జిల్లా ఆర్థిక ప్రగతికి తోడ్పడండి
ABN, First Publish Date - 2022-12-07T00:08:25+05:30
జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకులు తోడ్పాడాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ సూచించారు.
పార్వతీపురం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): జిల్లా ఆర్థిక ప్రగతికి బ్యాంకులు తోడ్పాడాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్యాంకులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. రుణాలు మంజూరు వేగవంతం చేయాలని, ఔత్సాహికులను ప్రోత్సాహించాలని సూచించారు. బ్యాంకు శాఖలను ప్రజలకు చేరువ చేసి, మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. యూనిట్ల ఏర్పాట్లలో జాప్యం చేయరాదన్నారు. లబ్ధిదారులను సకాలంలో గుర్తించి రుణాల మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పాడి ఆవులు, చేపల యూనిట్ల ఏర్పాటులో సంబంధిత శాఖలు వేగంగా స్పందించాలన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జేఎల్ఎన్ మూర్తి మాట్లాడుతూ... ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరుకు ప్రధాన రంగాలకు రూ. 154 కోట్ల మేర రుణాలు అందించామని తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ. 63 కోట్లు ఇచ్చామన్నారు. జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, పాచిపెంట, భామిని మండలాల్లో జనాభాకు తగిన విధంగా ఆరు బ్యాంకు శాఖలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ లీడ్ జిల్లా ఆఫీసర్ నాగప్రవీణ్, నాబార్డ్ జిల్లా అభివృద్ధి అధికారి నాగార్జున, ఎస్బీఐ, యూబీఐ, ఏపీజీవీబీ కంట్రోలర్లు వెంకటేష్, దేసాయ్, సవ్యసాచిదాస్, బి.రాఘవేంధ్ర, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.రాబర్ట్‌పాల్, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ ఎ.ఈశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖాధికారి పి.సీతారాం తదితరులు పాల్గొన్నారు.
పతాక నిధికి విరాళం
ఈనెల 7న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా పతాక నిధికి విరాళాలను అందించి మాజీ సైనికుల సంక్షేమానికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వాటికి 80 (జి) (5) (వీఐ) ప్రకారం ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందన్నారు. జిల్లా సంక్షేమ అధికారి, విజయనగరం ఎస్బీఐ ఖాతా 52065221666, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0020931, ఎంఐసీఆర్ నెం 535002017లో గాని, డైరెక్టర్, సైనిక వెల్ఫేర్, విజయవాడ పేరున చెక్కు లేదా డ్రాఫ్ట్ తీసి జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం, విజయనగరానికి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో జె.వెంకటరావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, మాజీ సైనికుల సంక్షేమ ప్రతినిధి కోరాడ నారాయణరావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎస్సీసీ కేడర్లు టి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T00:08:27+05:30 IST