ఇది పక్షపాతం కాదా?
ABN, First Publish Date - 2022-12-01T00:16:09+05:30
అధికార పార్టీ మద్దతు ప్రతినిధులు లేని వార్డులకు అభివృద్ధి పనులు కేటాయించకపోవడం అన్యాయం. ఆయా వార్డుల్లో ప్రజలు మాతో పాటు సర్పంచ్‌కు ఓటు వేసిన విషయాన్ని మరిచిపోవద్దు.
అధికార పార్టీ మద్దతుదారులు లేని వార్డుల్లో అభివృద్ధి పనులు నిల్
ఆరు వార్డులకు మొండిచేయి చూపిన పంచాయతీ అధికారులు
నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేసిన టీడీపీ మద్దతు సభ్యులు
పనులు ఆమోదించని నలుగురు సభ్యులు
శృంగవరపుకోట, నవంబరు 30:
అధికార పార్టీ మద్దతు ప్రతినిధులు లేని వార్డులకు అభివృద్ధి పనులు కేటాయించకపోవడం అన్యాయం. ఆయా వార్డుల్లో ప్రజలు మాతో పాటు సర్పంచ్‌కు ఓటు వేసిన విషయాన్ని మరిచిపోవద్దు. టీడీపీ మద్దతు సభ్యుల వార్డుల్లో అభివృద్ధి చేసేందుకు విముఖత చూపడం మంచి పద్ధతి కాదు. దీనికి నిరసనగా సాధారణ సమావేశం నుంచి వాకౌట్ చేశాం.
- టీడీపీ మద్దతు వార్డు సభ్యులు కాపుగంటి శ్రీనివాసరావు(వాసు), సరిపల్లి రామకృష్ణ, అనకాపల్లి చెల్లయ్య, పేదగాడి లక్ష్మిల ఆవేదన ఇది.
శృంగవరపుకోట పంచాయతీ సమావేశం నుంచి ఈ నలుగురూ బుధవారం అర్ధాంతరంగా వాకౌట్ చేశారు. పంచాయతీ పాలకుల తీరును తీవ్రంగా నిరసించారు. తమ వార్డులను కనీసం పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలో రూ.76లక్షల వ్యయంతో 46 అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవసరమైన తీర్మానం చేసేందుకు ఎస్.కోట సర్పంచ్ గనివాడ సంతోషి కుమారి అధ్యక్షతన బుధవారం సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యనిర్వాహక అధికారి బీవీజే పాత్రో తొలుత మాట్లాడుతూ ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టదలిచారో సభ్యులకు చదివి వినిపించారు. టీడీపీ మద్దతుతో గెలిచిన 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 8వ వార్డు, 12వ వార్డు, 13వవార్డుల్లో ఈ అభివృద్ధి పనులేవీ లేనట్లు సభ్యులు గుర్తించారు. 13వవార్డు తప్ప మిగిలిన ఐదు వార్డులు టీడీపీ మద్దతు సభ్యులవి. జి.నాగమణి, స్వతంత్ర సభ్యుడు చిప్పాడ శేషగిరిరావులు సమావేశానికి హాజరుకాలేదు. మిగిలిన నలుగురు మాట్లాడుతూ ఆరు వార్డుల్లో అభివృద్ధి పనులు ఎందుకు కేటాయించలేదని సభలో నిలదీశారు. ఈ వార్డుల్లో ఓట్లు పడకుండానే గెలిచారా? అంటూ సర్పంచ్‌ను ప్రశ్నించారు. పంచాయతీలోని 20 వార్డుల్లోనూ సమానంగా అభివృద్ధి చేయాల్సింది పోయి కొన్ని వార్డుల్లో అభివృద్ధిని అడ్డుకోవడమేంటని అసహనం వ్యక్తం చేశారు. పాలకుల పక్షపాత వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి బయటకు వచ్చి నినాదాలు చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని, ఓ దగ్గర అభివృద్ధి చేసి, మరో దగ్గర వదిలేయడం సరికాదన్నారు. సాధారణ సమావేశానికి 18 మంది సభ్యులు హాజరయ్యారు. ఇద్దరు గైర్హజరయ్యారు. అభివృద్ధి పనుల తీర్మానాన్ని 14 మంది ఆమోదించగా, నలుగురు టీడీపీ మద్దతు సభ్యులు ఆమోదం తెలిపలేదు. ఉప సర్పంచ్ మోపాడ కుమార్ మాట్లాడుతూ ఈ ఆరుగురు వార్డు సభ్యులూ వివరాలు సరిగా ఇవ్వలేదని, బాగున్న రోడ్లపై తిరిగి పనులు చేయించేందుకు చూస్తున్నారని అన్నారు.
Updated Date - 2022-12-01T00:16:11+05:30 IST