పైసా లేకుండా ప్రణాళికా?
ABN, First Publish Date - 2022-12-16T00:02:02+05:30
- ఈ ప్రభుత్వంలో పాడైన వీధిలైట్లను కూడా తిరిగి అమర్చలేకపోతున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించేది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా రాలేదు.
నిర్వేదం వ్యక్తం చేస్తున్న సర్పంచులు
ఎవరిని కదిలించినా పెల్లుబుకుతున్న అసంతృప్తి
చిన్న పనులూ చేపట్టలేని అసహాయత
పంచాయతీలకు నిధులివ్వని రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వ నిధులూ పక్కదారి
శృంగవరపుకోట, డిసెంబరు 15:
- ఈ ప్రభుత్వంలో పాడైన వీధిలైట్లను కూడా తిరిగి అమర్చలేకపోతున్నాం. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి నిధులు కేటాయించేది. మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా రాలేదు.
- రెండు రోజుల కిందట మండల పరిషత్‌లో జరిగిన అభివృద్ధి ప్రణాళిక శిక్షణకు
వచ్చిన ఓ సర్పంచ్ ఆవేదనిది
కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తుంది. ఇందులో భాగంగా తొలుత వివిధ శాఖల అధికారులతో పాటు గ్రామ స్థాయిలోనూ సర్పంచ్‌లు, ఎంపీటిసీ (ప్రజా ప్రతినిధులు)లకు మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణ ఇస్తారు. ఈ ఏడాది కూడా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో పంచాయతీల అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసేందుకు మండల పరిషత్ కార్యాలయాల్లో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఈ శిక్షణ వచ్చే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు గ్రామ పంచాయతీల అభివృద్ధికి తయారు చేసే ప్రణాళికపై ఉత్సాహం చూపేవారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రణాళిక శిక్షణకు వారి నుంచి ఏమాత్రమూ అసక్తి కనిపించడం లేదు. ఎందుకీ శిక్షణలంటూ పెదవి విరుస్తున్నారు. సర్పంచ్‌లుగా ఎన్నికైన నాటి నుంచి గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులూ చేయలేకపోతున్నామని, కనీసం ఇళ్ల ముందున్న చెత్తను ఎత్తించేందుకు కూడా పంచాయతీల వద్ద నిధులు లేకుండా చేస్తున్నారని వాపోతున్నారు.
పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు అందించేది. వీటితో పాటు ఇసుక, రాయి వంటి ప్రకృతి వనరుల తవ్వకాల నుంచి వచ్చే ఆదాయంలో కొంత వాటా పంచాయతీలకు అందేది. గ్రామాల్లో వసూలు చేసే పన్నులతో పాటు వివిధ రకాల ఆదాయాలతో పంచాయతీలను సర్పంచ్‌లు అభివృద్ధి చేసేవారు. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి పంచాయతీలకు నిధులేవీ రావడం లేదు. సర్పంచులు కొలువుతీరక ముందు అధికారులే పంచాయతీ ప్రత్యేక అధికారులుగా వ్యవహరించేవారు. అయితే సర్పంచ్‌లు లేరన్న కారణంతో ప్రజలు కూడా అభివృద్ధి పనులు జరగకపోయినా పట్టించుకోలేదు. పాలకమండలిలు ఏర్పాటైన తరువాతా అభివృద్ధి లేదు. పంచాయతీల పరిస్థితి మరింత దిగజారింది. పాడైన వీధిలైట్ల స్థానంలో కొత్తగా వేరొకటి అమర్చేందుకూ ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్రం నిధులు ఇస్తున్నా..
పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘ నిధులు అందిస్తుంది. ఇందులో టైడ్, అన్‌టైడ్ అని రెండు రకాలుగా ఉంటాయి. టైడ్ నిధులతో పంచాయతీ అధికారుల సూచన మేరకు రోడ్లు, కాలువుల వంటి అభివృద్ధితో పాటు సిబ్బంది జీతాలను చెల్లించుకొనేందుకు అవకాశం వుంటుంది. అన్‌టైడ్ నిధులతో మాత్రం తాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి పనులకు వినియోగించాల్సి వుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సంఘ నిధులనూ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నేరుగా పంచాయతీల ఖాతాలకు ఆర్థిక సంఘ నిధులను జమచేస్తోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ సొమ్మును సర్పంచ్‌లు తీసుకోకుండా అడ్డుకట్ట వేస్తోంది. దీంతో పంచాయతీ ఖాతాలో సొమ్ము కనిపిస్తుంది కానీ చేసిన పనికి బిల్లులు రావు. అధికారులు వీటిపై సంతకాలు చేయకుండా అడ్డుకుంటోంది. ఖాజానా శాఖలో ఫ్రీజింగ్ విధిస్తున్నారు.
క్లాప్‌మిత్రలకూ జీతాలు కష్టమే
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం క్లాప్ మిత్రలను నియమించింది. ప్రభుత్వం వీరి జీతాలను చెల్లిస్తుందని భావించి పంచాయతీలు వీరికి అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రభుత్వం వీరికి జీతాలు ఇవ్వడం మానేసింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సంఘం (టైడ్) నుంచి ఆరు నెలల జీతాలు చెల్లించాలని పట్టుపట్టింది. కొంత మంది సర్పంచ్‌లు నిరాకరించడంతో బలవంతం చేస్తున్నారు. ఆడిట్ ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలను ఈ నిధుల నుంచే కడుతున్నారు. పంచాయితీల అభివృద్దికి వాడాల్సిన ఆర్థిక సంఘం నిధులతో ఇతర బిల్లులు చెల్లించడం సర్పంచ్‌లకు కంటగింపుగా వుంది.
పథకాలను లెక్కకట్టేందుకేనా..
పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా గ్రామ స్థాయిలో మీ ఇంటికి మీరేషన్, పెన్సన్ కానుక, సంపూర్ణ పోషణ, చేయూత, ఆసరా, అమ్మఒడి, గోరుముద్ద, పేదలందరికీ ఇళ్లు, కాపు నేస్తం, నేతన్న నేస్తం, ఈబీసీ నేస్తం, రైతు భరోషా, రైతులకు సున్నా వడ్డీ వంటి పథకాలకు అందించే సొమ్మును లెక్కకట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా అభివృద్ధి అని చెప్పేందుకు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో చేర్చుతున్నారు. పంచాయతీల పరిధిలో అంతర్గత రోడ్లు, కాలువలు, వీధిలైట్ల ఏర్పాటు వంటి వాటికి స్థానికంగా వనరులు సమకూర్చుకోవాలన్న అర్థం వచ్చే రీతిలో శిక్షణ ఉందని పలువురు సర్పంచ్‌లు పేర్కొన్నారు.
Updated Date - 2022-12-16T00:02:04+05:30 IST