ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎక్కడ పడితే అక్కడ కల్తీ

ABN, First Publish Date - 2022-01-30T05:47:09+05:30

జిల్లాలో కల్తీ, నిల్వ ఆహార పదార్థాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వివిద రకాల రసాయనాలు పూసి విక్రయిస్తున్నారు. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. చిరుతిళ్లకు అలవాటు పడిన జనం ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు. ఇలాంటి అమ్మకాలపై తాజాగా వచ్చిన కోర్టు తీర్పు అటు వినియోగదారులకు... ఇటు వ్యాపారులకు ఓ హెచ్చరికగా భావించవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 యథేచ్ఛగా ఆహార పదార్థాల కల్తీ

విచ్చలవిడిగా రంగుల వినియోగం

తాజా తీర్పుతో వ్యాపారుల్లో వణుకు

మరిన్ని దాడులు చేస్తేనే ఫలితం


 జిల్లాలో కల్తీ, నిల్వ ఆహార పదార్థాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వివిద రకాల రసాయనాలు పూసి విక్రయిస్తున్నారు. ఇవి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి. చిరుతిళ్లకు అలవాటు పడిన జనం ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు. ఇలాంటి అమ్మకాలపై తాజాగా వచ్చిన కోర్టు తీర్పు అటు వినియోగదారులకు... ఇటు వ్యాపారులకు ఓ హెచ్చరికగా భావించవచ్చు. అదే సమయంలో ఆహార కల్తీ నిరోధానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్నీ ఈ తీర్పు గుర్తు చేస్తోంది.


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

కల్తీ ఆహారం అమ్మకాలకు జిల్లాలో అడ్డూ అదుపూ ఉండటం లేదు. పానీపూరీలు, చాట్‌, సమోసాల నుంచి మాంసాహార ఉత్పత్తుల వరకూ అన్నిటా యథేచ్ఛగా కల్తీ జరుగుతోంది. ఆహారంలో ఇష్టానుసారంగా రంగులు వినియోగిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్లు పెట్టే వారి నుంచి స్వీటు దుకాణాల వరకూ అందరిదీ ఇదే బాట. సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో...వీరి వ్యాపారం మూడు పువ్వులు...ఆరు కాయలుగా సాగుతోంది. కల్తీ ఆహార అమ్మకాలపై ఈనెల 27న వెలువడిన కోర్టు తీర్పు ఇలాంటి అక్రమ వ్యాపారులకు షాకిచ్చింది. రంగులు వేసి పానీపూరి.. చాట్‌ అమ్మకాలు నిర్వహిస్తున్న వ్యక్తికి మూడు నెలల కారాగార శిక్ష విధిస్తూ  విజయనగరం అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్పి తీర్పు ఇచ్చారు. ఆ వ్యక్తికి రూ.10వేల జరిమానా విధించారు. 2016లో నమోదైన ఈ కేసులో తాజాగా తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో కల్తీ ఆహారం విక్రయిస్తున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హాటళ్ల యజమానుల్లో భయం మొదలైంది.  ఇది ఇక్కడితో ఆగిపోకూడదని... సంబంధిత అధికారులు తరచూ దాడులు చేసి... బాధ్యులకు ఇదే తరహా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. జిల్లాలోని ప్రధాన హోటళ్లు, మాంసాహార భోజనశాలలు, రోడ్డు వెంబడి ఉన్న దాబాలు ఇలా ఎక్కడ చూసినా వారాల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వండి పెడుతున్నారు. వంటకాలపై రంగులు వేసి ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. అవి ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మసాలాలు దట్టిస్తూ అప్పటికపుడు వేడి చేసి పెడుతుండడంతో వినియోగదారులు తినడానికి మొగ్గు చూపుతున్నారు.ఆ తరువాత అనారోగ్యానికి గురవుతున్నారు. 

దాడులు పెరగాలి

కల్తీ ఆహార అమ్మకాలపై దాడులు మరింత పెరగాల్సి ఉంది. మండల కేంద్రాల్లో సైతం ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, పానీపూరీలు, చాట్‌ అమ్మకాలు, కార్న్‌ఫ్లోర్‌లో రంగులు దట్టించి చికెన్‌ఫ్రై, ఫిష్‌ఫ్రై చేసి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా మద్యం అమ్మకాలు సాగుతున్న ప్రతి షాపు వద్ద ఇటువంటి రంగులు వేసిన కల్తీ ఆహార అమ్మకాలు సాగుతున్నాయి.  ఆర్టీసీ కాంప్లెక్స్‌ల వద్ద. రైల్వే స్టేషన్ల సమీపాల్లో కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నారు. విజయనగరంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డులో, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద, జిల్లా వ్యాప్తంగా వైన్‌ షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల సమీపాల్లో కల్తీ ఆహార అమ్మకాలు నిత్యం కనిపిస్తున్నాయి. మందుబాబులు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మద్యం మత్తులో ఆహారంగా తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిపై దాడులు పెరగాల్సి ఉంది. 

పెరిగిన సిబ్బంది

ఇన్నాళ్లూ సిబ్బంది కొరత కారణంగా దాడులు సరిగా చేయలేని పరిస్థితి ఉందని ఆ శాఖ అధికారులు దాట వేస్తూ వచ్చారు. కొత్తగా సిబ్బందిని నియమించారు. దీంతో దాడులు ముమ్మరం చేయాల్సి ఉంది. కొత్తగా ముగ్గురు ఫుడ్‌ సేఫ్టీ అధికారులను నియమించారు. జిల్లాను మూడు డివిజన్లుగా విభజించి ఒక్కో అధికారికి ఒక్కో ప్రాంతాన్ని అప్పగించారు. ఆ ప్రాంతాల్లో కల్తీ ఆహార అమ్మకాలు జరగకుండా చూడాల్సి ఉంది. ఒక్క జిల్లా కేంద్రమే కాకుండా పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీ, ఎస్‌.కోట, గజపతినగరం, చీపురుపల్లి ఇలా పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్న మండల కేంద్రాల్లోనూ కల్తీ ఆహార అమ్మకాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. 

పెండింగ్‌లో కేసులు

జిల్లాలో అనేక పెండింగ్‌ కేసులున్నాయి. కోర్టుల్లో క్రిమినల్‌ కేసులుగా 58 నడుస్తున్నాయి. కొన్ని కేసులు జేసీ కోర్టుకు అప్పగిస్తున్నారు. ఇటువంటివి 200వరకు పెండింగ్‌లో ఉన్నాయి. 2018 నుంచి నమోదవుతున్న గుట్కా, ఖైనీ అమ్మకాల కేసులే 160 వరకు ఉన్నాయి. మిగిలిన 40వరకు ఆహార కల్తీ కేసులు కాగా.. గుర్తింపు లేని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లకు సంబంధించి 20కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. గత రెండు మూడు నెలల్లో 10కేసులు వరకు నమోదయ్యాయి. కల్తీ ఆహారంగా అనుమానం ఉండి శాంపిల్స్‌ సేకరించి హైదరాబాద్‌ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. ఆ రిపోర్టులు వచ్చేందుకు కూడా తీవ్రజాప్యం జరుగుతోంది. ఇలా 10 కేసుల వరకు ప్రాసిక్యూషన్‌ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. 

దాడులు చేస్తున్నాం

కల్తీ ఆహార అమ్మకాల విషయాన్ని ఆహార తనిఖీ అధికారి వేణుగోపాల్‌ వద్ద ప్రస్తావించగా ఇప్పటికే అనేక కేసులు నమోదు చేశామన్నారు. అవి వివిధ దశల్లో విచారణలో ఉన్నాయని తెలిపారు. కొత్తగా ఫుడ్‌ సేప్టీ అధికారులు వచ్చారని తెలిపారు. ప్రాంతాల వారీగా దాడులు నిర్వహించి కల్తీ ఆహార అమ్మకాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 

Updated Date - 2022-01-30T05:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising