దడ పుట్టిస్తున్నాయ్
ABN, First Publish Date - 2022-12-15T00:23:09+05:30
మండలవాసులు ఏనుగులు దడపుట్టిస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఆందోళనలో రైతులు, గ్రామస్థులు
భామిని: మండలవాసులు ఏనుగులు దడపుట్టిస్తున్నాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాలాడకు మళ్లీ నాలుగు గజరాజులు చేరుకోవడంతో రైతులు, గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వాస్తవంగా గత ఆరు నెలల కింద అవి విడిపోయాయి. వంశధార నదిలో నీరు తగ్గడంతో వాటిల్లో రెండు ఒడిశా కిడిగాం ప్రాంతానికి, మరో రెండు సీతంపేట మండలానికి చేరాయి. తాజాగా మంగళవారం అర్ధరాత్రి తాలాడ గ్రామ సమీపంలో ఆ నాలుగు మళ్లీ కలుసుకున్నాయి. కల్లాల్లోని ధాన్యం రాశులను చిందరవందర చేశాయి. మొక్కజొన్న, చెరకు, కూరగాయల పంట పొలాలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు, గ్రామస్థులు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. నష్టపోయిన తమకు పరిహారం అందించాలని రైతులు వలరౌతు లక్ష్మణరావు, దామోదర ముఖలింగం, మన్మఽథరావు, మహాలక్ష్మి కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఏనుగుల సంచారంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించినా ఇప్పటివరకూ రాకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రాంతం నుంచి గజరాజులను తరలించే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2022-12-15T00:23:11+05:30 IST