దాలుగా కోరుతూ వస్తున్నా ప్రభుత్వాల నుంచి స్పందన లేదు.
అక్షరాస్యత గణాంకాలకే ...
ఐటీడీఏల పరిధిలో 48 శాతం మేర అక్షరాస్యత ఉన్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ .. అదంతా రికార్డులకే పరిమితమని చెప్పొచ్చు. గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో క్షేత్రస్థాయిలో నెలకొన్న లోపాలే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. విద్యార్థులు లేరనే సాకుతో సీతంపేట ఐటీడీఏ పరిధిలో 65 జీపీఎస్‌ పాఠశాలలను మూసివేశారు.  గిరిజన ప్రాంతాల్లో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేస్తామని పాలకులు హామీ ఇచ్చినా నేటికీ నెరవేరలేదు. దీంతో పై తరగతి చదువుకోడానికి వీలులేక గిరిజన విద్యార్థులు డ్రాపౌట్లుగా మిగిలిపోతున్నారు.
 ఐదో షెడ్యూల్డ్‌ ఊసే లేదు...
పాలకొండ నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సుమారు 387 గ్రామాలను ఐదో షెడ్యూల్డ్‌లో చేర్చాలని గత రెండు దశాబ్దాలుగా గిరిజనులు పోరాటాలు చేస్తున్నా.. ఫలితం శూన్యం.  దీనిపై గిరిజన సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా గిరిజనులు సాగు చేస్తున్న ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూములకు సంబంధించి ప్రతిఒక్క కుటుంబానికి పది ఎకరాల వరకు పట్టాలు అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రెండు ఎకరాలకు మాత్రమే  పరిమితం చేయడంపై ఆదివాసీలు మండిపడుతున్నారు.  గత మూడేళ్లుగా ట్రైకార్‌ పథకం కింద  రాయితీపై ఎటువంటి యూనిట్లు మంజూరు చేయడం లేదు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులకు నిరాశ తప్పడం లేదు. సీసీడీపీ పథకం కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో గిరిజన ప్రాంతాల్లో  ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఐఏపీ కింద మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో రహదారి సౌకర్యం కల్పించడం లేదు. గిరిజన యువతకు ఉపాధి, జాబ్‌మేళా వంటివి కూడా నిలిచిపోయాయి.   గిరిజనుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించినప్పుడే నిజమైన ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట ఉపాధ్యక్షుడు వాబ యోగి, జిల్లా గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండంగి లక్ష్మణరావు, జిల్లా సహాయ కార్యదర్శి కొండగొర్రె భాస్కరరావు స్పష్టం చేశారు.
 ఆదివాసీ దినోత్సవానికి సన్నద్ధం
జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ  కేంద్రంగా ఈనెల 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేడుకల్లో భాగంగా ఐటీడీఏ కార్యాలయంలో ఉన్న అడవి తల్లి విగ్రహానికి పూజలు, వివిధ శాఖల స్టాల్స్‌ ప్రదర్శన, ఽథింసా నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వాస్తవంగా గత రెండేళ్లలో కరోనా కారణంగా ఆదివాసీ దినోత్సవాన్ని సక్రమంగా నిర్వహించలేదు. అయితే జిల్లా విభజన తర్వాత తొలిసారిగా వేడుకలు చేపడుతుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

 

Updated Date - 2022-08-08T05:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising