బోధనే అన్నారు... ఈ విధులేంటో!
ABN, First Publish Date - 2022-12-16T00:01:39+05:30
ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో అడుగు వేసి ఉపాధ్యాయేతర విధుల నుంచి తప్పించాలని వారు కోరుకున్న మేరకే ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలని భావించాం. ఇందులో తమ తప్పేముంది అంటూ వ్యాఖ్యానించారు.
డీఈవో కార్యాలయంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు
రికార్డులు, సాంకేతిక విధుల్లోనే కొనసాగింపు
మంత్రి మాటలు జిల్లాలోనే అమలు కాని వైనం
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరో అడుగు వేసి ఉపాధ్యాయేతర విధుల నుంచి తప్పించాలని వారు కోరుకున్న మేరకే ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలని భావించాం. ఇందులో తమ తప్పేముంది అంటూ వ్యాఖ్యానించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ నిర్ణయం జిల్లాలోనే పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు.
రాజకీయ అండదండలు, పలుకుబడి ఉన్న ఉపాధ్యాయులు జిల్లా కేంద్రం కదలకుండా నేటికీ కొన్ని విధానాలు కొనసాగుతున్నాయి. జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో వివిధ విభాగాల్లో ఉపాధ్యాయులే పనిచేస్తున్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వారు రికార్డు వర్కు, కంప్యూటర్ వర్క్, జీసీడీవో విధులు నిర్వర్తిస్తున్నారు. పైగా ఈ పాధ్యాయులు పనిచేసే పాఠశాలలు బోధనా సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలి. అలా కాకుండా తమకు ఇష్టంలేని విధులకు దూరంగా ఉంచుతున్నారు. మిగతా అంశాలను పట్టించుకోవడం లేదు.
విజయనగరం డీడీవో కార్యాలయంలో కొంత మంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. అలాగే సర్వశిక్ష అభియాన్ విభాగంలో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. జీసీడీఓ విభాగంలో మరో ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొంతమంది ఆయా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులగా పనిచేస్తున్న వారు సైతం ఉపాధ్యాయేతర విధుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన కారణంగా ఉపాధ్యాయులు బోధనా విధులకే వినియోగించాలన్న డిమాండ్ ఉపాధ్యాయుల నుంచి కూడా విన్పిస్తోంది. రాజకీయ పలుకుబడి ఉన్న వారు జిల్లా కేంద్రం దాటకుండా ఉండేలా డిప్యూటేషన్లు వేసుకుంటున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడిన ఓ ఉపాధ్యాయ సంఘం నేత చెప్పారు.
జిల్లాలోని 27 మండల కేంద్రాల్లో ఎమ్‌ఆర్‌సీ విభాగాలు ఉన్నాయి. వీటిలో గతంలో ఐదు నుంచి ఆరుగురు ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తించేవారు. నాలుగేళ్ల క్రితమే ప్రభుత్వం డిప్యూటేషన్లను రద్దు చేసింది. ఎమ్‌ఆర్‌సీ విభాగాల్లో సీఆర్‌పీలను నియమించారు. దీంతో ఉపాధ్యాయేతర విధుల నుంచి వారిని తప్పించినట్లయింది. అదే మాదిరిగా జిల్లా విద్యా శాఖ, ఎస్‌ఎస్‌ఏ, జీసీడీఓ విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేయాల్సి ఉంది. వీరిని బోధనా విధులకు మాత్రమే వినియోగించాల్సి ఉంది. తద్వారా ఆయా పాఠశాలల్లో నెలకొన్న బోధనా సిబ్బంది కొరతను పరిష్కరించాల్సి ఉంది.
-------
Updated Date - 2022-12-16T00:01:41+05:30 IST