గుడిలో బడి
ABN, First Publish Date - 2022-03-06T04:57:51+05:30
పగిలిన గోడలు.. పెచ్చులూడుతున్న శ్లాబు.. బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు...ఇదీ భోగాపురం మండలం గుడివాడ పంచాయతీ శ్రీరామనగర్ గ్రామంలోని పాఠశాల దుస్థితి . వీటి మధ్యనే బితుకుబితుకుమంటూ ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలారోజులు కాలం వెళ్లదీశారు.
శిథిలమైన పాఠశాల భవనం
పట్టించుకోని అధికారులు
భోగాపురం, మార్చి 5: పగిలిన గోడలు.. పెచ్చులూడుతున్న శ్లాబు.. బయటకు కనిపిస్తున్న ఇనుప చువ్వలు...ఇదీ భోగాపురం మండలం గుడివాడ పంచాయతీ శ్రీరామనగర్ గ్రామంలోని పాఠశాల దుస్థితి . వీటి మధ్యనే బితుకుబితుకుమంటూ ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలారోజులు కాలం వెళ్లదీశారు. అధికారులు, నేతలకు పరిస్థితిని విన్నవించారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక.. శిథిలమైన పాఠశాల భవనంలో తరగతులు నిర్వహించలేక సమీపంలోని గుడినే బడిగా చేసుకున్నారు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు 27 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు కూడా లేవు. వంటశాల లేక కొన్ని సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనాన్ని ఎండీఎం నిర్వాహకులు ఇంటి దగ్గర వండి పాఠశాలకు తీసుకొస్తున్నారు.
ఎంఈవో దృష్టికి తీసుకెళ్లాం
పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిందని.. నిరంతరం పైకప్పు పెచ్చులు పడుతూనే ఉన్నాయని అనేక సార్లు ఎంఈవో దృష్టికి తీసుకెళ్లాం. భవనం అద్దెకు తీసుకొని పాఠశాల నిర్వహించాలని సూచించారు. ఇక్కడ ఎవరూ అద్దెకు భవనం ఇవ్వడంలేదు. తప్పనిసరి పరిస్థితిలో గుడిలోనే తరగతులు నిర్వహిస్తున్నాం.
- బి.జనార్దనరావు, హెచఎం, శ్రీరామనగర్.
అద్దెకు తీసుకోవాలని సూచించాం
ఆ పాఠశాల పూర్తిగా కూలడానికి సిద్ధంగా ఉంది. స్థానికంగా ఏదైనా గది అద్దెకు దొరికినట్లయితే వారితో లీజు ఒప్పందం తీసుకొని సమగ్రశిక్ష ద్వారా అద్దె చెల్లించే ఏర్పాటు చేద్దామని హెచ్‌ఎంకు సూచించాం.
- ఎం.రమణమూర్తి, ఎంఈవో, భోగాపురం.
Updated Date - 2022-03-06T04:57:51+05:30 IST