స్పందన ప్లస్‌తో త్వరితగతిన రెవెన్యూ సమస్యలు పరిష్కారం
ABN, First Publish Date - 2022-10-08T05:04:18+05:30
స్పందన ప్లస్‌తో త్వరితగతిన రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు.
కలెక్టర్, ఎస్పీ వెల్లడి
పార్వతీపురం, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): స్పందన ప్లస్‌తో త్వరితగతిన రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమానికి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు. అనంతరం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎస్‌ఐలు, అర్జీదారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఇరు శాఖలతో ముడిపడి ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. స్పందనలో వస్తున్న ప్రజా వినతులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యం మేరకు స్పందన వినతులు పరిష్కరించడమే లక్ష్యంగా స్పందన ప్లస్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వినతులపై 10 రోజుల్లో నివేదిక అందించాలని మండల అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా భూములు, ఇంటి స్థలం ఆక్రమణలపై మక్కువ మండలం శంబరకి చెందిన ఆదినారాయణ, కొమరాడ మండలం రామభద్రపురానికి చెందిన అమ్మడు, సీతానగరం మండల పెదభోగిలికి చెందిన జె. ఉదయ్‌కుమార్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ చేపట్టి ఆక్రమణ దారులపైౖ కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ తర్వాత ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ... అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగరాదన్నారు. వివిధ శాఖల అధికారులతో కూర్చొని అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో స్పందన ప్లస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అక్రమణదారులపై బైండోవర్ కేసులు పెట్టాలని ఆదేశించారు. బాల్య వివాహలు, మూఢనమ్మకాలు, నాటుసారా నివారణకు త్వరలోనే జిల్లాలో ‘మన ఊరు..మన పోలీసు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏఎస్పీ దిలీప్ కిరణ్, డీఆర్‌వో వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T05:04:18+05:30 IST