అన్‌రాక్ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేదెన్నడు?
ABN, First Publish Date - 2022-12-15T00:40:23+05:30
అన్‌రాక్ భూ నిర్వాసితులకు రెండు సెంట్ల చొప్పున నివాస స్థలాలను ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పాలని టీడీపీ ఎంపీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు.
మండల సమావేశంలో నిలదీసిన టీడీపీ సభ్యులు
ఎంపీపీ సమాధానంపై అభ్యంతరం, వాగ్వాదం
మాకవరపాలెం, డిసెంబరు 14: అన్‌రాక్ భూ నిర్వాసితులకు రెండు సెంట్ల చొప్పున నివాస స్థలాలను ఎప్పుడు పంపిణీ చేస్తారో చెప్పాలని టీడీపీ ఎంపీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఎంపీపీ రుత్తల సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం ఇక్కడ జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో రాచపల్లి ఎంపీటీసీ సభ్యుడు ఆర్.వై.పాత్రుడు, బూరుగుపాలెం ఎంపీటీసీ సభ్యుడు రుత్తల ఎర్రాపాత్రుడు మాట్లాడుతూ, అన్‌రాక్ కంపెనీ కోసం భూములు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటికీ అధికారులు ఇంతవరకు రెండు సెంట్ల నివేశన స్థలాలతోపాటు రాచపల్లి భూములను ఆన్లైన్ చేయలేదని ధ్వజమెత్తారు. ఎంపీపీ సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ... మండలంలో సీఎం పర్యటననాటికి అర్హులైన నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని చెప్పారు. దీంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం చెబుతూ, అనర్హులు ఎవరన్నది ఇప్పుడు ఏలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. దీంతో ఎంపీపీకి, టీడీపీ సభ్యులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. తహసీల్దార్ ప్రసాదరావు మాట్లాడుతూ, రాచపల్లి భూమికి సంబంధించి ఐదు కేసులు హైకోర్టులో విచారణలో వున్నందున ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం వీలుకాదని స్పష్టం చేశారు. శెట్టిపాలెం సర్పంచ్ అల్లురామునాయుడు... భూముల రీసర్వేపై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పగా, రీసర్వేపై ఎటువంటి ఇబ్బందులు వున్నా నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని తహసీల్దార్ చెప్పారు. అంతకుముందు ఏవో చిరంజీవి మాట్లాడుతూ, జనవరి 4వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని చెప్పారు. ఎంఈవో నగేశ్ మాట్లాడుతూ ఎనిమిదో తరగతి 230 విద్యార్థులకు ఈ నెల 21వ తేదీన ట్యాబ్స్ ఇస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యురాలు పెట్ల సత్యవేణి, వైస్ ఎంపీపీలు రాజారావు, రుత్తల లక్ష్మి, సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T00:40:25+05:30 IST