అదే కర్కశం!
ABN, First Publish Date - 2022-10-08T05:11:19+05:30
విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఘటన మరువక ముందే.. వైసీపీ ప్రభుత్వం మరో దుశ్చర్యకు పూనుకుంది. విజయనగరంలోని మహారాజ జిల్లా కేంద్రాస్పత్రిని పేరు మార్చేసింది. రాత్రికి రాత్రే మహారాజ పేరు తొలగించి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా నామకరణం చేసింది. ఈ ఆస్పత్రికి సుదీర్ఘ చరిత్ర ఉంది. నాలుగు దశాబ్దాల కిందట పూసపాటి
మహారాజ కేంద్ర ఆస్పత్రి పేరు మార్పు
అశోక్ గజపతిరాజును టార్గెట్ చేసుకుంటూ నిర్ణయం
రాత్రికి.. రాత్రే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా నామకరణం
జిల్లావాసుల అభ్యంతరం.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
భగ్గుమన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు
పేరు కొనసాగించే వరకూ పోరాటానికి నిర్ణయం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
విజయనగరం రాజవంశీయులపై వైసీపీ ప్రభుత్వం మరోసారి తన కర్కశాన్ని చాటుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు లక్ష్యంగా కొన్ని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పదవుల నుంచి తొలగించి.. నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే సంచయిత గజపతిరాజును తెరపైకి తెచ్చింది. దీనిపై అన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు కోర్టు జోక్యం చేసుకొని ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. దీంతో అశోక్‌గజతిరాజు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం సాహసించని విధంగా వైసీపీ సర్కారు మహారాజ కేంద్రాస్పత్రి పేరును మార్చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఘటన మరువక ముందే.. వైసీపీ ప్రభుత్వం మరో దుశ్చర్యకు పూనుకుంది. విజయనగరంలోని మహారాజ జిల్లా కేంద్రాస్పత్రిని పేరు మార్చేసింది. రాత్రికి రాత్రే మహారాజ పేరు తొలగించి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా నామకరణం చేసింది. ఈ ఆస్పత్రికి సుదీర్ఘ చరిత్ర ఉంది. నాలుగు దశాబ్దాల కిందట పూసపాటి రాజవంశీయులు జిల్లా కేంద్రాస్పత్రి కోసం 17 ఎకరాల భూమిని కేటాయించారు. అప్పటి నుంచి మహారాజ ఆస్పత్రిగానే జిల్లా ప్రజలకు సుపరిచితమైంది. ఒక్క జిల్లా కేంద్రాస్పత్రిగానే కాకుండా... ప్రాంగణంలో బోధనాసుపత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, డీసీహెచ్ఎస్ కార్యాలయం, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఇంజినీరింగ్ విభాగం, క్షయ వ్యాధి నివారణ కార్యాలయం, వాక్సినేషన్లు భద్రపరిచే భవనం, ఆయుర్వేద ఆసుపత్రి ఇలా అనేక కీలక శాఖలు, విభాగాలు నడుస్తున్నాయి.
నాలుగు దశాబ్దాల కిందట..
తొలుత జిల్లా కేంద్రాస్పత్రి తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఉండేది. ఇరుకు గదుల్లో కొనసాగుతుండడంతో రోగులు, అటు ఆస్పత్రి సిబ్బంది సైతం అసౌకర్యానికి గురయ్యారు. ఈ విషయం పూసపాటి రాజవంశీయుల దృష్టికి వచ్చింది. దీంతో వారు స్పందించి 1983లో 17 ఎకరాల స్థలాన్ని భూరి విరాళంగా ప్రకటించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వం భవన నిర్మాణాలకు నిధులను మంజూరు చేసింది. అప్పటి నుంచి ఆస్పత్రి అభివృద్ధి చెందుతూ వచ్చింది. వైద్యా విధాన పరిషత్ పరిధిలోకి వచ్చినా.. మహారాజ పేరుతోనే కొనసాగింది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. ఆస్పత్రి విషయంలో ఉదారంగా వ్యవహరిస్తూ వచ్చారు. అందుకే ఒక్క జిల్లా కేంద్రాస్పత్రిగానే కాకుండా... వైద్య ఆరోగ్యానికి సంబంధించి అన్ని కార్యాలయాలు.. ఆస్పత్రి ప్రాంగణంలోకి వచ్చాయి. ప్రజలకు వైద్య ఆరోగ్యసేవలు మెరుగ్గా అందుతున్నాయి.
జీర్ణించుకోలేకపోతున్న జిల్లా వాసులు
అయితే రాత్రికి రాత్రే మహారాజ పేరు మార్చడాన్ని జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అటు అధికార పార్టీ శ్రేణులు సైతం ప్రభుత్వ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పేర్లు మార్చేటప్పుడు స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకోనిదే నిర్ణయం తీసుకోవడం అసాధ్యం. మహారాజ ఆస్పత్రి పేరు మార్పు వెనుక స్థానిక నాయకుల కుట్ర కూడా ఉందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంపై జిల్లా వైసీపీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెంచాలని.. మహారాజ పేరును యథాతధంగా కొనసాగేలా చూడాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.
సాయంత్రానికి పరదా..
అయితే శుక్రవారం సాయంత్రానికి మహారాజ జిల్లా కేంద్రాస్పత్రి బోర్డుపై పరదా కప్పేశారు. పేరు మార్పుతో జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసిందనో.. లేకుంటే ప్రజా వ్యతిరేకత తప్పదనో..ఏమో కానీ సాయంత్రానికి ఇలా పరదా కప్పేశారు. ఇది చర్చనీయాంశమైంది అయితే అక్కడున్న సిబ్బంది వద్ద ప్రస్తావిస్తే తమకేమీ తెలియదని చెబుతున్నారు.
ఇది కక్షపూరిత చర్య
ప్రజలకు పదికాలాల పాటు మంచి సేవలందాలన్న తలంపుతో భూములు కేటాయించాం. పట్టణానికి చేరువలో ఉన్న ప్రాంతంలో ఆస్పత్రి అందుబాటులో ఉండాలన్న తలంపుతో నాడు ఆ నిర్ణయం తీసుకున్నాం. అప్పటి నుంచి మహారాజ ఆస్పత్రిగానే కొనసాగుతోంది. కానీ వైసీపీ ప్రభుత్వ పెద్దలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం సాహసించని విధంగా వైసీపీ ప్రభుత్వం పేరు మార్పు నిర్ణయం తీసుకోవడం దారుణం. స్థలదాతల పేర్లు సంబంధిత సంస్థలకు పెట్టడం, అవే పేర్లు కొనసాగించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రముఖులను గౌరవించే స్థితిలో వైసీపీ ప్రభుత్వ లేదు. మహారాజ పేరును కొనసాగించకుంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. ప్రజా గుణపాఠం తప్పదు.
- పూసపాటి అశోక్‌గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి
భగ్గుమన్న టీడీపీ నేతలు
ఆస్పత్రి ఎదుట నిరసన
విజయనగరం రింగురోడ్డు/రూరల్, అక్టోబరు 7: మహారాజ జిల్లా కేంద్ర ఆస్పత్రి పేరు మార్పుపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. రాత్రికి రాత్రే పేరు మార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయమే విజయనగరం నియోజకవర్గ టీడీపీ నేతలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ తో పాటు జిల్లా నేతల తీరును ఎండగట్టారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బొద్దుల నర్సింగరావు, కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్లు మాట్లాడుతూ చరితాత్ముల పేర్లు మార్చి చరిత్రహీనులు కావొద్దని హితవుపలికారు. విజయనగరం మహారాజుల త్యాగనిరతిని కొనియాడారు. వారి త్యాగ ఫలితమే విజయనగరంలో విద్య, వైద్య సంస్థలు ఏర్పాటైన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కోట రోడ్డులోని సింహాచలం మేడను రోటరీ స్వచ్చంద సంస్థకు నెలకు రూ.1 లీజుకి ఇచ్చన విషయాన్ని గుర్తుచేశారు. అక్కడ నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని చెప్పారు. జిల్లా కేంద్రాసుపత్రి ముందు మహారాజ పేరును తొలగించడం వల్ల ప్రభుత్వానికి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కలిసోచ్చేదేమిటని? ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా పోలినాయుడు, గొల్లకోటి గురునాథ్, ముద్దాడ చంద్రశేఖర్, కోండ్రు శ్రీనివాసరావు, కొర్నాన రాజ్యలక్ష్మి రొంగలి రామారావు, మైలిపల్లి పైడిరాజు, పి.పైడిరాజు, గంటా రవి, పీతల కోదండరామ్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల పేర్లు మార్పుతో పాలన
టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున
విజయనగరం రూరల్, అక్టోబరు 7: మహనీయుల పేరు మార్చడమే వైసీపీ మూడున్నరేళ్ల పాలన అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఎద్దేవా చేశారు. మహారాజ జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్పుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూసపాటి రాజవంశీయుల త్యాగనిరతికి మచ్చుతునక జిల్లా కేంద్ర ఆస్పత్రి అన్నారు. విద్య, వైద్యరంగాలకు రాజులు ఉదారంగా సాయమందించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విషయంలో జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చరిత్రహీనులుగా మిగులుతారని.. ఇప్పటికైనా స్పందించాలని కోరారు. మహారాజ పేరును యథాతధంగా కొనసాగించకుంటే మాత్రం టీడీపీ పోరాడుతుందని నాగార్జున హెచ్చరించారు.
రాజవంశీయుల త్యాగనిరతి జగన్‌కు ఏం తెలుసు?
మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
లక్కవరపుకోట: పూసపాటి రాజవంశీయుల త్యాగనిరతి సీఎం జగన్‌కు తెలియదని.. తెలిస్తే ఇటువంటి దుశ్చర్యలకు దిగేవారు కాదని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మండిపడ్డారు. శుక్రవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. విజయనగరంలో ఒక్క రూపాయి అద్దెతో చాలా సంస్థలు నడిపిస్తున్న ఘనత రాజవంశీయులకే దక్కుతుందన్నారు. అటువంటి వారి పేర్లు మార్చే హక్కుల నీకెక్కడుందని ప్రశ్నించారు. పొరపాటున జగన్ జాతీయ స్థాయి నాయకుడైతే గాంధీ పేర్లు తొలగించి రాజారెడ్డి పేరు పెట్టి ఉండేవారని ఎద్దేవా చేశారు. అశోక్‌గజపతిరాజుపై కక్ష సాధింపులో భాగంగానే ఈ పేరు మార్పు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్ అన్నారు. రామప్రసాద్ విమర్శించారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు రమణమూర్తి, మళ్ళా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది అనైతిక చర్య
తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షీ రవిశేఖర్
నెల్లిమర్ల: ఇది అనైతిక చర్య అని తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షీ రవిశేఖర్ అన్నారు. స్థానిక విలేఖర్లతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లా ప్రజలు క్షమించరన్నారు. ప్రజా సంక్షేమం కోసం వందలాది ఎకరాలను దానం చేసిన మహారాజుల పేర్లు తొలగించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఇటువంటి దుశ్చర్యలతో ప్రజల మనసు నుంచి రాజవంశీయులను దూరం చేయలేరన్నారు. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మహరాజ కేంద్ర ఆస్పత్రిని యథాతధంగా కొనసాగించాలని సువ్వాడ రవిశేఖర్ డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రజాప్రతినిధులు చరిత్రహీనులు
టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శివరామకృష్ణ
గజపతినగరం: వైసీపీ ప్రజాప్రతినిధులు చరిత్రహీనులుగా మిగలడం ఖాయమని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ అన్నారు. శుక్రవారం టీడీపీ నాయకులు విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో విద్య, వైద్యరంగాల కోసం సొంత భూములను దానంగా ఇచ్చిన రాజవంశీయులను టార్గెట్ చేయడం దారుణమన్నారు. మహనీయుల మంచి పనులను గుర్తించుకునేందుకే వారి పేర్లను, విగ్రహాలను ఏర్పాటుచేస్తారన్న విషయం గుర్తించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. టీడీపీ నేతలు లెంక చిన్నంనాయుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అశోక్‌ను టార్గెట్ చేయడం దారుణం
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బంగార్రాజు
నెల్లిమర్ల: జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు విమర్శించారు. శుక్రవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పాలన పిచ్చికి పరాకాష్టగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు మరవక ముందే జిల్లాలో ఇటువంటి దుశ్చర్యకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం రాజవంశీయులను అవమానించడమేనన్నారు. ఆస్పత్రిని అశోక్‌గజపతిరాజు అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అశోక్‌ను టార్గెట్ చేస్తూ ఇటువంటి చర్యలకు దిగడం బాధాకరమన్నారు. సమావేశంలో పిడుగు తోటారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T05:11:19+05:30 IST