తెలుగు పలుకు.. తేనె లొలుకు..
ABN, First Publish Date - 2022-08-29T05:56:31+05:30
మాతృభాషలో మాట్లాడడమే నాకు మహదానందం.. అందరూ తెలుగులోనే మాట్లాడండి అంటూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు నిరంతరం చెప్పేవారు.
భాష పరిరక్షణకు కలిసి నడుద్దామంటున్న పండితులు, కళాకారులు, అభిమానులు
నేడు తెలుగు భాషా దినోత్సవం
రాజాం రూరల్/ బొబ్బిలి, ఆగస్టు 28:
- మాతృభాషలో మాట్లాడడమే నాకు మహదానందం.. అందరూ తెలుగులోనే మాట్లాడండి అంటూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు నిరంతరం చెప్పేవారు.
- దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏనాడో శ్రీకృష్ణదేవరాయులు తెలుగు ఖ్యాతిని చాటారు.
- తెలుగు రాష్ట్రాల్లో పాలన, అధికార వ్యవహారాలు తెలుగులోనే సాగాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇప్పటికీ చెబుతూ ఉంటారు.
- ఒకరి భావాలు ఒకరు పంచుకోవడానికి పుట్టినదే భాష.. మాతృభాషను నేర్వలేనివాడు ఇతర భాషలను సంపూర్ణంగా నేర్చుకోలేరని కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మాటలు అక్షరసత్యాలు.
- తెలుగు సాహిత్యంలో విప్లవాత్మకమైన మార్పులు చేసి గ్రాంధిక స్థానంలో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి రోజునే తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం.
తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కింది. తెలుగు భాషకు ప్రాచీన హోదాను కాదనలేమని 2016లో మద్రాస్ హైకోర్టు సైతం తీర్పునిచ్చింది. ఈ హోదా ప్రకటనకే పరిమితం కాకుండా మాతృభాషను అందరూ ఆదరించే విధంగా ప్రభుత్వం, భాషా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు మరింత కృషి చేయాల్సి ఉంది. ప్రస్తుతం పరభాష వ్యామోహంతో ఇంటిభాష, బడిభాష వేరవుతున్నాయి. తెలుగులో ఆంగ్లభాష పదాలు చొచ్చుకుపోతున్నాయి. మాటల్లో మమకారం, అపాయ్యత తగ్గిపోతున్నాయి. జాతీయాలు, నుడికారం, సామెతలు లేకుండా మాటలు సాగిపోతున్నాయి.
1966లోనే తెలుగును అధికార భాషగా చట్టం చేసినప్పటికీ అమలు చేయడంలో ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించలేదు. కార్యాలయాల్లో తెలుగును అత్యంత తక్కువగా వినియోగిస్తున్నారు. దస్త్రాలన్నీ ఆంగ్లంలోనే నడుస్తున్నాయి. భాష జారిపోతే జాతి, సంస్కృతీ గతించిపోతాయని భాషాభిమానులు వాపోతు న్నారు. తెలుగులో చదివితే ఉద్యోగాలు రావన్న అపోహతోనే తల్లిదండ్రులు అధికంగా ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలని పండితులు, కవులు, రచయితలు కోరుతున్నారు. తేట తెలుగు తీయదనాన్ని వేదికలపై చాటుతున్నారు. తెలుగు భాషను దశాబ్దాల కిందటే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా అభివర్ణించారు. ఈ భాషలో ప్రతి వాక్యం అచ్చు శబ్దంతో ముగుస్తుంది. ఈ ప్రత్యేకత ఇటలీ భాషకు మాత్రమే ఉంది. అందుకే ఇటలీ, తెలుగు భాషలను అజంత భాషలంటారు. ఇతర భాషలన్నీ హల్లు శబ్దంతో అంతమవుతాయి.
అమ్మా... నాన్న అని పిలవాలి
పోటీ ప్రపంచంలో ఆంగ్లం తప్పనిసరి. ఫలితంగా మాతృభాషలో అభ్యసించడానికి చాలామంది వెనుకంజ వేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. తెలుగు మాధ్యమంలో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు వేలల్లో ఉన్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు మాతృభాషను అమలు చేయడంలో ఎంతో ఆదర్శంగా నిలిచింది. మనం కూడా అదేమార్గాన్ని అనుసరించాలి. ఇళ్లల్లో పిల్లలు అమ్మా, నాన్నా అనడమే మానేశారు. ఇది చాలా బాధాకరం.
- గార రంగనాథం, రచయిత, విశ్రాంత తెలుగు పండితులు, రాజాం.
భాషను పరిరక్షించుకోవాలి
ఎంతోమంది మహానుభావులు తెలుగు భాషకోసం పరిశ్రమించి పరిశోధనలు చేశారు. అలాంటి వారి శ్రమకు తగ్గట్టుగా మనమంతా భాషా పరిరక్షణకు కృషి చేయడం కనీస బాధ్యత, కర్తవ్యం. తెలుగులోనే అన్ని రకాల ఫలకాలు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండాలి. రైల్వే స్టేషన్లలో మాదిరిగా విమానాశ్రయాలలో సైతం తెలుగులో ప్రయాణికులకు సమాచార ప్రకటనలు ఇవ్వాలి.
- లంక వెంకటస్వామి, తెలుగు వెలుగు వేదిక గౌరవాధ్యక్షుడు, బొబ్బిలి
తెలుగును సజీవంగా నిలపాలి
వృత్తి రీత్యా ప్రభుత్వ పాఠశాల లెక్కలు ఉపాధ్యాయుడినే అయినప్పటికీ రచనా వ్యాసంగమంటే ఎంతో ఇష్టం. ఎన్నో కవితలు, కథలు, కథానికలు, రచనలు చేశాను. అధికార తెలుగు భాషకు అందరూ కలిసికట్టుగా ప్రాణం పోసి నిత్య సజీవ సంపదగా నిలపాల్సిన తరుణం ఆసన్నమైంది. మమ్మీడాడీ సంబోధన మాతృభాషకు గొడ్డలిపెట్టు. ఆ విషసంస్కృతికి చరమగీతం పాడాలి.
- మీసాల చినగౌరినాయుడు, తెలుగువెలుగు వేదిక అధ్యక్షుడు, బొబ్బిలి
తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించిన కుటుంబం
శృంగవరపుకోట, ఆగస్టు 28:
ఏదైనా రికార్డు సాధించడంలో ఓ కుటుంబంలో ఒకరిద్దరు ఉంటారు. కానీ శృంగవరపుకోట పట్టణంలోని ఓ కుటుంబంలోని తల్లి, కూతురు, కొడుకు ముగ్గురూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డును సాధించారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి సమీపంలో నివశిస్తున్న ఇప్పలి శైలజ వంద మంది కౌరవల పేర్లును 27 సెకెండ్లలో చెప్పి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేసుకున్నారు. ఇదే విధంగా ఆరోతరగతి చదవుతున్న ఆమె కుమార్తె నీతిశాలిని 27 సెకెండ్లలోనే 118 అవర్తన పట్టికలోని రసాయన మూల్యాంకనాలను వల్లించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులకు ఎక్కారు. వీరిద్దరేకాకుండా నాలుగోతరగతి చదువుతున్న కుమారుడు హరి సాత్విక్ నాయుడు 60 తెలుగు సంవత్సరాల పదాలు, 18 పురాణాలు, 18 పర్వాలు, 27 నక్షిత్రాలు, 16 తిధులు వంటి 139 తెలుగు పదాలను 49 సెకెండ్లలో పలికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో ప్రతిభ కనబరిచాడు. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు హైదరాబాద్‌లోని అమిర్‌పేటలో ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ పదాలను పలికినవారిని గుర్తిస్తారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ పోటీలను డాక్టర్ చింతబట్ల వెంకటాచారి నిర్వహిస్తున్నారు. 2022 మేలో జరిగిన కాంపిటీషన్‌లో ఈ కుటుంబం ఈ ఘనత సాధించింది. శ్రీకాకుళానికి చెందిన శైలజ ఎంఎస్సీ బోటనీ, సైకాలజీ చదువుకుంది. ఉద్యోగరీత్య భర్త నాగరాజుతో ఎస్.కోటకు వలస వచ్చారు. గతంలో 27 సెకెండ్లలో మహాభారతంలోని వందమంది కౌరవుల పేర్లు 33 సెకెండ్లలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, 30 సెకెండ్లలో చెప్పి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డును పొందారు. నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు నిర్వహించిన పోటీల్లో అతను నటించిన 303 సినిమా పేర్లను 5 నిమిషాల్లో చెప్పడంతో సినీ నటుడు బాలకృష్ణ ఆన్‌లైన్‌లో అభినందించినట్లు శైలజ చెప్పారు.
----------
Updated Date - 2022-08-29T05:56:31+05:30 IST